సుమారు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజానీకానికి 90వేలమందికిపైగా పోలీసులు
120 మందికిపైగా ఐపీఎస్‌లు.. పదుల సంఖ్యలో నాన్‌క్యాడర్ ఎస్పీలు.
ఇంత బలమైన వ్యవస్థ గత పదేండ్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఆదర్శంగా నిలిచింది
ఇప్పుడు దృఢమైన నాయకత్వ లేమికి తోడు.. పోలీసు వ్యవస్థ బాగోలు పట్టించుకునే హోంమంత్రి లేకపోవడంతో వ్యవస్థ అస్తవ్యస్తమవుతున్నది. పట్టపగలే దోపిడీలు, హత్యలు, మానభంగాలు నిత్యకృత్యమవుతుండటంతో.. ‘తెలంగాణ హోంమంత్రి ఎక్కడ?’ అంటూ పౌరులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేలమంది పనిచేస్తున్న పోలీ సు శాఖకు ప్రత్యేకంగా ఓ మంత్రి లేకపోవడం తో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వర కూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీ స్థా యి అధికారుల వరకూ కొంద రు ఖాకీలు చేస్తు న్న అరాచకాలు మొత్తం వ్యవస్థకు మకిలి పట్టిస్తున్నాయి. డీసీపీ స్థాయి అధికారులే కొందరు రాజకీయ నేతల అండ చూసుకొని.. స్టేషన్లలో సెటిల్మెంట్లు చేయడం, రియల్ ఎస్టేట్ దందాల్లో తలదూర్చడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నీతికి, నిజాయితీకి ప్రతిరూపమైన పోలీసు వ్యవస్థ కీర్తి నానాటికి దిగజారిపోతున్నది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు, నేరాల సంఖ్య పెరిగిపోతున్నట్టు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి.
తెలంగాణలో ఎటు చూసినా దోపిడీలు, దొంగతనాలు, హత్యల ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తుపాకులతో కాల్చుకోవడం, అమాయకులను బెదిరించి భూములు లాక్కోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి చిన్నారులను కూడా హత్య చేస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. బాధితులకు అండగా ఉండాల్సిన వ్యవస్థ.. కొందరు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తుండటాన్ని నిజాయితీపరులైన పోలీసులు జీర్ణించుకోలేపోతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోంమంత్రిత్వశాఖను కూడా తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. ఆయన వద్ద పోలీసుశాఖతోపాటు కీలకమైన మున్సిపల్, విద్యాశాఖ, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ఉన్నాయి. దీంతో సీఎం హోంశాఖ పట్ల నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కీలకమైన హోంశాఖకు మంత్రిని కేటాయించకపోవడం, తానే పర్యవేక్షిస్తున్నా కనీసం రెండు నెలలకొకసారి కూడా సమీక్ష చేయకపోవడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. గత 21 నెలల కాలంలో కనీసం నాలుగైదు సార్లు కూడా పోలీసుశాఖపై సీఎం స్థాయిలో సమీక్షలు జరగలేదంటే అతిశయోక్తికాదు.
రాష్ట్రంలో క్రైమ్ రేట్ దారుణంగా పెరిగిపోతున్నది. తీవ్రమైన నేరాల్లో నిరుటితో పోలిస్తే 22.53 శాతం పెరుగుదల కనిపించింది. ఇటీవల అర్ధవార్షిక క్రైమ్ రివ్యూలో నేరాల పెరుగుదలపై డీజీపీ జితేందర్ ఆందోళన వ్యక్తంచేశారు. నడిరోడ్లపైనే దారుణంగా నరికి చంపుతున్న ఉదంతాలు నెలలో కనీసం రెండు జరుగుతున్నాయి. నీళ్లు తాగినంత ఈజీగా పట్టపగలే హత్యలు చేస్తున్నారు. ఇక అంతర్రాష్ట్ర దొంగలు రాష్ట్రంలో తిష్టవేశారని స్వయంగా డీజీపీనే అంగీకరిస్తూ, జాగ్రత్త పడాలని హెచ్చరించినా చర్యలు చేపట్టలేదు. క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రంలో దొంగతనాలు, దోపిడీలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా నగరంలో ఖజానా జ్యూయలరీస్‌లో జరిగిన దోపిడీ సంచలనంగా నిలిచింది. 2024లో రోజుకు 78 చొప్పున దొంగతనం, దోపిడీ కేసులు నమోదయ్యాయి.
ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా చీటింగ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కిరాయి హత్యలు మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. నిరుడు నేరాలన్నిటిలో 10 శాతం క్రైమ్ రేట్ పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది గడిచిన ఏడు నెలల్లో ఇప్పటికే 8 శాతం పెరిగినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై సైతం నేరాల సంఖ్య 10 శాతం పెరిగినట్టు సమాచారం. నిరుడు మహిళల హత్యలు 13.15 శాతం పెరిగాయి. ఆడబిడ్డలను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు 363కు పెరిగాయి. ఇక రేప్‌కేసుల్లో 29 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో మహిళలను కంటికి రెప్పలా చూసుకుంటున్నామని చెప్తున్న మాటలు అవాస్తమని తేలిపోయింది.
పని ప్రదేశాల్లో మహిళలు, ఆఖరికి మహిళా పోలీసులకు కూడా రక్షణ కరువైనట్టు తెలుస్తున్నది. పోష్ యాక్టుతో తీసుకుంటున్న చర్యలు బయటికి పొక్కనీయడం లేదు. మహిళలపై జరుగుతున్న వేధింపుల వివరాలను కూడా తొక్కిపెడుతున్నారు. ఇక ఎస్సీలు, ఎస్టీలపై నమోదైన దాడులు.. ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు అద్దం పడుతున్నాయని పలువురు అంటున్నారు. 2023లో ఎస్సీ, ఎస్టీలపై 1,877 కేసులు నమోదు కాగా.. గతేడాది 11 నెలల్లోనే 2,257 (20.24శాతం) కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది పెద్ద ధన్వాడ దళితులపై జరిగిన దాడులు ఇప్పటికే ప్రభుత్వానికి మచ్చను తీసుకొచ్చాయి.
రాష్ట్రంలో సైబర్ నేరాలు దారుణంగా పెరుగుతున్నాయి. పౌరుల సొమ్మును నేరగాళ్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. మరోవైపు డ్రగ్స్ రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్నాయి. ప్రతిరోజూ టన్నులకొద్దీ గంజాయి దొరుకుతున్నది. పోలీసులు, ఈగల్ బృందాలు, ఎక్సైజ్‌శాఖ, ఆఖరికి కేంద్ర సంస్థలు కూడా గంజాయి, ఇతర సింథటిక్ డ్రగ్స్‌ను భారీగా స్వాధీనం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం భారీగా పెరిగింది. 2024లో 1942 కేసులు నమోదు చేసి.. 4,682 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.142 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు సెల్‌ఫోన్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని అంతర్రాష్ట్ర ముఠాలు తెలంగాణలో తిష్టవేసి మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. మహిళలపై దాడులు, వేధింపులకు అడ్డూ అదుపు లేదు. స్టేషన్లకు వచ్చే మహిళలను పోలీసులే ట్రాప్ చేస్తూ.. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటిపై ప్రతినెల సమీక్షలు చేసి, రిపోర్టులు తీసుకొని, పెరిగిన నేరాలను అదుపు చేసేలా హోం మంత్రి పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలి. సిబ్బంది తప్పులు చేస్తే తక్షణం చర్యలు తీసుకునే వ్యవస్థ లేకపోవడంతో ఉన్నతస్థాయి ఆదేశాలు పట్టించుకోవడం లేదు. వెరిసి తెలంగాణలో క్రైమ్ రేట్ నానాటికీ పెరిగిపోతూ ఉన్నది.