హైదరాబాద్, జులై 4(నమస్తే తెలంగాణ): జోడెద్దుల సవ్వళ్లు లేవు.. నాగండ్ల సాళ్లు లేవు.. అన్నదాత ముఖంలో నవ్వులేదు.. దుక్కి ముఖం చూడాల్సిన రైతు.. ఆశగా ఆకాశంవైపే ఆబగా చూస్తున్నాడు.. చినుకు పడుతుందా? లేదోనని గాబరా పడుతున్నాడు. వెరసి ఎవుసం సిన్నబోయింది.. రైతుల్లో గుబులు మొదలైంది. ఈ వానకాలం అన్నదాత ఆశలను ఆవిరిచేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అరకొర వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
వానకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క గట్టి వాన కూడా పడలేదు. జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరించినట్టుగానే ఈ సీజన్‌పై ఎల్ నినో పంజా ప్రభావం చూపుతున్నది. ఆ ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా పంటల సాగు ముందుకు కదలడం లేదు. ఇప్పటికే ముమ్మరంగా సాగాల్సిన సాగు పనులు.. మందకొడిగా సాగుతున్నాయి.
విత్తనాలు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. పత్తి రైతులు మాత్రం అదును దాటిపోతుందనే ఆతృతతో తొలి జల్లులతో విత్తనాలు విత్తి ఇప్పుడు వాన కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల ముందుగా విత్తనాలు వేసిన రైతులు వాటిని కాపాడుకొనేందుకు ట్యాంకర్లు, బిందెలతో నీళ్లు పోసి పంటను కాపాడేందుకు యాతన పడుతున్నారు.
ఎల్ నినో దెబ్బతో వరిసాగు భారీగా తగ్గిపోతున్నది. సాధారణంగా వర్షాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఇప్పటివరకు కేవలం 1.10 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడ్డాయి. నిరుడు ఇదే సమయానికి 2.5 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నిరుటి పోల్చితే 1.4 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గడం గమనార్హం. గతేడాదితో పోల్చితే 56 శాతం వరిసాగు తగ్గింది. జూలైలోనూ కరువు పరిస్థితులే ఉంటే ఈ సీజన్లో వరిసాగు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది.
ఇప్పటికే వరినార్లు పోసి రైతులు వానల కోసం ఎదురుచూస్తున్నారు. గట్టి వర్షాలు పడితే పొలం దున్ని నార్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఓవైపు నారు ఎదిగిపోతుండటం, మరోవైపు వర్షాభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 32 లక్షల ఎకరాల్లో పత్తిసాగు సాగుకాగా, ఈ సీజన్లో 29 లక్షల ఎకరాల్లోనే సాగైనట్టుగా తెలిసింది.
వరిసాగుతో పోల్చితే పత్తి సాగు కొంచెం పర్వాలేదనిపించినా, రాబోయే రోజుల్లో వర్షాలు కురువకపోతే పత్తి రైతులకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి 2.5 లక్షల ఎకరాల్లో మక్క పంట సాగయింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 1.3 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఇప్పటికే పలువురు రైతులు పత్తి, మక్క, కంది విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వర్షాలు కురువకపోతే ఆ విత్తనాలు పాడై పెట్టుబడులు మీదపడే అవకాశం ఉన్నది.
గడిచిన ఏడెనిమిదేండ్లుగా తెలంగాణలో కరువు ఛాయలు కనిపించనేలేదు. తొలి సీఎం కేసీఆర్ కృషి తో యాసంగి సీజన్లోనూ రాష్ట్ర రైతాంగం సాగునీటికి ఇబ్బందులు పడలేదు. అలాంటిది ప్రస్తుతం నిండు వానకాలంలోనే వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరువు భయం పట్టుకొన్నది. మళ్లీ పాత రోజులు చూడాల్సి వస్తుందేమోనని తీవ్ర మదనపడుతున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తే కొంతవరకైనా రాష్ట్రంలో కరువు తీరుద్ది అని రైతాంగం అభిప్రాయపడుతున్నది. నాడు ఎలాంటి కరువు ఛాయలు దరి చేరకుండా కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రవ్యాప్తంగా సాగునీటిని అందించారని గుర్తుచేసుకొంటున్నారు. కానీ ఇప్పు డు ఆ కాళేశ్వరం నీటిని కూడా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చేలా కనిపించడంలేదని మండిపడుతున్నారు.
ఎల్ నినో దెబ్బకు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో రైతులు విత్తనాలు వెసేందుకే వెనుకంజ వేస్తున్నారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 21 జిల్లాల్లో 25%లోపే పంటలు సాగయ్యాయి. అదే విధంగా ఏడు జిల్లాల్లో 26-50% వరకు, మూడు జిల్లాల్లో 76శాతానికి పైగా పంటలు సాగైనట్టు వెల్లడించింది. ఈ వానకాలంలో సాధారణంగా 135 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ ఇప్పటివరకు కేవలం 33 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. నిరుడు ఇదే సమయానికి 45 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకావడం గమనార్హం. అంటే మొత్తం సాగులో 24% మాత్రమే పంటలు సాగయ్యాయి. నిరుటితో పోల్చితే 12 లక్షల ఎకరాల్లో తక్కువగా పంటలు సాగుకావడం గమనార్హం.
ఎల్ నినో ప్రభావం ఇప్పటికే రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తున్నది. నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవడంలేదు. ఈ సాధారణ ఎల్‌నినో ప్రభావంతో కమ్ముకొన్న మబ్బులు దోబూచులాడుతున్నాయి. ఒకవేళ ఇది సూపర్ ఎల్నినోగా మారితే కరువు ప్రమాద ఘంటికలు మోగుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సైతం ఎల్ నినో ముందు బలహీనంగా మారుతున్నది. వర్షాకాలం మొదలై నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు చెప్పుకోదగిన వర్షాలు కరువలేదు. అత్యధిక జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. 21 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైదంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. జూన్‌లో 15శాతం లోటు వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. జూలైలోనూ ఇదే పరిస్థితి కొనసాగి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరిస్తున్నారు.