తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న ఏర్పడి ఇప్పటికి 2 ఏండ్ల 4 నెలలు గడిచింది. పరిపాలన పట్ల ప్రజల్లో, పార్టీ సంస్థాగత నిర్వహణ పట్ల అంతర్గతంగా ప్రకంపనలు మొదలయ్యాయి. భూకంపం వస్తున్నదని ఇంకా అనలేము. ఆ పరిణామం కూడా చోటుచేసుకుంటుందేమో అని అంచనా వేసేందుకు మరికొంత కాలం ఆగాలి. భూభౌతిక శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం, భూప్రకంపనలు ఒకసారి మొదలయితే అవి భూకంపానికి దారితీసినా తీయవచ్చు. ఇక్కడ మాట్లాడుతున్నది ఒక పార్టీ, దాని ప్రభుత్వం గురించి అయినందున, తదనంతర పరిణామాలు నాయకత్వ వ్యవహరణపై ఆధారపడతాయి. ప్రస్తుతానికి పార్టీ నుంచి జీవన్‌రెడ్డి నిష్క్రమణ మాత్రం ఒక పెద్ద ప్రకంపనే.
కాంగ్రెస్ ఒక పెద్ద పార్టీ. అధికారంలో ఉన్నది. అందులోకి ఎందరో వస్తుంటారు, పోతుంటారు. కానీ రాకపోకలన్నీ ప్రకంపనలను సృష్టించవు. అధిక భాగం అట్లా వచ్చిన వారికి పార్టీ కండువా కప్పి ఫొటో దిగటంతో, పోయిన వారిని కిందిస్థాయి నాయకులు ఒకటి రెండు మాటలనటంతో ముగిసిపోతుంది. పోయే వారి సమాచారం ముందుగా తెలిసినా అంతగా పట్టించుకోరు. జీవన్‌రెడ్డి విషయంలో జరిగిందేమిటో గమనించండి. వెళ్లవద్దంటూ పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఇతర నాయకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆయనకు పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. తను ఎంత ముఖ్యుడో గుర్తుచేశారు. ఇదంతా ఆయన నిష్క్రమణకు ముందు జరిగింది. చివరకు రాజీనామా చేసిన తర్వాత, మళ్లీ పీసీసీ అధ్యక్షుడు సహా వీరంతా, ఆయన నిర్ణ యం పట్ల విచారం వ్యక్తపరిచారు. బీఆర్ఎస్లో చేరటం తప్పు నిర్ణయమంటూ హెచ్చరించారు. ఈ మొత్తం పరిణామాల పొడవునా ఒకవైపు పార్టీ శ్రేణులు, మరొక వైపు సాధారణ ప్రజలు కూడా ఉత్కంఠతో గమనిస్తూ పోయారు.
విషయం ఏమంటే, జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నాయకుడు, అంతే ముఖ్యంగా అటువంటి అనుభవం, వ్యక్తిగత ప్రతిష్ఠ గలవాడు, కొన్ని దశాబ్దాల పాటు పార్టీని సేవించిన తర్వాత, మామూలు ధోరణిలో గాక ఎంతో వేదనపడి నిష్క్రమించవలసి రావటం సాధారణ విషయం కాదు. అందువల్లనే భూప్రకంపనలు అనదగ్గవి ఏర్పడ్డాయి. గత రెండేండ్ల 4 నెలల కాలంలో ఇటువంటి పరిస్థితి ఇదే మొదటిసారన్నది గమనించదగ్గ విషయం. పార్టీ శ్రేణులు, బయటి ప్రజల దృష్టికి వచ్చిన విశేషాలు కూడా మరికొన్ని ఉన్నాయి. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైనవి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వ వైఖరులు. ఎన్నికల్లో జయాపజయాలు సర్వసాధారణం. తనను పోయినమారు ఓడించిన బీఆర్ఎస్ వ్యక్తిని కాంగ్రెస్‌లోకి తీసుకోవటం సహజంగానే బాధ కలిగించినా, అంతవరకు కూడా జీవన్‌రెడ్డి క్రమంగా సమాధానపడి ఉండేవారేమో. నాయకత్వానికి కనీస స్థాయి వివేకం అంటూ ఉంటే, ఆయనకు మరింత బాధ కలిగించి అవమానించటం కాకుండా, ఇతరత్రా తగు గౌరవం కల్పిస్తూ సర్దుబాట్లు చేసి ఉండేది. ఆ చర్యలు వివేకం గల నాయకత్వం తనంతట తానే తీసుకుంటుంది.
