వనపర్తి, మార్చి 12 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణలో గ్రామాల స్వరూపం పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయ ఆవరణలో రేవల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో సాగు, తాగునీరు, కరెంట్, వైద్యం, ఉపాధి రంగాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో విద్యారంగం రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడితోపాటు మరెన్నో సంక్షేమ పథకాలు దిక్సూచీగా నిలిచాయన్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్‌తో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని చెప్పారు. నేడు సాగు సంబురంగా సాగుతుండడంతో గ్రామాల్లోనే ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు. అందుకే దేశం మొత్తం చూపు తెలంగాణ వైపే ఉందన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ జెండా రెపరెపలు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి టీడీపీ సీనియర్ నేత
వనపర్తి రూరల్, మార్చి 12 : మండలంలోని పెద్దగూడెం తండాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శతృనాయక్ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయనకు కండువా కప్పి మంత్రి సాదరంగా పార్టీలోకి స్వాగతించారు.