హైదరాబాద్, జనవరి 26(నమస్తే తెలంగాణ) : బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా సామాన్య మహిళల్లోనూ అవగాహన పెరిగిందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ధావలె తెలిపారు. రెండో రోజు మహాసభల ప్రతినిధుల సమావేశాల సందర్భంగా సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి హాజరైన మహిళలు రాష్ట్రాల వారీగా స్థానిక పరిస్థితులతో పాటు అంతర్జాతీయ, జాతీయ రాజకీయ పరిస్థితులు, ఐద్వా కేంద్ర కమిటీ నివేదికపై చర్చించినట్టు పేర్కొన్నారు. మణిపూర్‌లో సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించేందుకు వీలుగా ప్రజల మధ్య విద్వేషాలను ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నారని ధావలె ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ రాష్ట్రంలో మహిళలపై హింస, లైంగికదాడుల ఘటనల్లో ఒకరిని కూడా శిక్షించలేదని, ఒత్తిడి పెరిగిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రిని మార్చినా శాంతియుత పరిస్థితుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తప్పుపట్టారు. తమిళనాడులో పోరాటాల ఫలితంగా అకడి ప్రభుత్వం మైక్రోఫైనాన్స్, కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా బిల్లును తెచ్చినట్టు ధావలె చెప్పారు. బీజేపీ పాలిత ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడలేని భయంకర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమకారులు, బాధితులను బీజేపీ నాయకులు అదే పనిగా బెదిరిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర, ఒడిశాలో బీజేపీ మహిళలకు, ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయకుండా మహిళలపై మత ఘర్షణలు, హింసను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. పుదుచ్చేరిలో రేషన్‌కు బదులుగా నేరుగా నగదు బదిలీ చేస్తున్నారని, ఇది ఆహారభద్రతకు విఘాతం కలుగుతున్నదని చెప్పారు. ఒడిశాలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాగానే కుష్టు రోగులకు సేవలందిస్తున్న గ్రహం స్టెయిన్స్‌ను, ఆయన కుమారులను సజీవ దహనం చేసిన హంతకుడు ధారాసింగ్‌ను జైలు నుంచి వదిలేశారని ధావలే ఆందోళన వ్యక్తం చేశారు.
ఒడిశాలో పరిస్థితులు మరింత దిగజారాయని, హామీలను అమలు చేయకుండా బీజేపీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అనంతరం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులను నిరసిస్తూ పాలస్తీనా, వెనిజువెలాకు సంఘీభావంగా తీర్మానాలను ఆమోదించినట్టు ఐద్వా పీకే శ్రీమతి టీచర్ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ మరో తీర్మానం చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ముస్లింలు, క్రైస్తవులతో పాటు ఇతర అల్పసంఖ్యాక వర్గాలపై దాడులను నిరసిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. మైనారిటీలపై పార్లమెంట్ లోపల, బయట ఆర్ఎస్ఎస్ ద్వేషభావాల్ని వ్యాపింపజేస్తోందని ఆమె విమర్శించారు. ఏఐకెఎస్, సీఐటీయూ, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఆల్ ఇండియా వరింగ్ ఉమెన్స్ కో ఆర్డినేషన్ కమిటీ తదితరులు మహాసభల విజయవంతాన్ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షల సందేశాలనిచ్చారని తెలిపారు. అంతకుముందు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐద్వా మాజీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలినీ భట్టాచార్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేరళ ఉన్నత విద్యాశాఖమంత్రి ఆర్ బిందు.. ఐలమ్మ కళాప్రదర్శనను ప్రారంభించారు.