Sarpanch Elections | కోదాడ, నమస్తే తెలంగాణ: ఎవరు గెలిస్తే మనకేంటి.. మన దొడ్లో దూరితే చాలు.. అన్న చందగా ఉంది అధికార కాంగ్రెస్ నియోజకవర్గ నేతల పరిస్థితి. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. తొలినుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నవారు.. అధికారం వచ్చిన తర్వాత పార్టీలో ఇబ్బడి ముబ్బడిగా చేరిన నాయకుల మధ్య సర్పంచ్ ఎన్నికలు వివాదానికి తెరతీశాయి. అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఈ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడటం విశేషం.
తాము బలంగా ఉన్నచోట కాంగ్రెస్ రెబల్ శ్రేణులతో పోటీ చేస్తూ వారు బలంగా ఉన్నచోట బీఆర్ఎస్ మద్దతిస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది.. . కాగా ఈ మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రం అధికారికంగా గుర్తులు లేకపోవడంతో తాము మద్దతిచ్చిన అభ్యర్థులు ఓడినప్పటికీ గెలిచిన వారు కూడా తమ వారేనని కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు సన్నాహాలు చేస్తుండటం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తుంది. మెజారిటీ గ్రామ పంచాయతీల అభ్యర్థుల ఎంపికలు అధికార పార్టీ అధికార అభ్యర్థులుగా ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంలో పార్టీ పరువు దక్కించుకునేందుకు గెలిచిన అభ్యర్థులను తమ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు నియోజకవర్గ ముఖ్య నాయకులకు పురమాయించినట్లు తెలుస్తుంది.
గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు నానా కష్టాలు పడ్డామని తమ గ్రామాలలో మెజారిటీ వచ్చేందుకు సొంత డబ్బులు ఖర్చు పెట్టామని, అయినప్పటికీ అధికార అభ్యర్థులుగా తమను ప్రకటించలేదని ఈ పరిణామంలో ఆయా గ్రామాలలోని రెబల్ అభ్యర్థులు బీఆర్ఎస్ ఇతరుల మద్దతుతో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నికల బరిలో నిలిచి గెలిచామని ఇప్పుడు పార్టీ కండువా కప్పుకోమంటే ఓట్లు వేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిబంధనలను పాటించాల్సిన కోదాడ చిలుకూరు మండల పార్టీ అధ్యక్షులే విస్మరించి ఒకరు అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా రెబెల్ అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలిపితే మరొకరు ఏకంగా తన గ్రామంలో పార్టీ అభ్యర్థిని నిలపకుండా టీడీపీ అభ్యర్థిని గెలిపించడం పట్ల నిబద్ధత గల కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కష్ట కాలంలో జెండా మోసిన వారిని కాదని ఇటీవల పార్టీలోకి వచ్చిన మోతుబరులకు మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. తమ గ్రామాలలో పార్టీ పక్షాన నియోజకవర్గ స్థాయి నాయకులు కనీస ప్రచారానికి నోచుకుపోవడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడప్పుడే తాము పార్టీ కండువా కప్పుకోలేమని మాట దాటవేస్తున్నట్టు తెలుస్తోంది