Ayurvedic Tips For Weight Loss | అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అధిక బరువు చాలా సులభంగా పెరుగుతారు. కానీ బరువు తగ్గడం చాలా అవస్థగా అనిపిస్తుంది. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, వేళకు నిద్రించడం చేస్తారు. ఈ క్రమంలోనే సరైన జీవనశైలిని పాటిస్తేనే బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది. అయితే బరువు తగ్గేందుకు పలు ఆయుర్వేద సూత్రాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. వాటిని పాటించడం వల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇంకా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
బరువు తగ్గాలని చూస్తున్న వారు ఆయుర్వేద ప్రకారం రోజూ ముల్లంగి రసాన్ని తాగుతుంటే ఎంతో ఫలితం ఉంటుంది. ముల్లంగి రసాన్ని పూటకు 3 టీస్పూన్ల చొప్పున రోజుకు 3 సార్లు తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ రసం సహాయం చేస్తుంది. అలాగే కరక్కాయ పెచ్చులను చూర్ణం చేయాలి. దాన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని అందులో అంతే మోతాదులో తేనె లేదా వేడి నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తున్నా కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా రేగు చెట్టు ఆకులను చిన్న ముద్దగా చేసి ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుతో కలిపి తీసుకోవాలి. ఇది కూడా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి రోజూ ఉదయం పరగడుపునే ఒక తమలపాకులో 5 మిరియాల గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసు నీటిని తాగాలి. ఈ చిట్కా కూడా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
ఆముదం ఆకులను కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిటికెడు చొప్పున తీసుకుని అందులో చిటికెడు ఇంగువ పొడిని కలిపి రెండు పూటలా బియ్యం కడిగిన నీళ్లతో కలిపి తీసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వాయు విడంగాల చూర్ణాన్ని తేనెతో కలిపి రెండు పూటలా తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇక బరువు తగ్గేందుకు గాను పలు ఆయుర్వేద సూచనలను కూడా పాటించాల్సి ఉంటుంది. రోజూ ఆహారంలో అన్ని రుచులు కలిసిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అన్ని రుచులు ఉన్న ఆహారాలను రోజూ తినాలి. వేపుళ్లకు బదులుగా సాధారణ కూరలను తినాలి. భోజనం చేసినప్పుడల్లా జీర్ణాశయంలో కొద్దిగా ఖాళీ ఉండేట్లు తినాలి. అవసరం అయితే తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు భోజనం చేయాలి. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
బరువు తగ్గాలని చూస్తున్నవారు వ్యాయామానికి ముందు 2 టీస్పూన్ల తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. ఓట్స్, బార్లీ, చిరుధాన్యాలు, ఏడాది పాతబడిన బియ్యం, బ్రౌన్ రైస్ వంటివి తింటుంటే ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితిలోనూ చల్లని నీళ్లను తాగరాదు. గోరు వెచ్చని నీళ్లనే తాగాల్సి ఉంటుంది. అలాగే మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే నీళ్లను స్నానానికి ఉపయోగించకూడదు. దీని వల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. కేవలం గోరు వెచ్చని నీళ్లను మాత్రమే స్నానానికి వాడాలి. అలాగే ఆహారంలో పెరుగుకు బదులుగా పలుచని మజ్జిగను తీసుకుంటుంటే ఉపయోగం ఉంటుంది. ఇలా పలు చిట్కాలు, ఆయుర్వేద సూత్రాలను పాటిస్తే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.