భీమ్‌గల్, ఆగస్టు 19 : భీమ్‌గల్ పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన వంద పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు, మూతపడిన భీమ్‌గల్ బస్ డిపో, సీసీ రోడ్లును పరిశీలించారు. అనంతరం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. గత కాంగ్రెస్ పాలనలో మూతపడిన వ్యవస్థలను తాము అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తూ, బిల్లులు నిలిపివేసి భీమ్‌గల్ పట్టణాభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మూతపడిన ఆర్టీసీ డిపోను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ సహకారంతో రూ. 2.25 కోట్లతో మరమ్మతులు చేయించి పునరుద్ధరించి, బస్సు సర్వీసులను విజయవంతంగా నడిపించామని తెలిపారు.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిపోను మళ్లీ నిరుపయోగంగా మార్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం అక్కడ కూలిన ప్రహరీని కూడా బాగుచేయని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని పేర్కొన్నారు. ఈ సమస్యపై శాసనసభలో గళమెత్తినా, క్షేత్రస్థాయిలో పోరాడినా ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పట్టణ పరిధిలో మిగిలిపోయిన అభివృద్ధి పనుల కోసం ఎన్నికల ముందే అప్పటి మంత్రి కేటీఆర్ సహకారంతో మరో రూ. 10 కోట్లు, ఫంక్షన్ హాల్ తదితర పనులతో కలిపి రూ. 12 కోట్లు మంజూరు చేయించి టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేశామని చెప్పారు. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ హడావుడిగా కొబ్బరికాయలు కొట్టి, కంకర పోసిన పాలకులు.. ఏడెనిమిది నెలలుగా కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని వివరించారు.
పట్టణ శివారులో 30 పడకల దవాఖానకే అవకాశం ఉన్నప్పటికీ మారుమూల ప్రాంత పేద ప్రజల వైద్య అవసరాల కోసం నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును ఒప్పించి వంద పడకల దవాఖానను మంజూరు చేయించామని గుర్తుచేశారు. కేవలం 15 నెలల్లోనే నెలకు రూ. కోటి చొప్పున రూ.15 కోట్ల విలువైన పనులు పూర్తి చేసి కాంట్రాక్టరుకు రూ. 13. 50 కోట్ల బిల్లులు ఇప్పించామని పేర్కొన్నారు. మొత్తం ప్రాజెక్టులో 70 నుంచి 75 శాతం పనులు పూర్తి చేయగా మిగిలిన 25 శాతం పనులు పూర్తి చేయడానికి ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ మంత్రి రూ. 5 కోట్లు ఇస్తామని చెప్పి, కేవలం రూ. 2.27 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో ప్రశ్నిస్తుంటే కేవలం రూ. 30 లక్షల విలువైన నామమాత్రపు పనులు చేశారని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసీ, ఎంపీపీలు చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేశ్, జిల్లా కో-ఆప్షన్ మెంబర్ మొయిజ్, నాయకులు శర్మనాయక్, తుక్కాజీ నాయక్, శివసారి నర్సయ్య, కౌన్సిలర్ నీలం రవి, పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.