జాతీయ స్థాయిలో పేరుకు అధికార, ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ లో విలువలు వదిలేసి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నా యి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఎన్నికల హామీలు అమలు చే యకుంటే, బీజేపీ మాట్లాడదు, పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుంటే కనబడదు. రోజుకో భూదందా వెలుగు చూస్తుంటే పట్టించుకోదు. ఆఖరికి పేదల ఇండ్లు కూల్చుతుంటే గళమెత్తదు. మరి ఏం చేస్తుందంటే… అధికార పార్టీతో రాసుకుపూసుకొని తిరుగుతూ, కుదిరిన చోట దందాల్లో చేతులు కలుపుతూ ‘నవ్విపోదురు గాక నాకేటి…’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ప్రజల్లో బలంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే ప్రజల సమస్యల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నిజంగానే వేర్వేరు పార్టీలేనా? లేక ప్రజల బాధల దగ్గరకు వచ్చేసరికి రెండూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయా? ఎందుకంటే గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరిగిన అనేక కీలక ఘటనలను ప్రజలు గమనిస్తే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక చర్యల ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో ప్రతిపక్షంగా ఉండాల్సిన బీజేపీ ఆశ్చర్యకరమైన మౌనం పాటించిందనే భావన బలపడుతున్నది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేసినప్పుడు, తమ భూముల కోసం గిరిజనులు పోరాడినప్పుడు, ఎరువుల కోసం రైతులు లైన్లలో నిలబడినప్పుడు, హామీల అమలు కోరుతూ నిరుద్యోగ యువత ధర్నాలు చేసినప్పుడు, ఇండ్ల కూల్చివేతలు జరిగినప్పుడు పేదలు ఆర్తనాదాలు పెట్టినప్పుడు బీజేపీ ఎక్కడ ఉన్నదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజల గొంతుకగా నిలుస్తున్నది, సమస్యలపై నిరంతరం పోరాడుతున్నది, బీఆర్ఎస్ మాత్రమేననే అభిప్రాయం తెలంగాణలో రోజు రోజుకూ ప్రత్యక్ష సాక్ష్యాలతో నిరూపితమవుతున్నది. లగచర్ల ప్రాంతం లో గిరిజనుల భూములను ఫార్మా కంపెనీల పేరిట స్వాధీనం చేసుకునే ప్రయత్నాలపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. తరతరాలుగా జీవనాధారంగా ఉన్న భూమిని కోల్పోతామనే భయంతో గిరిజన కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న వారిపై దమనకాండ జరిగింది. కానీ బీజేపీ నాయకత్వం నుంచి స్పందన కనిపించలేదు. గిరిజన గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించలేదు. గిరిజనుల తరఫున బలంగా మాట్లాడింది, పోరాడింది బీఆర్ఎస్ నాయకత్వమే.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను ప్రైవేటుకు కట్టబెట్టాలని పాలక పెద్దలు కుట్ర చేశారు. రాత్రికి రాత్రి 120 ఎకరాల అడవిని నరికివేశారు. ఈ భూములను విద్యాభివృద్ధికి, వర్సిటీ భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించాలని విద్యార్థులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ కోణంలో ఆలోచించింది. ఈ అంశంలో కూడా కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ స్పష్టంగా కనిపించింది. కేంద్ర విద్యాసంస్థల భూముల పరిరక్షణ గురించి బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. రైతులకు యూరియా అందకపోవడం వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుభరోసా ఎగవేతలు పరిపాటిగా మారిపోయాయి. ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టింది. రైతులు ఎరువుల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన దుస్థితి వచ్చింది. రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవడంతో కల్లాల్లో, మార్కెట్లలో ఎక్కడ చూసినా ధాన్యం పేరుకుపోయింది. పంటకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వలేదు. ఇందులో ఏ అంశంపైనా బీజేపీ పట్టించుకున్న పాపానపోలేదు. రైతుకు అండగా నిలిచింది బీఆర్ఎస్.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదలకు చెందిన దాదాపు వెయ్యి ఇండ్లను ప్రభుత్వం కూల్చివేసింది. చిన్న పిల్లలు రోడ్డున పడటం, మహిళలు కన్నీళ్లు పెట్టుకోవడం, పేద కుటుంబాలు ఒక్కరాత్రిలోనే నిరాశ్రయులవడం యావత్తు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఇంత పెద్ద మానవీయ విషాదం జరిగినప్పటికీ బీజేపీ నేతలు బాధితులను పరామర్శించలేదు. కేరళకు చెందిన అప్పటి సీఎం పినరయి విజయన్ కూడా ఈ విషయంపై స్పందించారు. కానీ గల్లీ నాయకత్వం నుంచి ఢిల్లీ నాయకత్వం వరకు కనీసం స్పందించలేదు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల నివాస ప్రాంతాలపై జరిగిన అరాచక చర్యలు కూడా ప్రజల్లో భయాందోళనలు సృష్టించాయి. ఈ అంశంలో బీజేపీ నాయకత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలబడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయకుండా, కుదిరితే సమర్థిస్తూ వచ్చింది.
రాష్ట్రంలో నిరుద్యోగ యువత ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ పెద్దల పట్ల ఆగ్రహంతో ఉన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నమ్మబలికింది. కానీ ఆ హామీల అమలుకోసం యువత ధర్నాలు చేస్తే అరెస్టులతో వేధించింది. ఇంత జరుగుతున్నా బీజేపీ ఎందుకు స్పందించలేదు? ఈ సమయంలో నిరుద్యోగుల తరఫున నిరంతరం మాట్లాడింది బీఆర్ఎస్. నిరుద్యోగులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలుస్తూ గళమెత్తారు. కుమ్మర గ్రామంలో జరిగిన విషాద ఘటనలో రెండు నెలల చిన్నారి ప్రాణం కోల్పోవడం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కదిలించింది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉన్నది. బాధితులకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ పోరాడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో బీజేపీ నాయకత్వం విఫలమైంది. ఓ బీజేపీ నాయకుడి కుమారుడు, ఓ బాలికపై అఘాయిత్యం చేశాడని పోక్సో కేసు నమోదు కాగా, ఆ వ్యవహారంపై బీజేపీ మాట్లాడలేదు. విచిత్రంగా కాంగ్రెస్ నేతలు, మంత్రులు మౌనవ్రతం పాటించారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏందంటే, ఆ రెండు పార్టీలకు స్వప్రయోజనాలు, రాజకీయలబ్ధి మాత్రమే కానీ, సమాజంలో వివిధ వర్గాల కష్టాలు పట్టవు. లేకపోతే బాలికకు అన్యాయం జరిగిన ఘటనలోనూ రాజకీయ లెక్కలు వేసుకోవడం ఏంది? ప్రజల సమస్యల దగ్గరకు వచ్చేసరికి కాంగ్రెస్ పాలకుల దమనకాండపై బీజేపీ మౌనం వహిస్తున్నది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని నిరంతరం మాట్లాడేది, ప్రజల సమస్యలను రాజకీయ లాభనష్టాల కోణంలో కాకుండా ప్రజల కోణంలో చూసేది, ప్రజల తరఫున గళం వినిపించేది, ఉద్యమాలకు ముందుండేది బీఆర్ఎస్, గులాబీ దళం మాత్రమే. జై తెలంగాణ.