Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హారర్, కామెడీ, రొమాన్స్ మేళవింపుతో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా, ప్రభాస్ కెరీర్లో ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్గా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందన్న రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సంక్రాంతి బరిలో ఇతర పెద్ద సినిమాలు ఉండటం, ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ కారణంగా రిలీజ్ ఆలస్యం అవుతుందన్న ప్రచారం అభిమానులను కలవరపెట్టింది.
ఈ నేపథ్యంలో మరోసారి స్పష్టత ఇస్తూ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ‘ది రాజాసాబ్’ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 9న సంక్రాంతి కానుకగానే థియేటర్లలో విడుదలవుతుందని అధికారికంగా వెల్లడించారు. దీంతో వాయిదా రూమర్స్‌కు పూర్తిస్థాయిలో చెక్ పడినట్టైంది. విడుదల తేదీకి నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో, ఇలాంటి పుకార్లు వ్యాప్తి చెందడంపై నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, భారీ యాక్షన్ చిత్రాలతో పాటు వినోదాత్మక కథలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆ కోవలోనే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ప్రభాస్–మారుతి కాంబినేషన్ అంటేనే ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజు పండగే’ తరహా ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్న అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ, రొమాన్స్ కలిపి రూపొందుతున్న ఈ కథలో ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని కొత్త షేడ్‌లో చూపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ప్రమోషన్ల విషయంలో కూడా మేకర్స్ గ్రాండ్ ప్లాన్ సిద్ధం చేశారు. ‘ది రాజాసాబ్’ కోసం రెండు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ముందుగా యూఎస్‌లో ఒక పెద్ద ఈవెంట్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లేదా విశాఖపట్నంలో మరో ఈవెంట్ జరగనుందని టాక్. ఇందులో ఒక ఈవెంట్ డిసెంబర్ 27న జరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్‌కు తగ్గట్టుగా విదేశాల్లోనూ అభిమానులను చేరువ చేసేందుకు ఈ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.