తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల అవినీతి, అక్రమాలపై.. పాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్‌తో కాంగ్రెస్ నేతల గుండెల్లో వణుకు మొదలైంది. డేట్, టైమ్, ప్లేస్ ఏదైనా సరే.. ప్రెస్క్లబ్లోనా? అశోక్నగర్లోనా? అసెంబ్లీలోనా? వేదిక ఏదైనా సరే.. బీఆర్ఎస్ తరఫున చర్చకు సిద్ధమని కేటీఆర్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ తరఫున ఎవరొస్తారో తేల్చుకోవాలని కేటీఆర్ విసిరిన సవాల్, రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు కాంగ్రెస్ నేతల ఉత్తరకుమార ప్రగల్భాలు బూమరాంగ్ అయ్యాయి.
కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను, వారి అవినీతి తిమింగలాల లెక్కలను సాక్ష్యాలతో నిరూపించకపోతే.. తాను రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకొంటానంటూ కేటీఆర్ చేసిన భీషణ ప్రతిజ్ఞ.. ఆయనకు ప్రజలపై ఉన్న నమ్మకానికి, నైతిక విలువలకు నిదర్శనం. కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నామంటూ మొదట అహంకారంతో బీరాలు పలికారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తీరా చర్చా వేదికగా మారిన ’తెలంగాణ భవన్’ వైపు రావడానికి మాత్రం ఆయనకు ధైర్యం చాలలేదు. కేటీఆరే స్వయంగా వేచి చూసినా.. జూపల్లి మాత్రం చర్చకు రాకుండా పక్కదారి పట్టి తోకముడిచారు. మీడియా ఎదుట గంతులు వేసిన ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు.. చివరకు కేటీఆర్ ముందుకురాలేక పారిపోయారు.
చేతగాని మాటలు మాట్లాడటం, దిక్కుతోచక పారిపోవడం కాంగ్రెస్ మంత్రులకు అలవాటుగా మారింది. నిజంగానే కాంగ్రెస్ పాలనలో అవినీతి లేకపోతే తెలంగాణ భవన్‌కు వెళ్లి చర్చించే దమ్ము ఎందుకు లేకపోయింది? ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పాలకుల అసమర్థత, పిరికితనం స్పష్టంగా బయటపడింది. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పాలనను గమనిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్‌కు కాలంచెల్లే రోజులు దగ్గరపడ్డాయి. మంత్రుల అహంకారానికి, చేతగానితనానికి గురువారం నాటి ’తెలంగాణ భవన్’ పరిణామాలు నిలువుటద్దంగా నిలిచాయి. చర్చకు రమ్మని ఖాకీలను అడ్డుపెట్టుకొని పారిపోవడం మంత్రులకే చెల్లింది. అధికార అహంకారంతో విర్రవీగుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే చర్చలను పోలీసుల లాఠీలు, అక్రమ అరెస్టులతో అణచి వేయాలని చూడటం రేవంత్‌రెడ్డి పిరికితనానికి పరాకాష్ట. ‘నేను తెలంగాణ భవన్‌కు గురువారం ఉదయం 11 గంటలకు వస్తా.. దమ్ముంటే చర్చకు రండి‘ అంటూ స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు రంకెలేశారు. బాధ్యతాయుతమైన మంత్రి విసిరిన చాలెంజ్‌ను బీఆర్ఎస్ అంతే హుందాగా స్వీకరించింది.
మంత్రి జూపల్లి కోసం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ఓ కుర్చీ వేసి, లెక్కలతోపాటు బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా కూర్చున్నారు. తీరా సమయం దగ్గరపడేసరికి. తమ రెండున్నరేండ్ల పాలనలో అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందోననే భయం కాంగ్రెస్ గుండెల్లో మొదలైంది. కేటీఆర్, హరీశ్‌రావు లెక్కల ముందు తాము నిలబడలేమని గ్రహించిన రేవంత్ సర్కార్.. వెంటనే పోలీసులను రంగంలోకి దించింది.
సవాల్‌కు భయపడిపోయిన ప్రభుత్వ పెద్దలు.. తెలంగాణ భవన్ చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చు అంటూ లేనిపోని సాకులు వెతికారు. ఇంతలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు గింగిరాలు తిరిగి మాట మార్చారు. ‘తెలంగాణ భవన్ కాదు.. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గరికి రావాలి‘ అంటూ నాలుక మడతేశారు.
బీఆర్ఎస్ నేతలు, గన్‌పార్క్‌కు వెళ్లడానికి కూడా సిద్ధమయ్యారు. గన్‌పార్క్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావును, ఇతర నేతలు, కార్యకర్తలను తెలంగాణ భవన్ గేటు దాటకముందే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. మంత్రులే చాలెంజ్ విసిరి గన్‌పార్క్‌కు రమ్మన్నారు.. తీరా అక్కడికి పోతుంటే పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమంగా నిర్బంధించారు. ఇదా కాంగ్రెస్ తరహా ప్రజాస్వామ్యం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? చర్చించే దమ్ము లేక, పోలీసుల వెనుక దాక్కుని విపక్ష నేతలను జైల్లో పెట్టించడం ఏ రకమైన రాజకీయం?
ఇవన్నీ ఒక ఎత్తయితే.. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలోని ఇంకో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడిన మాటలు చూసి జనాలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలను ఇండ్ల నుంచి బయటకు రాకుండా అరెస్టు చేయించి.. మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి ‘బీఆర్ఎస్ నేతలెవరూ గన్‌పార్క్ వద్దకు చర్చకు రాలేదు‘ అని అబద్ధాలు చెప్తున్నారు. రమ్మనడం, అరెస్ట్ చేయించడం, మళ్లీ ఎవరూ రాలేదని తప్పుడు ప్రచారం చేయడం అంతా.. ప్రజానీకం గమనిస్తున్నారు. ఇదేం దిక్కుమాలిన పద్ధతి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా నడుస్తున్నది. తాము ఏం చేసినా ప్రజలు చూస్తూ ఊరుకుంటారని రేవంత్ సర్కార్ భ్రమిస్తున్నది. కానీ.. మంత్రుల పిరికితనానికి, దొంగ నాటకాలకు తెలంగాణ సమాజం గట్టి సమాధానం చెప్తుంది. పోలీసుల లాఠీల వెనుక దాక్కుని ఎన్నాళ్లు పాలిస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు త్వరలోనే ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ) పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి