నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, అక్టోబర్ 18: బీసీ బంద్‌లో (BC Bandh) భాగంగా శనివారం కాంగ్రెస్ (Congress) నాయకులు పలుచోట్ల దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బంద్‌లో భాగంగా షాప్ ఇంకా మూయలేదంటూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కొందరు కాంగ్రెస్ నాయకులు మహిళా వ్యాపారిపై దాడి చేశారు. షాపు యజమానురాలితో దురుసుగా ప్రవర్తించడమేగాకుండా ఆమెపై చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. తోటి వ్యాపారులతో కలిసి ఆమె స్థానిక విశ్రాంతి భవనం ఎదురుగా ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి 365పై బైఠాయించింది. జనగామలో బీసీ సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ సేవెల్లి సంపత్‌పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. ‘కామారెడ్డి బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాయమాటలు చెప్పి బీసీల ఓట్లు దండుకున్నారని’ సంపత్ మీడియాతో మాట్లాడుతుండగా పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులు చింతకింది మల్లేశ్, లొక్కుంట్ల ప్రవీణ్ తదితరులు అడ్డుకున్నారు.
సంపత్‌పై జరిగిన దాడిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు బీసీ సంఘాల జేఏసీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పాలకేంద్రం నుంచి అంబేదర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాకు చేరుకున్నారు. ఇరుపార్టీల వారు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
సత్తుపల్లి బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు.. కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగడంతోపాటు స్వల్ప తోపులాట జరగడంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సాలి శివకు స్వల్ప గాయాలయ్యాయి. బీసీ బంద్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు దూషించుకున్నారు. కాంగ్రెస్ నేత బాద్మి శివకుమార్ తనను అవమానించాడంటూ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షకీల్ అంబేద్కర్ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శకు దిగాడు.
రిజర్వేషన్ల విషయంలో బీసీ వర్గాలంతా మనోవేదనకు గురవుతుంటే వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే నాగరాజు డ్యాన్స్ చేయడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. బంద్‌లో భాగంగా ఫిరంగిగడ్డ నుంచి వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సంబంధించిన డీజే పాటలు వేసి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రహదారిపై నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే తీరుపై బీసీ సంఘాల నేతలు పెదవి విరిచారు.