భారతదేశం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నది. అధికార పక్షం నుంచి అభివృద్ధి ప్రకటనలు, విశ్వగురు అనే నినాదాలు వినిపిస్తుంటే, సాధారణ ప్రజల జీవితాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా లోపలి నుంచి కుళ్లిపోతున్నట్టుగా అనిపిస్తున్నది. పన్నుల నుంచి నిత్యావసర సరుకుల వరకు అన్నీ పెరిగిపోయాయి. కానీ ప్రజల ఆదాయం మాత్రం అదే స్థాయిలో పెరగడం లేదు. సంపాదన కేవలం బతకడానికి సరిపోతున్నది కానీ భవిష్యత్తును నిర్మించడానికి కాదు. ఇది ఈరోజు దేశంలో అత్యంత పెద్ద సామాజిక సంక్షోభం. మరి మోదీ భజన బృందం చెప్తున్న వికసిత్ భారత్ వెలుగులు ఎక్కడ అనేది అంతుపట్టని విషయం.
దేశంలో మోదీ పాలనలో ప్రజల జీవితం దుర్భరంగా మారింది. సంపన్నులు మరింత సంపన్నులుగా మారితే, పేదలు మరింత నిరుపేదలుగా మారిపోతున్నారు. దేశంలో కీలక రంగాల్లో పరిస్థితి గమనిస్తే నివ్వెరపోయే వాస్తవాలు కనిపిస్తాయి. విద్యా వ్యవస్థ పరిస్థితి దారుణంగా మారింది. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలలో ప్రశ్నాపత్రాల లీకులు, అవకతవకలు చూస్తుంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దేశం ఒక ప్రమాదకరమైన మలుపు వైపు నడుస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇరాన్ యుద్ధాన్ని కారణంగా చూపుతున్నది. కానీ నిజమైన ప్రశ్న ఏమిటంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే, ఒక యుద్ధంతోనే ఎందుకు ఇంత బలహీనంగా కనిపిస్తుంది? ఎందుకు ఒక్కసారిగా ధరలు, అప్పులు, పెట్టుబడులు, రూపాయి విలువ అన్నీ ఒత్తిడిలో పడుతున్నాయి? ఈ సంక్షోభం ఒక్కరోజులో పుట్టింది కాదు. దీని విత్తనం చాలా కాలం క్రితమే పడింది. ముఖ్యంగా నోట్లరద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో ఒక కనిపించని గాయం మొదలైంది. చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. నగదు ఆధారంగా నడిచే రంగాలు కుదేలయ్యాయి. ఉద్యోగాలు తగ్గాయి. కానీ డిజిటల్ ఇండియా, వికాసం, దేశభక్తి అనే నినాదాల వెనుక అసలు నష్టాన్ని కనిపించకుండా కప్పి ఉంచారు. ఆ తర్వాత కరోనా వచ్చింది. అప్పటికే బలహీనమైన ఆర్థిక వ్యవస్థ మరింత ఒత్తిడిలో పడింది.
ఇప్పుడు పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందంటే దేశంలోని పెద్ద పెద్ద కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీలు జరిగాయి. సాధారణ రైతు, చిన్న వ్యాపారి ఈఎంఐల చెల్లింపులో ఆలస్యం జరిగినా నోటీసులు వస్తాయి. బ్యాంకుల్లో జమ చేసిన మధ్యతరగతి, ఉద్యోగులు, చిన్న వ్యాపారుల సొమ్మును బడా కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్నది.
విదేశీ పెట్టుబడిదారులు కూడా భారత మార్కెట్ల నుంచి వెనక్కి వెళ్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉన్నదని పాలకులే కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంటే పెట్టుబడిదారులు భయం ఉన్న చోట ఎందుకు ఉంటారు? వారికి లాభం, స్థిరత్వం ముఖ్యం. రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ అనిశ్చితి, దేశీయ డిమాండ్ తగ్గడం ఇవన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలు ప్రచారం జరిగినంతగా ఆచరణలో కనిపించడంలేదు. నిజంగా దేశీయ ఉత్పత్తి పెరిగిందా? ఉద్యోగాలు భారీగా వచ్చాయా? యువతకు స్థిరమైన ఉపాధి దొరికిందా? లేక ప్రకటనలు, ఈవెంట్లు, బ్రాండింగ్ మాత్రమే జరిగిందా? దేశం దిగుమతులపై ఆధారపడటం తగ్గిందా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. నిర్మాణ రంగం మందగిస్తే దాని ప్రభావం కూలీల నుంచి సిమెంట్ కంపెనీల వరకు అందరిపై పడుతుంది. విమాన రవాణా రంగంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కోతలు, ఆర్థిక ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వేర్వేరు ఘటనలు కాదు. ఒక పెద్ద ఆర్థిక ఒత్తిడికి సంకేతాలు. యువతలో పెద్ద సంఖ్యలో భవిష్యత్తుపై నమ్మకం కోల్పోతున్న ప్రమాదకర పరిస్థితి కనిపిస్తున్నది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సమాజ భవిష్యత్తుకు హెచ్చరిక.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల అసలు సమస్యలపై చర్చ జరగాల్సింది పోయి, మత విద్వేషాలు, కుల రాజకీయాలు, విషప్రచారాలు ప్రధాన ఎజెండాగా మారాయి. ప్రజలు ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, ధరల పెరుగుదల గురించి మాట్లాడకుండా ఉండేందుకు మతం, కులం, దేశభక్తి వంటి భావోద్వేగ అంశాలను పాలకులు నిరంతరం ముందుకు తెస్తున్నారు. ఓట్ల కోసం సమాజాన్ని విభజించడం, ఒక వర్గానికి మరో వర్గంపై అనుమానం కలిగించడం, ప్రతిపక్ష ఓట్లను దొంగ ఓట్లుగా చూపించడం వంటి రాజకీయ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు.
ప్రజలు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతీ సంక్షోభానికి యుద్ధమే కారణం కాదు. కొన్నిసార్లు యుద్ధం కేవలం ఒక సాకుగా ఉపయోగపడుతుంది. అసలు బలహీనతలు దేశంలోనే సంవత్సరాలుగా పెరుగుతూ ఉంటాయి. ఏదో ఒక రోజు అవి బయటపడతాయి అంతే. దేశాన్ని కాపాడేది నినాదాలు కాదు. బలమైన ఆర్థిక వ్యవస్థ, పారదర్శక పాలన, ఉద్యోగాలు, ఉత్పత్తి, ప్రజల కొనుగోలు శక్తి ప్రజల జీవన ప్రమాణాలు.
మంచి ప్రభుత్వ పాఠశాలలు, అందుబాటులో వైద్యం, స్థిరమైన ఉద్యోగాలు, అవినీతి లేని పాలన, సమాన అవకాశాలు, సామాజిక ఐక్యత ఇవే ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ప్రజలు ప్రశ్నించడం ఆపేస్తే సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మౌనం కూడా ఒక ప్రమాదమే. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లిస్తూ, భావోద్వేగ రాజకీయాలతో సమాజాన్ని నడిపిస్తే, చివరికి నష్టపోయేది దేశమే. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు కాదు. ప్రజలు ప్రశ్నించడం, ఆలోచించడం, నిజమైన సమస్యలపై చర్చించడం. ఒకరోజు ప్రజలు మనం మతం కోసం కాదు. మన జీవితాల కోసం పోరాడాలి అని గ్రహించినప్పుడు మాత్రమే అసలు మార్పు ప్రారంభమవుతుంది.