కానీ జరిగిందేమిటి? అట్లా ముందు జాగ్రత్తలు తీసుకోకపోగా, జీవన్‌రెడ్డి తన వేదనను స్వయంగా తరచు వ్యక్తపరుస్తుండినా లెక్కచేయలేదు. పీసీసీ అధ్యక్షుడికి పట్టలేదు. ముఖ్యమంత్రి అయితే, జీవన్‌రెడ్డిని అవమానించి పార్టీలోంచి వెళ్లిపోయేట్లు చేయటమో లేక అవమానాలతో అట్లా పడి ఉండేట్లు చూడటమో తన రహస్య ఉద్దేశ్యమైనట్టు వ్యవహరించారు. ప్రభువు మనసు తెలిసినందున వల్ల కావచ్చు మిగిలిన నాయకులంతా తమ వెన్నెముకలకు బదులు చొప్ప కట్టెలను అమర్చుకొని దిక్కులు చూస్తూ పోయారు. ఇందుకు మించిన విశేషం ఢిల్లీ నాయకత్వం. అక్కడి పప్పూ ప్రతినిధి ఒకరు ఇక్కడ పర్యవేక్షకురాలిగా ఉన్నారు. ప్రస్తుత వ్యవహారంలో ఆమె పాత్ర గాని, తన ద్వారా ఇక్కడి సమాచారాలను తెలుసుకొనే పప్పూ పాత్ర గాని ఏమిటి? ఆమె నికార్సయిన గాంధేయురాలంటూ ప్రచారం చేశారు.
తన నియామకం జరిగి మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు రైలులో వచ్చి, ఆటోలో ప్రయాణించి, భుజానికి సాదా సంచీ వేసుకొని, తన సామాన్ల బ్యాగు తానే మోసుకొంటూ, నిరాండంబరం అన్నట్టు కళావిహీనంగా చూస్తూ కొంత సంచలనం సృష్టించారామె. తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏదో ఓ కార్యక్రమానికి వెళ్లి స్టేజీపైన కుర్చీలో కాకుండా కింద కూర్చొని గాంధీ రాట్నం వడకటం మొదలుపెట్టారు. ఆహా ఎంత నిబద్ధురాలైన గాంధేయవాదో కదా అని తమ పార్టీ వారినే గాక రాష్ట్రంలోని ఆబాలగోపాలాన్ని అబ్బురపరిచారు. తన గాంధేయవాదం ఎంత మేడిపండో ఆ తర్వాత కాలమంతా అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడామెను రేవంత్‌రెడ్డి సరే సరికాగా, గాంధీ భవన్ నుంచి మొదలుకొని కింది వరకు ఎవరూ పట్టించుకోవటంలేదు. సీరియస్‌గా మొహం పెట్టి కాలక్షేపం చేయటం కాకపోతే జీవన్‌రెడ్డి విషయంలో తను ఏదో ఒకటి చేయవలసింది. చేయలేనందుకు తన కన్నా తనను నియమించిన పప్పూను అనటం భావ్యంగా ఉండవచ్చు.
హైదరాబాద్‌లో ఒక దిష్టిబొమ్మగా ఉండటం తప్ప చేయవసిందేమీలేదని తనకు పప్పూ బాస్ చెప్పి ఉండాలి. స్వయంగా తనే ఏమీ చేయలేకపోతున్నందున. ఢిల్లీ నాయకత్వం రాష్ట్ర నాయకులను నియంత్రించగల దశ సోనియా గాంధీతో ముగిసిపోయింది. ఆ పని గాంధీ వంశపు కుక్క మూతి పిందెలు చేయలేవు. చేయగల శక్తి ఉండి చేయకపోవడం వేరు. కాని అటువంటి శక్తి అన్నదే లేక చేయకపోవడం వేరు. రాహుల్ గాంధీ ఈ రెండవ కోవలోకి వస్తారు. ఆ బలహీనతలు ఆయనలో ఒక వ్యక్తిగానే కాదు, కాంగ్రెస్ పార్టీ క్రమంగా క్షీణించిపోతున్న పరిస్థితుల్లో అంతర్గతంగా, అంతర్లీనమై, ఇమిడిపోయి ఉన్నాయి.
ఇదంతా రేవంత్‌రెడ్డి గ్రహించే ఉండాలి. ఆయన ఇతర లోపాలు, వైఫల్యాల మాట ఎట్లున్నా వక్రబుద్ధి తెలివికి మాత్రం కొరతలేదు. అందువల్ల జీవన్‌రెడ్డి వంటి నాయకుడిని అవమానించినా, పార్టీలోంచి వెళ్లిపోక తప్పని విధంగా పొగబెట్టినా, అక్కడి పప్పూ గాని, ఇక్కడి గాంధేయవాది గాని చేయగలది శూన్యమని ఆయన సరిగానే అర్థం చేసుకున్నారు. రూబిక్స్ క్యూబ్ కిటుకు ఒకసారి తెలిసిపోతే ఇక ఆట ఆడేందుకు ఎప్పుడూ కష్టపడనక్కరలేదు.
