న్యూఢిల్లీ, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యనేతకు అనుక్షణం పదవీ గం డం వెంటాడుతున్నదా? ఆయనను పదవి నుంచి తొలిగించాలని ఇప్పటికే మూడుసార్లు అధిష్ఠానం నిర్ణయించగా, అనివార్య కారణాలతో నిలిచిపోయిందా? అందుకే ముఖ్యనేత ప్రతి సిఫారసును పక్కనబెట్టడంతోపాటు ప్రత్యేక దూతతో నిఘాపెట్టారా? ఈ విష యం తెలిసి ముఖ్యనేత నిర్వేదంలో కూరుకుపోయారా? ఎన్నాళ్లు ఉంటామో తెలియదనే భావనతో.. తనకు నచ్చినట్టే వ్యవహరిస్తున్నారా? ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్‌లో, గాంధీభవన్‌లో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఇది. ఢిల్లీ-హైదరాబాద్ మధ్య పదిరోజులకు ఒకసారి తిరిగినా.. 50 సార్లకు పైగా పెద్దాఫీసు చుట్టూ చక్కర్లు కొట్టినా ముఖ్యనేతకు, అధిష్ఠాన పెద్దలకు మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోయిందట. దీంతో ఎప్పటికైనా ఈ పార్టీ మనది కాదని తన సన్నిహితుల వద్ద వ్యా ఖ్యానించినట్టు సమాచారం. పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు కాబట్టి అధిష్ఠానం ఆదేశాలను,సూచనలను పక్కనబెట్టి పాలనలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చర్చ జరుగుతున్నది. మంత్రుల స్వేచ్ఛను కుదించి, 16 కీలక శాఖలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని, అక్కడ తనకు నచ్చినవారికే పోస్టింగ్‌లు ఇస్తూ పట్టుబిగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధికారానికి దగ్గరగా వచ్చేవాళ్లం
పార్లమెంటు ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచానని అగ్రనేత అనుమానిస్తున్నట్టు ముఖ్యనేత తన సన్నిహితుల వద్ద వాపోయారట. జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన రహస్యాలను వైరిపక్షం నేతలకు చేరవేశాడని అగ్రనేత భావిస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తెలుగురాష్ర్టాల్లో బీజేపీ పుంజుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముఖ్యనేతే కారణమని ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారట. చీటికిమాటికి ఢిల్లీకి వెళ్లడం, కేంద్ర మంత్రులను కలవడం, మోదీ అపాయింట్మెంట్ కోరడం, మోదీని బడేభాయ్గా సంభోదించటం, తాను మోదీ స్కూల్ అంటూ ప్రశంసలతో ముంచెత్తడం వంటివి పరోక్షంగా బీజేపీకి సాయపడ్డాయని భావిస్తున్నారట. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా అభ్యర్థులను ఎంపిక చేశారన్న ఆరోపణలను, ఏపీలో బీజేపీ కూటమి పుంజుకోవడానికి సాయం చేశారన్న వార్తల ఆధారంగా ముఖ్యనేత వల్ల రెండు తెలుగురాష్ర్టాల్లో తీవ్రంగా నష్టపోయామని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన లేకపోతే.. రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి కనీసం 10-12 ఎంపీ సీట్లు వచ్చేవని, ఆ మేరకు బీజేపీకి తగ్గేవని లెక్కలు వేస్తున్నాట. ఇదే జరిగితే జాతీయ స్థాయిలో యూపీఏ కూటమి బలం పెరిగేదని, నితీశ్‌కుమార్ వంటివారు మద్దతు పలికేవారని, ఏపీకి చెందిన పార్టీలు కూడా యూపీఏలో చేరేవని, తద్వారా రాహుల్‌గాంధీ ప్రధాని పదవికి దగ్గరగా వచ్చేవాడని విశ్లేషిస్తున్నట్టు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై అంటీముట్టనట్టు వ్యవహరించడం, తదితర అంశాలు కూడా ముఖ్యనేత ఇమేజ్ను ఢిల్లీలో తీవ్రంగా దెబ్బకొట్టినట్టు అక్కడి నేతలు చెప్తున్నారు.
ఢిల్లీ పెద్దల సమాంతర పాలన
పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద జరిగిన రివ్యూ అనంతరం ముఖ్యనేతను పూర్తిగా పక్కన పెట్టాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్టు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అందుకే అప్పటిదాకా పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించిన దీపాదాస్‌మున్షీని పక్కకు తప్పించారని, అగ్రనేతకు అత్యంత నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్‌ను ఢిల్లీ దూతగా హైదరాబాద్‌కు పంపినట్టు పేర్కొంటున్నారు. అప్పటి నుంచి అన్ని రకాల ప్రభుత్వ నామినేటెడ్, పార్టీ పదవులను మీనాక్షి సిఫారసు మేరకే భర్తీ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ కూడా మీనాక్షి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే జరిగిందని సమాచారం. ముఖ్యనేత ఇచ్చిన జాబితాను పూర్తిగా పక్కన పడేశారని, చివరికి ఆయన పట్టుబట్టిన అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి కూడా మంత్రి పదవి రాకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా కొత్త మంత్రులకు ఏయే శాఖలు ఇవ్వాలనే విషయంపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని అధిష్ఠానం నుంచి ముఖ్యనేతకు పిలుపు వచ్చిందని, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని గుసగుసలు వినిపిస్తున్నా యి. ఇదే సమయంలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు స్వయంగా అగ్రనేతను కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్చేసిన సంగతి తెలిసిందే. ఇక.. మీనాక్షి ఎప్పటికప్పుడు కీలక మంత్రులు, ఎ మ్మెల్యేలు, నేతలతో రివ్యూలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా టీపీసీసీని, తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తిగా ఢిల్లీ పెద్దలు తమ చేతుల్లో కి తీసుకున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది.
