యాదగిరిగుట్ట, ఏప్రిల్ 13: యాదగిరిగుట్ట దేవస్థానంలో ఓ వ్యక్తి ఉద్యోగ విరమణ వయ స్సు గడువు దాటినా కొనసాగుతున్న ఘటన కలకలం సృష్టించింది. 61 ఏండ్లకే ఉద్యోగ విరమణ పొందాల్సిన సదరు ఉద్యో గి 73 ఏండ్ల వయస్సులో కూడా ఉద్యోగంలో కొనసాగుతూ జీతభత్యా లు తీసుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది. సదరు ఉద్యోగికి సం బంధించిన వయస్సు ధ్రువీకరణ పత్రం (బోనపైడ్ సర్టిఫికెట్) బయటపడింది. ఇదే విషయంపై గతంలోనే కొమురవెల్లికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో వయ స్సు ధ్రువీకరణ సర్టిఫికెట్లతో పాటు వైద్య పరీక్షలకు రావాలని కోరగా సదరు ఉద్యోగి గైర్హాజరైనట్లు తెలుస్తోంది.
యాదగిరిగుట్టకు బదిలీపై వచ్చిన అనంతరం మరోసారి సమన్లు పంపినా హాజరుకానట్లు సమాచారం. దీనిపై సదరు ఏఈ వివరణ కోరగా దేవస్థానం నోటీసులిస్తే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై ఈవో భవానీ శంకర్ వివరణ కోరగా ఈ విషయంలో కొమురవెల్లి దేవస్థానమే ఆయనపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరణ ఇచ్చారు. కాగా యాదగిరిగుట్ట దేవస్థానం లో ఈఈగా పనిచేసి ఇటీవల సస్పెండ్ అయి న ఓ అధికారి అండదండలు సదరు ఉద్యోగికి ఉన్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం.
అన్ని ఆధారాలు ఉన్నాయి..
ఈ విషయంలో కొంత మంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని యాదగిరి గుట్ట విద్యుత్ సహాయ ఇంజినీర్ అంజయ్య వివరణ ఇచ్చారు. తన జనన తేదీ పదో తరగతి సర్టిఫికెట్లో స్పష్టంగా ఉందన్నారు. కానీ ఆ సర్టిఫికెట్‌ను ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కొమురవెల్లి దేవస్థానంలో వయస్సు విషయంలో మెదక్ జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ విచారణ చేపట్టి ఆరోపణలు ఖండించారన్నారు. ఈ విషయం లో కోర్టు సైతం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సృష్టించి తనను ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది చూస్తున్నారన్నారు. వారిపై న్యాయం పోరాటానికి సిద్ధమన్నారు. వయస్సు నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని గుట్ట దేవస్థానం ఇచ్చిన నోటీసులపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తాను తప్పు చేసినట్లు ఆధారాలుంటే కోర్టులో కేసు వేసుకోవచ్చన్నారు. వచ్చే జూన్‌లో తాను ఉద్యోగ విరమణ చేస్తానన్నారు.
బోనఫైడ్ సర్టిఫికెట్ ప్రకారం..
సిద్దిపేట జిల్లా కొండపాక బాలుర ప్రభుత్వ పాఠశాలలో ఏఈ అంజయ్య 1963 నుంచి 1966 వరకు 6వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివినట్లు ఇటీవల బయటపడిన బోనఫైడ్ సర్టిఫికెట్లో ఉంది. ఇందులో 1953 ఆగస్టు 5న ఆయన జన్మించినట్లు ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే అంజయ్యకు 73 సంవత్సరాలు పూర్తయినట్లు తెలుస్తోంది.
వయస్సు నిర్థారణ కోసం పలుమార్లు నోటీసులు..
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఎలక్ట్రికల్ సహాయ ఇంజనీర్‌గా పనిచేసిన ఆయన ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా 2024 ఆగస్టు 7న గుట్టకు బదిలీపై వచ్చారు. కొమురవెల్లిలో పనిచేసే సమయంలోనే ఆయన వయస్సుపై విచారణ చేపట్టాలని ఓ వ్యక్తి 2018 నవంబర్ 25న కొమురవెల్లి ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. కాగా గుట్టకు బదిలీపై వచ్చిన సదరు ఉద్యోగిపై మరోసారి విచారణ చేపట్టాలని 2025 జూలై 1న కొమురవెల్లి ఆలయ ఈవో, గుట్ట దేవస్థానానికి నోటీసులు జారీ చేశారు. కొమురవెల్లి ఈవో సూచనల మేరకు వయసు నిర్ధారణ పరీక్షలకు సదరు దేవస్థానంలో హాజరు కావాలని గుట్టలో పనిచేస్తున్న ఉద్యోగి అంజయ్యకు నోటీసులు జారీ చేశారు.