Coconut Oil For Diabetics | డయాబెటిస్ అనేది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీని బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నవారు అధిక శాతం మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. అస్తవ్యవస్తమైన జీవన శైలి ఈ వ్యాధి వచ్చేందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఆహారం విషయంలో చాలా మంది తగు జాగ్రత్తలు పాటించడం లేదని, దీని వల్లే టైప్ 2 డయాబెటిస్ వస్తుందని అంటున్నారు. డయాబెటిస్ వచ్చిన వారు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే వ్యాధి మరింత ముదిరే ప్రమాదం ఉంటుంది. ఆహారంలో పిండి పదార్థాలు, చక్కెరలు తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. లేదా మానేస్తే మంచిది. ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకుంటే మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు పిండి పదార్థాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. దీంతో ఇన్సులిన్ నిరోధకత మరింత పెరుగుతుంది. దీని వల్ల షుగర్ మరింత ఎక్కువవుతుంది. కనుక ఆయా ఆహారాలను తీసుకోవడం పూర్తిగా తగ్గించాల్సి ఉంటుంది. ఫైబర్ ఉండే ఆహారాలను తినాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినూనెను ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కొబ్బరినూనె డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. కొబ్బరినూనెను రోజూ వంట నూనెగా ఉపయోగించవచ్చు. లేదా రాత్రి పూట నిద్రకు ముందు ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగం ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు రోజూ కొబ్బరినూనెను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచవచ్చు. దీంతో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి సహజంగానే అజీర్తి సమస్య ఉంటుంది. ఆహారం జీర్ణమవడం ఆలస్యం అవుతుంది. కానీ కొబ్బరినూనెను తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆహారం సులభంగా జీర్ఱం అవుతుంది. అజీర్తి ఉండదు. అలాగే షుగర్ ఉంటే మలబద్దకం కూడా ఇబ్బంది పెడుతుంది. కానీ కొబ్బరినూనెను తీసుకోవడం వల్ల మలబద్దకం అన్న మాటే ఉండదు. రోజూ ఉదయం సుఖంగా విరేచనం అవుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
కొబ్బరినూనెను సేవించడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. కొబ్బరినూనె యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కనుక వారు కొబ్బరినూనెను తీసుకుంటే ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా చర్మంపై, జననావయవాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కొబ్బరినూనెను తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం పొడిబారకుండా చూస్తుంది. చర్మం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. అలాగే శిరోజాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినూనెను తీసుకుంటే ఇలా అనేక రకాలుగా లాభాలను పొందవచ్చు.