Ear Pain | చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిలో నొప్పి, ఇతర చెవి సమస్యలు సాధారణంగా చాలా మందికి తరచూ వస్తూనే ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో, ఆహారపు అలర్జీలు ఉన్నా, పోషకాల లోపం, చెవి లోపల అంతర్గత గాయాలు అయినప్పుడు, వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు సహజంగానే కొందరికి చెవి సమస్యలు వస్తాయి. కొందరికి చెవుల్లో నుంచి ద్రవం బయటకు వచ్చి నొప్పి ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీంతో తీవ్రమైన ఇబ్బందిగా అనిపిస్తుంది. కొందరికి కేవలం ఒక చెవిలోనే ఈ సమస్యలు వస్తాయి, మరికొందరికి రెండు చెవుల్లోనూ ఇలా అవుతుంది. చిన్నారుల్లో చెవి సమస్యలు తరచూ వస్తుంటాయి. అయితే ఈ సమస్య ఎవరికి వచ్చినా సరే అందుకు కొన్ని ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని పాటించడం వల్ల అన్ని రకాల చెవి సమస్యల నుంచి బయట పడవచ్చు. చెవి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
చెవి ఇన్ఫెక్షన్, చెవి నొప్పిని తగ్గించేందుకు ఉప్పు బాగా పనిచేస్తుంది. కొద్దిగా ఉప్పును తీసుకుని పెనంపై వేడి చేసి దాన్ని వస్త్రంలో చుట్టి దాంతో నొప్పి ఉన్న చెవిపై 5 నుంచి 10 నిమిషాల పాటు కాపడం పెట్టాలి. ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు చేస్తుంటే చెవిలో ఉండే ద్రవం బయటకు వస్తుంది. నొప్పి, వాపు తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ నుంచి బయట పడవచ్చు. ఇలా తగ్గే వరకు చేయవచ్చు. అలాగే చెవి సమస్యలను తగ్గించేందుకు వెల్లుల్లి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు వెల్లుల్లి రెబ్బలు, రెండు లవంగాలను తీసుకొని ఒక టేబుల్ టీస్పూన్ నువ్వుల నూనెలో బాగా వేడి చేయాలి. అనంతరం ఆ నూనెను వడబోసి దాన్ని నొప్పిగా ఉన్న చెవిలో రెండు చుక్కల చొప్పున వేయాలి. దీని వల్ల తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజుకు 2 సార్లు చేస్తుంటే చెవి ఇన్ఫెక్షన్ సైతం తగ్గిపోతుంది.
తులసి ఆకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. వీటిల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. తులసి ఆకులను దంచి రసం తీసి దాన్ని చెవిలో రెండు చుక్కల చొప్పున వేయాలి. దీని వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకుల రసాన్ని కొబ్బరినూనెలో కలిపి ఆ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి దాని సహాయంతో చెవి లోపల, చెవి అంచు చుట్టూ, చెవి వెనుక సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేస్తుంటే చెవి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. అదేవిధంగా చెవి సమస్యలను తగ్గించేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పనిచేస్తుంది. ఒక భాగం ఆపిల్ సైడర్ వెనిగర్ ను సమానమైన నీరు లేదా ఆల్కహాల్ తో కలపాలి. ఈ ద్రావణంలో కాటన్ బాల్ వేసి ఆ కాటన్ బాల్ ను చెవిలో ఐదు నిమిషాలపాటు పెట్టడం వల్ల చెవి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.
కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తక్కువ మంట మీద వేడి చేసి గోరువెచ్చగా ఉన్న నూనెను రెండు చుక్కల చొప్పున చెవులలో వేసుకోవటం వల్ల చెవి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆలివ్ ఆయిల్లో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు నొప్పి, ఇన్ఫెక్షన్ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. అలాగే ఈ చిట్కాను పాటించడం వల్ల చెవి శుభ్రంగా మారుతుంది. ఇక మెడకు సంబంధించిన వ్యాయామాలను చేస్తున్నా కూడా చెవి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చల్లని లేదా వేడి ప్యాక్లను పెట్టుకోవడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ముల్లేయిన్ అనే మొక్క పువ్వుల నుంచి తయారు చేసిన నూనెను చెవుల్లో వేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తుంటే చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గిపోతాయి.