Congress | హైదరాబాద్, నవంబర్ 18 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఏంచేసైనా గెలవాలి. అధికారాన్ని చేపట్టాలి. అందుకోసం ఎలాంటి హామీలనైనా గుప్పించాలి. వాటి అమలుకు నిధులు సరిపోతాయా? లేదా? అనేది అవసరమే లేదు. ఒక్కసారి గద్దెనెక్కాక తీరిగ్గా హామీల అమలును అటకెక్కించాలి. చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ పార్టీ ఇటీవల కర్ణాటకలో అమలుచేసిన విధానమిదే. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే కుట్రకు తెరతీసింది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో గుప్పించిన 43 హామీల అమలు ఎలా సాధ్యమన్న చర్చ మేథోవర్గాల్లో పెద్దయెత్తున జరుగుతున్నది. ఆరు గ్యారెంటీలు సహా హామీలన్నింటిని అమలు చేయాలంటే రూ. 5 లక్షల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.2.9 లక్షల కోట్లే. మరి కాంగ్రెస్ హామీలు అమలు చేయాలంటే అదనంగా మరో రూ. 2.1 లక్షల కోట్లు కావాలి. వీటికి అదనంగా ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ ఖర్చులు తదితర వాటిని లెక్కిస్తే మొత్తంగా మరో రూ.4.1 లక్షల కోట్ల వరకు అప్పులు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలో ఉన్న మూడు రాష్ర్టాల బడ్జెట్లను కలిపినప్పటికీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలను నెరవేర్చడం సాధ్యమయ్యే పనికాదని నిపుణులు చెప్తున్నారు. కాంగ్రెస్‌పాలిత ఛత్తీస్‌గఢ్ బడ్జెట్ రూ. 1.21 లక్షల కోట్లు, హిమాచల్‌ప్రదేశ్ బడ్జెట్ రూ. 53,413 కోట్లు, ఇండియా కూటమి అధికారంలో ఉన్న బీహార్ బడ్జెట్ రూ. 2.61 లక్షల కోట్లు. ఈ మూడు రాష్ర్టాల మొత్తం బడ్జెట్ విలువ రూ. 4.3 లక్షల కోట్లు దాటట్లేదు. అయితే, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని అన్ని హామీలను సంపూర్ణంగా అమలు చేయాలంటే ఏటా రూ. 5 లక్షల కోట్లు కావాలి. ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ ఖర్చుల కోసం మరో రూ. 2.1 లక్షల కోట్లు అవసరమౌతాయి. ఇది సాధ్యంకాని పని. ప్రజలను మోసగించి అధికారంలోకి రావడానికే కాంగ్రెస్ బూటకపు హామీలను గుప్పించిందని తెలంగాణ మేధావులు మండిపడుతున్నారు.
5 గ్యారెంటీల పేరుచెప్పి కర్ణాటకలో ఇటీవల పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ఆ హామీల అమలులో ఘోరంగా విఫలమైంది. 5 గ్యారెంటీలను అమలు చేయాలంటే ఎన్ని నిధులు అవసరమైతాయి? అన్న దానిపై పెద్దగా కసరత్తు చేయలేదని, ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతోనే ఆ హామీలు ఇచ్చి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేయాలంటే ఏటా ప్రభుత్వ ఖజానాపై రూ. 62 వేల కోట్లకు పైగా భారం పడుతుంది. మొత్తం బడ్జెట్లో ఇది దాదాపు 20 శాతం. ఐదు గ్యారెంటీలతో అర చేతిలో వైకుంఠం చూపించి తమను కాంగ్రెస్ బురిడీ కొట్టించిందని అర్థమైపోవడంతో కన్నడ ప్రజలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో గెలిపిస్తే అదనంగా మరోటి కలిపి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ మాటలు నమ్మితే గోస తప్పదని తెలంగాణ ప్రజానీకాన్ని హెచ్చరిస్తున్నారు.