ఖలీల్‌వాడి, జూన్ 1 : నగరవాసులకు ఆహ్లాదం అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన మినీ ట్యాంక్‌బండ్ (బొడ్డెమ్మ చెరువు) నెల రోజులుగా మూతపడి ఉన్నదని, దీనిపై ప్రజలు, వాకర్స్, యువత, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఏమాత్రం స్పందించలేదని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్నిరోజులుగా సోషల్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత ఉన్న ఎమ్మెల్యే మీడియాలో వచ్చిన వార్తలను కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను గమనించిన బిగాల గణేశ్‌గుప్తా స్వయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం మినీ ట్యాంక్‌బండ్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించి మాట్లాడారు.
నెల రోజులుగా మూత పడి ఉన్న ఈ ప్రదేశాన్ని అధికారులు లేదా ఎమ్మెల్యే తీరుస్తారేమోనని ప్రజలతో పాటు తాము కూడా ఎదురుచూశామని, కానీ ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో ఆందోళన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు బిగాల తెలిపారు. తాను ఆందోళనకు వస్తున్నాననే విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే ధన్పాల్ తన పరువు పోతుందని గ్రహించి హడావుడిగా గేట్లు తెరిపించారని ఆరోపించారు. నెల రోజులుగా మూసివేసి ఉం చిన గేట్లు ఒక్కసారిగా ఎలా తెరుచుకున్నాయని ప్రశ్నించారు. ప్రజల కోసం కాకుండా తమ వైఫల్యం బయట పడకుండా ఉండేందుకు మాత్రమే గేట్లు తెరిపించడం ఎమ్మెల్యే రాజకీయ నాటకాలకు నిదర్శనమని పేర్కొన్నారు. గేట్లు తెరిచిన తర్వాత అక్కడి పరిస్థితిని పరిశీలిస్తే అసలు వాస్త వం బయట పడిందన్నారు. గేటు వద్ద భద్రతా సిబ్బంది , వాచ్మెన్ లేకపోవడం, సరైన నిర్వహణ లేక మినీ ట్యాంక్‌బండ్ పూర్తిగా అనాథలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తాము హెచ్చరించినట్లుగానే అక్కడ నాటిన మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయని, విద్యుత్ దీపాలు పని చేయక చీకటిమయంగా మారిందని, దొంగలించబడిన సీసీ కెమెరాలను ఇప్పటివరకూ పునరుద్ధరించలేదని, పారిశుద్ధ్య నిర్వహణ కూడా అధ్వాన్నంగా మారిందన్నారు. కొత్తగా అభివృద్ధి పనులు చేయడం పక్కన పెడితే ఇప్పటికే నిర్మించిన ప్రజా ఆస్తులను కూడా రక్షించలేని పరిస్థితి నెలకొనడం విచారకరమన్నారు. ఇది కేవలం ఒక మినీ ట్యాంక్‌బండ్ సమస్య మాత్రమే కాదని, నగర అభివృద్ధిపై అధికార పార్టీకి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. నైతిక బాధ్యత వహించి ధన్పాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిర్ప రాజు, ప్రభాకర్‌రెడ్డి, సత్యప్రకాశ్, సుజిత్‌సింగ్, రమేశ్, సీతారాం, రాజు ఉన్నారు.