Arundhati Remake | తెలుగు సినీ చరిత్రలో సూపర్ నేచురల్ థ్రిల్లర్లకు కొత్త దారి చూపిన సినిమా ‘అరుంధతి’ . పునర్జన్మ కథగా తెరకెక్కిన ఈ చిత్రం మంత్రం, మాయ, సెంటిమెంట్, థ్రిల్ అన్నీ కలగలిపి ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. దర్శకుడు కోడి రామకృష్ణ విజన్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తన ఊరిని, ప్రజలను రక్షించేందుకు ప్రాణత్యాగం చేసిన రాణి పునర్జన్మగా తిరిగి వచ్చే ఈ కథలో అనుష్క అద్భుత నటనతో ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. హర్రర్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అన్నీ సమతూకంగా మేళవించిన ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.
‘అరుంధతి’తోనే అనుష్క రొమాంటిక్ హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్గా మారింది. ఆ కాలంలో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఎంతో చర్చనీయాంశమయ్యాయి. ఉత్తమ నటిగా నంది అవార్డు , ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమెకు అందాయి. సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ కమర్షియల్ విజయాన్ని కూడా అందుకుంది. ఇప్పుడు ఈ మైథాలజికల్ థ్రిల్లర్‌ను హిందీలో రీమేక్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించనున్నారని, రీమేక్ సినిమాలకి కేరాఫ్ అయిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
అనుష్క పోషించిన లెజెండరీ పాత్రలో ఇప్పుడు యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటించనుందని టాక్. అయితే, ఈ వార్తపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇప్పటికే ఈ సినిమా 2014లో బెంగాలీలో రీమేక్ అయి విజయం సాధించింది. ఇప్పుడు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ రీమేక్ రూపొందిస్తారని సమాచారం. అనుష్కలా శ్రీలీల కూడా తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.