కథలాపూర్ : జగిత్యాల జిల్లా కోరుట్ల-వేములవాడ రోడ్డుపై కథలాపూర్ మండలం తాండ్ర్యాల ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం తాండ్ర్యాల గ్రామ రైతులు ధర్నా చేశారు. సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాండ్ర్యాల రైతులకు చెందిన 40.13 ఎకరాల భూమి సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో కోల్పోతున్నామని చెప్పారు. ప్రభుత్వం ఎకరానికి రూ.10.80 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించిందని, తాము ఏళ్లుగా నమ్ముకుని సాగు చేస్తున్న భూములను కోల్పోతున్నామని వారు వాపోయారు.
భూములకు బదులు భూములు ఇవ్వాలని, లేకపోతే ఎకరానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యిందన్నారు. ఎస్ఐ నవీన్ కుమార్ అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.