పర్వతగిరి, మార్చి 8 : సాగు నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి.. ఆదుకోండి సారు.. అంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు గుగులోత్తండాకు చెందిన రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తండాకు చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ఎస్సారెస్పీ జలాలు అంది పంటలు సమృద్ధిగా పండాయని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఎస్సారెస్పీ కాల్వలు పారక సుమారు 100 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తీగరాజుపల్లి సెంటర్ నుంచి మహబూబాబాద్‌కు ఎస్సారెస్పీ కెనాల్‌కు ప్రెజర్‌తో నీటిని విడుదల చేయకపోవడంతో పొలాలకు నీరందడం లేదన్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమ తండాకు సాగు నీటిని సక్రమంగా అందించి, ఎండుతున్న పొలాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు అన్నమయ్య, ఈర్యానాయక్, రవి, బాలూనాయక్, చక్రూనాయక్, శౌర్య, దస్రూనాయక్ తదితరులు పాల్గొన్నారు.