Congress | హైదరాబాద్ సిటీబ్యూరో/అల్లాపూర్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి (Congress) వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నేతల భూకబ్జాలు, దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు, కాంగ్రెస్ నేతల ప్రధాన అనుచరులు, బంధువులు భూకబ్జాలకు తెగబడుతున్న ఉదంతాలు పదుల సంఖ్యలో వెల్లడవుతున్నాయి. ప్రైవేట్ వ్యక్తులను బెదిరించి, భయబ్రాంతులకు గురిచేస్తూ భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కూకట్పల్లి (Kukatpally) మండల పరిధిలోని సర్వేనంబర్ 1002లో 1452 గజాల పట్టా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించటం కలకలం రేపింది. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ (Madhuyashki Goud) సోదరుడు సంతోష్‌గౌడ్ ఆయన అనుచరులు బుల్డోజర్తో ఫెన్సింగ్ తొలగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బాధితులు ఆ స్థలం తమదేనని, అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని వేడుకున్నా వినకుండా గూండాగిరీ ప్రదర్శించారు. పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నా ప్రేక్షక పాత్ర వహించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కూకట్‌పల్లిలోని ఎస్బీఐ బ్యాంకర్స్ కాలనీ భాగ్యనగర్ సొసైటీకి చెందిన సర్వేనం-1007 ప్లాట్ నం-1లో సంతోష్‌గౌడ్‌కు 752 గజాల స్థలం ఉన్నది. కాగా ఇదే సర్వే నంబర్లోని సమారు 349 ఎకరాల భూమి కోర్టు వివాదంలో ఉన్నది. దాన్ని ఆనుకొనే సర్వే నం-1002లో 3.35 ఎకరాల భూమి ఉంది. ఇందులో 2.38 ఎకరాల స్థలంలో విష్ణువిస్తారా నిర్మాణ సంస్థ హైరేంజ్ అపార్ట్మెంట్స్ నిర్మించింది. మరో 25 గుంటల స్థలం రోడ్డు విస్తరణలో పోయింది. మిగిలిన 12 గుంటలలో 2022లో ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు జీహెచ్ఎంసీ అనుమతులతో ఒక గది నిర్మించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆ తరువాత నిరుడు ఈ స్థలాన్ని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పెట్టుకునేందుకు కటికనేని హరితకు లీజుకు ఇచ్చారు. హరితకు చెందినవారు శుక్రవారం స్థలాన్ని చుదును చేసేందుకు పనులు ప్రారంభించారు. ఇంతలో సంతోష్‌గౌడ్ అనుచరులు వచ్చి తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. తమ వద్ద ఉన్న పత్రాలు చూపించినా వినకుండా.. ‘అన్న చెప్పిండు.. ఈ స్థలం మాది మీరు ఇక్కడ పనులు చేయకూడదు’ అంటూ గూండాగిరీకి దిగారు. జీహెచ్ఎంసీ, పోలీసుశాఖ, ఎంఆర్వో, కలెక్టర్, ఆర్డీడీ సర్వేలు జరిపి అనుమతులు ఇచ్చినా అధికార బలంతో కాంగ్రెస్ నాయకులు గూండాలతో దాడిచేస్తున్నారని మండిపడుతున్నారు.