ఎందరు జీవన్రెడ్డిలతోనైనా ఏ విధంగానానైనా వ్యవహరించవచ్చు. నిర్జీవంగా చూస్తూ కూర్చుండే గాంధేయురాలికి గాని, అవసరాల కోసం ఉపయోగపడేందుకు తప్ప తెలంగాణ అనేది ఉనికిలోనే లేదన్నట్టు వ్యవహరిస్తున్న యువరాజుకు గాని జంకవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. అందువల్లనే, జీవన్‌రెడ్డి ఉదంతం మొదలై వారాలపాటు గడుస్తున్నా రాహుల్‌గాంధీ పరిస్థితి చక్కబెట్టేందుకు ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. పరిస్థితి నెహ్రూ కాలంలో ఎట్లుండేదో తెలియదుగాని, ఇందిర, రాజీవ్, సోనియా రోజుల్లో ఈ విధంగా ఎప్పుడూ లేదు. సోనియాగాంధీ అనారోగ్యం కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో ఎక్కువ క్రియాశీలంగా లేరు. కానట్టయితే బహుశా రాహుల్ తన అసమర్థతతో, రేవంత్ తన కుయుక్తుల ద్వారా, జీవన్‌రెడ్డి వంటి నాయకుడిని బయటకు గెంటి ఉండగలిగేవారు కాదు.
వ్యాధికి వ్యాధి లక్షణాలు ఉంటాయన్నది తెలిసిందే. అవి ముందే బయట పడుతాయి. భూకంపానికి ముందు భూప్రకంపనల వలె. వ్యాధి లక్షణాలకు ముందు మనిషి శరీరంలో, భూప్రకంపనలకు ముందు భూగర్భంలో మార్పులు చోటుచేసుకుంటాయి. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన రెండేండ్ల 4 నెలలు పూర్తి చేసుకుని ప్రస్తుత ప్రకంపనలు కనిపించటానికి కొంతకాలం ముందు నుంచే కొన్ని మార్పులు కనిపించటం మొదలైంది. అధికారానికి వచ్చినాక సుమారు ఆరు నెలల నుంచి ఏడాది వరకు మంద్రస్థాయిలో కాగా, తర్వాత నుంచి ప్రస్ఫుటంగా. ఆ సరికి తమంతట తాము పెట్టుకొన్న అన్ని గడువులు, ప్రజలు ఉదార స్వభావులు గనుక తామిచ్చే అదనపు గడువులు అన్నీ ముగిసిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రజలు సంతృప్తి చెంది చెప్పిన తీర్పులని ప్రచారం చేసుకుంటున్నారు.
ప్రజల ఆలోచనలు, ఓటింగ్ బిహేవియర్ గురించి తగిన అవగాహన లేని వారు చేసుకునే ప్రచారమది. అందువల్ల దానిని వదిలివేసి నేరుగా ప్రజల నాడిని పట్టుకొనేవారికి మాత్రమే వాస్తవ పరిస్థితులు బోధపడుతాయి. ఆ పరిస్థితి ఏమిటో, ఎల్లప్పుడూ చెవిని నేలకు ఒగ్గి వినే జీవన్‌రెడ్డి చెప్తున్నారు. ప్రజల నాడి ఎవరి పాలన పోయి ఎవరి పాలన రావాలని కోరుకుంటున్నదో వెల్లడి చేస్తున్నారు. ఈ ప్రకంపనల తర్వాత గత కొన్ని రోజులుగా అన్ని వర్గాలు, ప్రాంతాల సామాన్యుల నుంచి వినవస్తున్న ఏకీభావం కూడా అదే. అనగా పాలకుల వ్యాధి లక్షణాలు వ్యాధిగా మారే కొద్దీ, భూప్రకంపనలు భూకంపంగా మారనున్నాయన్న మాట. అందుకు మిగిలింది ఇక సగకాలమే.
వ్యాధికి వ్యాధి లక్షణాలు ఉంటాయన్నది తెలిసిందే. అవి ముందే బయట పడుతాయి. భూకంపానికి ముందు భూప్రకంపనల వలె. వ్యాధి లక్షణాలకు ముందు మనిషి శరీరంలో, భూప్రకంపనలకు ముందు భూగర్భంలో మార్పులు చోటుచేసుకుంటాయి. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన రెండేండ్ల 4 నెలలు పూర్తి చేసుకుని ప్రస్తుత ప్రకంపనలు కనిపించటానికి కొంతకాలం ముందు నుంచే కొన్ని మార్పులు కనిపించటం మొదలైంది.
– టంకశాల అశోక్