హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): విద్యాసంవత్సరం మధ్యలో బ్యాంక్ ఖాతాలు ఉన్న గురుకుల విద్యార్థులకే కాస్మెటిక్ చార్జీలు చెల్లిస్తామనే నిబంధనను తొలగించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రజనీకాంత్, కార్యదర్శి టీ నాగరాజు సోమవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు నేరుగా అందజేయడం వల్ల సకాలంలో అందుతాయని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలు ఉన్న విద్యార్థులకు వారి ఖాతాల్లో జమచేస్తామనే కొత్త నిబంధనతో విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. చాలా మంది విద్యార్థులకు బ్యాంకు అకౌంట్స్లేవని, మైనర్లు కావడంతో బ్యాంకులు అకౌంట్స్ ఇవ్వడం లేదని, చాలా మందికి ఆధార్‌కార్డులు కూడా లేవని వెల్లడించారు. దీంతో విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు అందే అవకాశం లేకుండా పోతున్నదని పేర్కొన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఇలాంటి నిబంధనలు తీసుకురావడం వల్ల పేద విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నదని, ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని రజనీకాంత్, నాగరాజు డిమాండ్ చేశారు.