సుబేదారి, జూన్ 1 : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ)లో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమ అధికారుల బదిలీల్లో కొందరు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పోస్టింగ్లు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు (హెచ్డబ్ల్యూవో) అర్హత లేకున్నా టీఎన్జీవో, టీజీవో తదితర సం ఘాల నుంచి నకిలీ ఆఫీస్ బేరర్ల లెటర్లు సమర్పించి బదిలీల నుంచి మినహాయిం పు పొందినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాల్లో వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన హెచ్డబ్ల్యూవోలు ఉన్నారు. వీరిపై విచారణ జరిపించాలని బాధిత ఉద్యోగులు ఆ శాఖ రాష్ట్ర స్థా యి ఉన్నతాధికారులను కోరుతున్నారు. తెలంగాణ ఎస్సీ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు మే 30న హైదారాబాద్ కమిషనర్ కార్యాలయంలో జరిగాయి.
నాలుగేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగుల బదిలీలను ఆ శాఖ చేపట్టింది. వార్డెన్లు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేసేందుకు జోనల్ నో డల్ ఆఫీసర్ల ద్వారా సీనియారిటీ ఆధారం గా జాబితాను కమిషనర్ కార్యాలయానికి పంపించారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జో న్లోని కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లా ల్లో పనిచేస్తున్న వారిలో ము ఖ్యంగా వరంగల్, హనుమకొండ, ఖమ్మం జిల్లాలకు చెంది న కొందరు ఉద్యోగులకు అన్యాయం జరిగినట్లు తెలుస్తున్నది. ఒకేచోట ఆరేళ్ల నుంచి 8 ఏళ్లు పనిచేసిన వారు, ప్రధానంగా హాస్ట ల్ వార్డెన్లు కొందరు బదిలీల నుంచి మినహాయింపు కోసం యూనియన్ల పేరుతో ఆఫీస్ బేరర్లమంటూ పలుకుబడిని ఉపయోగించుకొని, తప్పుడు లెటర్లు సమర్పించినట్లు తోటి ఉద్యోగులే చెబుతున్నా రు. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత ఉద్యోగులు రాష్ట్రస్థాయి అధికారులను వేడుకుంటున్నారు.
ఈ విషయంలో కరీంనగర్, జగిత్యాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులకు ఫోరం సభ్యులుగా ఉన్నప్పటికీ బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వలేదని, కానీ ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల వారికి ఇచ్చారని అంటున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘంలో పధాధికారిగా పనిచేస్తే నిబంధనల ప్రకారం 2025 జూలై లోపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సంఘం పేరు, పదవులు, సభ్యుల పేర్లు నమోదు చేసి ఉండాలి. ఇలాంటివి లేకుండానే అడ్డదారిలో కొందరు తప్పుడు ధ్రువపత్రాలతో అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి సంఘం లీడర్ అని చెప్పుకుంటూ ఓ హెచ్డబ్ల్యూవో ఒకేచోట పనిచేశాడు.
అతడిపై అవినీతి ఆరోపణలున్నప్పటికీ మళ్లీ వరంగల్ నగరంలోనే ఆఫీస్ బేరర్ అంటూ పోస్టింగ్ పొందినట్లు సమాచారం. ఈ అక్రమాల్లో జిల్లా స్థాయి అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. తమ అనుకూలుర కోసం వారు తప్పుడు ధ్రువపత్రాతో కమిషనర్ కార్యాయానికి సిఫారసులు పంపినట్లు కూడా ఆరోపణలున్నాయి. నిజాయితీగా, సమర్ధవంతంగా పనిచేస్తున్న ఉద్యోగులకు పలుకుబడి లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు బదిలీ చేసినట్లు బాధితులు వాపోతున్నారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో ప్రధాన పదవుల్లో లేనప్పటికీ, తప్పుడు పత్రాలతో పోస్టింగ్లు పొందిన వారిపై సమగ్ర విచారణ జరిపించాలని, వారికి సహకరించిన జిల్లా అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత వార్డెన్లు కోరుతున్నారు.