Nausea | వికారంగా ఉండడం లేదా వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు సాధారణంగా మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి. గర్భిణీలకు అయితే ఈ సమస్యలు సహజంగానే ఉంటాయి. కానీ వికారం, వాంతులు అనేవి కేవలం గర్భిణీలకే కాదు, అందరికీ అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారికి, ఫుడ్ పాయిజన్ అయినప్పుడు, ఫుడ్ అలర్జీలు ఉన్నవారు పడని ఆహారం తిన్నప్పుడు, కలుషితమైన ఆహారం లేదా ద్రవాలను తీసుకున్నప్పుడు, పలు రకాల మందులను వేసుకున్నప్పుడు, పలు ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమస్యల నుంచి బయట పడేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో పదార్థాలతోనే సహజసిద్ధంగానే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అందుకు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
వికారంగా ఉండడం, వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు ఉంటే అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వికారం, వాంతులు తదితర సమస్యల నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. అల్లం రసం తీసుకోవడం వల్ల వికారం నుంచి బయట పడవచ్చు. వాంతులు అవకుండా అడ్డుకోవచ్చు. రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 1 టీస్పూన్ అల్లం రసం సేవిస్తుండాలి. దీని వల్ల ఆయా సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పుదీనా ఆకుల రసాన్ని సేవించడం వల్ల కూడా ఎంతో ఉపశమనం లభిస్తుంది. పుదీనాలో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపు నొప్పి, వాంతులు, వికారం సమస్యలను తగ్గిస్తాయి. పుదీనా ఆకుల రసాన్ని ఒక టీస్పూన్ చొప్పున రోజుకు 3 పూటలా భోజనం చేసిన అనంతరం సేవిస్తుండాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి.
విటమిన్ బి6 ఉన్న ఆహారాలను తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. విటమిన్ బి6 మనకు ఎక్కువగా చేపలు, చికెన్, కోడిగుడ్లు, సోయాబీన్, తృణ ధాన్యాలు, కూరగాయల్లో లభిస్తుంది. ఈ ఆహారాలను తీసుకుంటున్నా కూడా వాంతులు, వికారం సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక మనం తరచూ ఉపయోగించే నిమ్మకాయలు కూడా ఈ సమస్యల నుంచి మనల్ని బయట పడేలా చేస్తాయి. నిమ్మకాయలను దగ్గర పెట్టుకుని ఎప్పుడూ వాసన పీలుస్తుండాలి. దీని వల్ల వికారం సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగుతున్నా కూడా సమస్యలు తగ్గుతాయి. ఇలా రోజుకు 3 సార్లు తాగవచ్చు.
వాంతులు, వికారం వంటి సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను తింటుంటే ఉపయోగం ఉంటుంది. పుచ్చకాయలు, తర్బూజాలను కూడా తినవచ్చు. వీటి జ్యూస్‌ను తాగుతుంటే ఫలితం ఉంటుంది. చికెన్ లేదా వెజిటబుల్ సూప్‌ను సైతం తాగవచ్చు. ఇవి కూడా ఆయా సమస్యల నుంచి బయట పడేలా చేస్తాయి. ఇక ఈ సమస్యలు ఉన్నవారు నూనె పదార్థాలను తినకూడదు. కారం, మసాలాలు, ఘాటైన వాసన కలిగిన ఆహారాలు, తియ్యని పదార్థాలు, టీ, కాఫీ, మద్యం వంటి ఆహారాలు, పానీయాలను తీసుకోకూడదు. తిన్న వెంటనే నిద్రించకూడదు. కాసేపు వాకింగ్ చేస్తే మంచిది. ఒకేసారి అతిగా కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినడం అలవాటు చేసుకోవాలి. ఈ చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తీసుకుంటుంటే వాంతులు, వికారం సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.