జూబ్లీహిల్స్, జనవరి 26: దేశంలో సమాఖ్యవాదం బలహీనపడుతున్నదని, సంక్షేమ చట్టాలను నీరుగారుస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు కాన్స్టిట్యూషన్ కాన్క్లేవ్-2026 నిర్వహించారు. ‘రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సమకాలీన సవాళ్లు’ అంశంపై సోమవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రీకృత వ్యవస్థ పెరుగుతున్నదని, సమాఖ్యవాదం బలహీనపడుతున్నదని, ప్రజాస్వామిక వ్యవస్థలు కుదించుకుపోతున్నాయని, అసమ్మతిపై ఆంక్షలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. విస్తరిస్తున్న అరాచకవాదం పట్ల జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు. రాజ్యాంగపరమైన నైతికతను పాటించాలని, సామాజిక పరివర్తనకు రాజ్యాంగాన్ని ఒక పరికరంగా ఉపయోగించాలని ఉద్బోధించారు.
సీడీఎస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ప్రముఖ సంపాదకుడు కే రామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. రాజ్యాంగ పద్ధతులతోనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని అన్నారు. రాజ్యాంగంపై అవగాహనను సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో సీడీఎస్ పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. రాజ్యాంగాన్ని బలోపేతం చేయాల్సిన అంశంపై ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్, భారత రాజ్యాంగాన్ని అమలుచేయడంలో విఫలమైన అంశాలను హెచ్‌సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, రాజ్యాంగంపై చర్చలకు వేదికగా నిలిచిన సీడీఎస్ పాత్రపై ఏపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రసంగించారు. రాజ్యాంగం విలువలు, సామాజిక న్యాయం అంశాలపై డాక్టర్ వినోద్‌కుమార్, డాక్టర్ కృష్ణకుమార్, అరుణ సంగపల్లి, గీతానందన్, కెప్టెన్ దినేశ్‌చంద్ర, విమల విశ్వప్రేమి, అభిరామి జ్యోతీశ్వరన్, డాక్టర్ రెహనమూల్, ప్రొఫెసర్ శ్రీదేవి గుమ్మడి, సామాజిక కార్యకర్త రీటా కొశాక్, న్యాయవాది మంజుల ప్రదీప్, సుప్రీంకోర్టు న్యాయవాది దిశ తదితరులు ప్రసంగించారు.