కూసుమంచి, ఆగస్టు 20 : సర్కారు బళ్లలో చదువుకునే విద్యార్థులకు వడ్డించేందుకు ఒక్కో కోడి గుడ్డుకు రూ.5 చొప్పునే ప్రభుత్వం ధర చెల్లిస్తుండడంతో మధ్యాహ్న భోజన (ఎండీఎం) ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. బయటి మార్కెట్లో గుడ్డు ధర ఏరోజుకారోజు మారుతుండడం, పైగా.. ఒక్కో గుడ్డు ధర రూ.7 నుంచి రూ.8 మధ్య పలుకుతుండడంతో.. ఆ వ్యత్యాసాన్ని తాము భరించాల్సి వస్తోందని ఎండీఎం కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మెనూను కచ్చితంగా అమలుచేస్తున్న తాము.. వారానికి మూడు రోజులపాటు మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు గుడ్లు వడ్డిస్తున్నామని చెబుతున్నారు. అయితే, బయటి మార్కెట్లో ఒక్కో గుడ్డును రూ.7కుపైగా కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో.. ప్రభుత్వం అందించే రూ.5 సరిపోక మిగతా మొత్తాన్ని తాము చెల్లిస్తున్నామని, ఒక్కో గుడ్డుపై రూ.2కుపైగా భారాన్ని మోస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించేందుకు, విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సర్కారు బళ్ల విద్యార్థులకు ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించేందుకు పటిష్టమైన మెనూను రూపొందించాయి. ఇందులో భాగంగా వారానికి మూడుసార్లు విద్యార్థులకు కోడి గుడ్లతో భోజనాన్ని వడిస్తున్నాయి. అయితే, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో కోడి గుడ్డు ధరకు కూడా ఇంచుమించుగా రూ.5 వరకూ ఉండేది. అప్పుడు ఆ ప్రభుత్వం అందించిన ధరతో మధ్యాహ్న భోజన కార్మికులు కోడి గుడ్లు కొనుగోలు చేసి విద్యార్థులకు అందించేవారు.
అయితే, ఇటీవల కోడి గుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. గుడ్ల ధరలను పౌల్ట్రీ కంపెనీలు ఏరోజుకారోజు నిర్ణయిస్తుండడంతో ధరల్లో కూడా నిత్యం వ్యత్యాసం ఉంటోంది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్కో గుడ్డుకు రూ.5 చొప్పునే నిర్ణయించి ఇస్తోంది. అయితే, ఎండీఎం కార్మికులు బయటి మార్కెట్లో ఒక్కో గుడ్డుకు రూ.2 నుంచి 3 వరకూ అదనపు ధరను భరించి కొనుగోలు చేసి విద్యార్థులకు వండిపెడుతున్నారు.
ఇలా, వారానికి మూడుసార్లు ఈ అదనపు ధరను భరించాల్సి వస్తోంది. ఇలా నెలలు, సంవత్సరాల తరబడి భరించాల్సి రావడంతో ఎండీఎం కార్మికులకు కూడా ఆర్థిక భారం పెరిగిపోతోంది. అసలే, ఎండీఎం కార్మికులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఇప్పటికే వారు కుటుంబపోషణకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గుడ్ల ధరలను కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లించకపోవడంతో, సొంతంగా ఖర్చుచేసి విద్యార్థులకు అందిస్తూ అప్పులపాలవుతున్నారు.
ఖమ్మం జిల్లాలోని 759 ప్రాథమిక పాఠశాలల్లో 20,300 మంది విద్యార్థులు, 189 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 16,141 మంది విద్యార్థులు, 211 ఉన్నత పాఠశాలల్లో 13,944 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తం 1,159 ప్రభుత్వ పాఠశాలల్లో 58,585 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తూ అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం వండి వడ్డించేందుకు 2,088 మంది మధ్యాహ్న భోజన వర్కర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. అయితే, విద్యార్థుల మెనూ చార్జీలుగా ప్రభుత్వం మూడు స్లాబులుగా నిర్ణయించింది. 1-5 తరగతుల్లో ఒక్కో విద్యార్థికి రూ.6.78; 6-8 తరగతుల్లో ఒక్కో విద్యార్థికి రూ.10.17; 9-10 తరగతుల్లో ఒక్కో విద్యార్థికి రూ.13.17 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.
వీరందరికీ వారంలో మూడు రోజులపాటు ఉడకబెట్టిన గుడ్డు అందించాల్సి ఉంది. అయితే, ఇందులో ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం రూ.5 చొప్పునే ఇస్తుండడంతో మిగిలిన రూ.2-రూ.3 భారాన్ని తాము సొంతంగా భరిస్తున్నామని ఎండీఎం వర్కర్లు చెబుతున్నారు. కూసుమంచి ఉన్నత పాఠశాలలో 750 మంది విద్యార్థులున్నారని, ఒక్కొక్కరికీ రూ.2 చొప్పున ఒక రోజుకు రూ.1,500 అదనపు భారం పడుతోందని, ఇలా వారంలో మూడు రోజులంటే ఒక్కో విద్యార్థికి రూ.4,500 చొప్పున తాము అదనంగా భరిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు మెనూను పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నాం. విద్యార్థులకు పౌష్టికాహారంగా వారానికి మూడుసార్లు ఉడకబెట్టిన గుడ్లను వడ్డిస్తున్నాం. మధ్యాహ్న భోజనాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. ప్రతీ గురువారం తనిఖీలు చేస్తున్నాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం.
-రాయల వీరస్వామి, కూసుమంచి హెచ్ఎం, ఎంఈవో
మెనూ ప్రకారం విద్యార్థులకు వారానికి మూడుసార్లు ఉడకబెట్టిన గుడ్లు వడిస్తున్నాం. కానీ, ప్రభుత్వం ఇచ్చే రూ.5కు గుడ్డు రావడం లేదు. మార్కెట్లో గుడ్డు ధర రూ.7 – రూ.8 మధ్య ఉంది. ఆ అదనపు భారాన్ని మేమే భరిస్తున్నాం. మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బిల్లులు ఇవ్వాలి.
-నెల్లూరి కోటమ్మ, మధ్యాహ్న భోజన వర్కర్, కూసుమంచి