Jagga Reddy | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు రావడానికి హరీశ్‌రావు కారణమని చేసిన ఆరోపణలను ఖండించారు. కవిత చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాను హరీశ్‌రావుపై కోపంతో కాంగ్రెస్‌లోకి రాలేదని తెలిపారు. తాను బీఆర్ఎస్ వీడటానికి హరీశ్‌రావు కారణం కాదని పేర్కొన్నారు. కేసీఆర్ కుమార్తె స్టేట్మెంట్ రాంగ్ అని అన్నారు. కేసీఆర్ కూతురు కాబట్టే కవిత లీడర్ అయ్యారు.. అందుకే ఆమెను కేసీఆర్ కుమార్తె అంటున్నా అని వివరించారు.
తాను కాంగ్రెస్‌లోకి రావడానికి వైఎస్ఆర్ కారణమని జగ్గారెడ్డి తెలిపారు. తన పనితీరు నచ్చి కాంగ్రెస్‌లోకి రావాలని వైఎస్ఆర్ పిలిచారని చెప్పారు. తన మీద సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కవిత తనపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
నేను కొంత డిస్ట్రబ్ అయ్యానని జగ్గారెడ్డి తెలిపారు. అందుకే ఎవరి ఫొటోలు వద్దు.. రాహుల్ గాంధీ ఫొటో ఒక్కటే పెట్టాలని చెప్పానని పేర్కొన్నారు. అన్నీ ఇప్పుడే చెప్పను.. సమయం వచ్చినప్పుడు చెప్తానని అన్నారు. ఎవరి వల్ల డిస్ట్రబ్ అయ్యాననేది మే నెలలో చెబుతానని ప్రకటించారు. నేను డిసైడ్ అయ్యాక వెనక్కి రాను, ముందుకెళ్తా అని స్పష్టం చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవిపై కూడా ఆసక్తి లేదని స్పష్టం చేశారు.