హైదరాబాద్, ఆగస్టు 20, (నమస్తే తెలంగాణ) : కల్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. కోర్టు ఐదుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు కురవ విజయ్‌కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే కుట్రలో భాగంగానే కౌంటర్ దాఖలు చేయలేదని ధ్వజమెత్తారు. పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
కేసీఆర్.. పేదల కోసం ఎన్నో స్కీమ్‌లు తీసుకొస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం సామ్‌లు తెస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు కురవ విజయ్‌కుమార్ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగత లాయరే కల్యాణలక్ష్మిపై కోర్టులో కేసు వేశారని, బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమాలు చేపట్టిన తర్వాతే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని తెలిపారు. రేవంత్‌రెడ్డి కమీషన్లు రాని పథకాలను బంద్ పెట్టాలని చూస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ఆరోపించారు. మహిళలంతా కాంగ్రెస్ నేతలపై తిరుగబడాలని, మంత్రుల ఇండ్లను ముట్టడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్వీ నేత నర్సింగ్ పాల్గొన్నారు.