హనుమకొండ, జూన్ 11 : ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి.. భూమి లేని.. కనీసం ఇరవై రోజులు పనిచేసిన నిరుపేదలకు అమలు చేస్తామన్న పథకం మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పించడంలో భాగంగా ఏడాదికి రెండు విడతల్లో రూ. 12 అందజేసే లక్ష్యంతో 2025 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి, లబ్ధిదారులను గుర్తించింది. వీరిలో కొద్ది మందికి మాత్రమే మొదటి విడతగా రూ.6 వేలు జమ చేసింది. ఆ తరువాత మిగిలిన పంచాయతీల్లో సైతం గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం వారికి మొండి చేయి చూపింది.
అయితే పైలట్ గ్రామాల్లోనూ ఎంపిక చేసిన వారిలో కొందరికే మొదటి విడత చెల్లింపులు జరిగి ఆ తర్వాత వదిలేశారు. ఈ పథకంపై ఎలాంటి స్పష్టత లేకపోవడం, అధికారుల వద్ద కూడా సరైన సమాచారం లేకపోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ అమలులో ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ కూలి పనులపైనే ఆధారపడిన తమకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని భావించిన కుటుంబాలకు నిరాశే మిగిలింది. ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా దక్కుతుందా? లేదా? అనే అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతుండగా, ఏడాదిన్నరగా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు.
డీఆర్డీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లాలో మొత్తం 85,779 ఉపాధి హామీ జాబ్ కార్డులున్నాయి. ఇందులో 55,166 జాబ్ కార్డులు యాక్టివ్‌లో ఉండగా 89,863 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. వీరి నుంచి ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రామ సభలు నిర్వహించి, అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం 10,672 మంది లబ్ధిదారులను అర్హులుగా ఎంపిక చేశారు. అయితే వీరిలో పైలట్ గ్రామాల్లోని సుమారు 620 మందికి మాత్రమే మొదటి విడత రూ. 6 వేలు వారి ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే పైలట్ గ్రామాల్లో లబ్ధిదారులకు మొదటి విడత డబ్బులు జమ చేశాం. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని గ్రామాల్లో అర్హులను ఎంపిక చేశాం. ఉపాధి కూలీ తప్పకుండా జాబ్ కార్డు కలిగి ఉండటంతో పాటు కనీసం 20 రోజులు పనులు చేసి ఉంటేనే రెండు విడతల్లో డబ్బులు జమవుతాయి.
– ఆర్ రామకృష్ణ, ఇన్చార్జి ఎంపీడీవో, పరకాల