ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ( Congress leaders) చెందిన నాయకులు, అనుచరులు బీఆర్ఎస్లో ( BRS) చేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలంలోని తలమద్రి గ్రామ మాజీ సర్పంచ్ నాగోరావ్ , మాజీ ఉప సర్పంచ్ అడేళ్లు, వారి అనుచరులు దాదాపు 100 మంది అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ( MLA Anil Jadav ) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు
. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ అడేళ్లు మాట్లాడుతూ మోసపూరిత కాంగ్రెస్ పార్టీని వీడి ఇంటి పార్టీలో చేరుతున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. అబద్దపు హామీలు, అమలు కాని హామీలతో అధికార పీఠం ఎక్కిన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని తేలిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని , తమను దొంగళ్ల చూస్తున్నారని చెప్పి రాష్ట్ర పరువు తీశారని ఆరోపించారు.
ఎలాంటి సమయంలోనైనా కష్టం అని తలుపు తడితే అండగా నిలుస్తూ ఎమ్మెల్యేల పనితీరులో, రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచిన అనిల్ జాధవ్ క్రేజ్ ను చూసి బీఆర్ఎస్ లో చేరామని వెల్లడించారు. ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుందని, ముఖ్యమంత్రే రాష్ట్ర పరువును తుంగలో కలుపుతున్నారని విమర్శించారు. ప్రజలు తిరిగి కేసీఆర్ ను కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఇకపై భవిష్యత్ ఉండదని తేలిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.