అధిష్ఠానం ఆదేశాలను పక్కన పెట్టి ..
తాజా పరిణామాలతో ముఖ్యనేత కూడా ఆవేదన చెందినట్టు సమాచారం. ఎంతకాలం ఉన్నా మోసుడు బతుకు తప్పదని, అన్నీ అధిష్ఠానం నిర్ణయానికే వదిలేసి పదవిని పట్టుకొని ఉందామన్నా, అక్కడ ఉండనిచ్చే పరిస్థితి లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఎంతకాలం ఉన్నా మనవాడు కాదని రాహుల్‌గాంధీ అనడం ఏంటి? ఇంత అంతరం పెరిగిన తర్వాత ఎప్పటికైనా ఈ పార్టీ మనది కాదు’ అని ముఖ్యనేత పేర్కొన్నారట. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆదేశాలను, సూచనలను పక్కనపెట్టి సొంత ఎజెండాతో పరిపాలన చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. 16 కీలక శాఖలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని, ఆయాశాఖల్లో తను అనుకున్న అధికారులకే బాధ్యతలు అప్పగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రుల ప్రమేయం లేకుండా హెచ్‌వోడీల ద్వారా నేరుగా ఆయా శాఖల్లో పనులు చేయించుకుంటున్నారని సమాచారం. అదే సమయంలో మంత్రులతోనూ కటువుగా ఉంటున్నట్టు చర్చ జరుగుతున్నది. వారి పనితీరును మెరుగుపరుచుకోవాలని, స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎకడికకడ మంత్రులపైనే ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. రూ.కోటికి మించిన ప్రతి బిల్లు కూడా ముఖ్యనేత నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే విడుదల చేస్తామని అధికారులు తేల్చి చెప్పినట్టు చర్చ జరుగుతున్నది. పాదయాత్రలో మీనాక్షిని హైలెట్ చేయడంపైనా ముఖ్యనేత గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ‘తెలంగాణ ప్రజలు నన్ను చూసి ఓటేశారు, మధ్యలో ఆమె పెత్తనం ఏమిటి?’ అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితులు నానాటికి జటిలం అవుతున్నాయని, రానురాను ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.
అగ్రనేతను మార్చాలని ప్రతిపాదన
ముఖ్యనేతను అగ్రనేత ముఖాముఖి కలవక ఇప్పటికి ఏడాది దాటిపోయింది. వెన్నుపోటు ఉదంతం వెలుగులోకి వచ్చినప్పుడే ఆయనను పదవి నుంచి మార్చాలని అనుకున్నారట. సమయం అనుకూలించలేదని ఢిల్లీవర్గాలు చెప్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కూడా గడవకముందే మార్చేస్తే దేశవ్యాప్తంగా పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఏఐసీసీ కార్యదర్శి అడ్డుపడ్డట్టు హస్తిన కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరికొన్ని రోజులు వేచి చూడాలని అగ్రనేతకు చెప్పి ఒప్పించారట. ఈ ఏడాది జనవరిలో మరోసారి ముఖ్యనేతను మార్చాలన్న ప్రతిపాదన అధిష్ఠానం ముందుకు వచ్చిందని సమాచారం. బీజేపీ అండతో ఆయన పార్టీని చీల్చి, మెజార్టీ ఎమ్మెల్యేలను తన వెంట తీసువెళ్లే అవకాశం ఉన్నదని సీనియర్లు హెచ్చరించారట. ఇదే జరిగితే తెలంగాణలో అధికారం కోల్పోతామని, తిరిగి మళ్లీ వచ్చే అవకాశమే ఉండదని మాజీ ఢిల్లీ దూత అధిష్ఠానానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో రెండోసారి గండం తప్పిందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వెంట ఎనిమిదికి మించి ఎమ్మెల్యేల బలం లేదని, వారిలోనూ చివరి నిమిషంలో ఇటువైపు మారవచ్చని అధిష్ఠానానికి నివేదిక అందినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో ముఖ్యనేతను నుంచి తొలగించాలని ఢిల్లీ పెద్దలు అనుకున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో మార్పు సరికాదని, ఇప్పటికే పార్టీపై ప్రజావ్యతిరేకత ఉందని, సీఎం మార్పు మరింత వ్యతిరేకత పెంచుతుందని ఏఐసీసీ నేత ఒకరు హెచ్చరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మూడోసారి గండం తప్పిందని అంటున్నారు.