“బొగ్గు బావుల వేలాన్ని ఆపేసి నేరుగా సింగరేణికే కేటాయించు.. నీ దోస్త్ అదానీకి కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నవ్ కదా.. లక్షల కోట్లున్న ఆయన కావాల్నా.. రాత్రనక, పగలనక చెమటోడ్చి దేశానికి వెలుగులు పంచుతున్న కార్మికులు కావాల్నా? తేల్చుకో..! కోల్బెల్ట్కొచ్చి ఓ మాట.. పార్లమెంట్లో నీ మంత్రులతో మరో మాట చెప్పించడం కాదు.. నీకు కార్మికులపై ప్రేమ ఉంటే.. బ్లాకుల వేలాన్ని తక్షణమే రద్దు చేసి.. సింగరేణికే ఆ నాలుగు గనులను నేరుగా అప్పగించు.. సింగరేణి వెలుగుల్ని దెబ్బతీస్తే మీరు అంధకారంలోకి నెట్టివేయబడుతారు.. మీ గుండెల్లో ఉన్న గుజరాత్‌కు ఒక నీతి.. మేం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకో నీతా..? నల్లనేలపై నివాసం ఉంటున్న కార్మికులు, కార్మికేతరులు అన్నీ గమనిస్తున్నరు.. సింగరేణిని టచ్ చేస్తే వేటు వేయడం ఖాయం.. జాగ్రత్త” అంటూ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. కాగా.. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. శనివారం మంచిర్యాల జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల సూర్యులు కదం తొక్కారు. ప్రైవేటీకరణను నిరసిస్తూ నిర్వహించిన మహాధర్నా గ్రాండ్ సక్సెస్ అయింది. నల్లసూర్యులు గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీపీలపై సేవ్ సింగరేణి నినాదాలతో హోరెత్తించారు. ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 8 : సింగరేణి బొగ్గు బావులను వేలం నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మా బొగ్గు బావులను మాకే ఇవ్వాలని, ప్రైవేటుకు ఇవ్వాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లో సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం మహాధర్నా నిర్వహించారు. సేవ్ సింగరేణి.. బీజేపీ హఠావో.. సింగరేణి బచావో.. అనే నినాదాలతో కార్మికలోకం హోరెత్తించింది. హైదరాబాద్ వచ్చిన మోదీ వేలం నుంచి బొగ్గు బావులను తీసేస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే బీజేపీ నాయకులు కోల్‌బెల్ట్ ఏరియాలో తిరగనివ్వమంటూ హెచ్చరించారు.
సింగరేణి కార్మికులు కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుందో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బొగ్గుబావులు అంటేనే తెలంగాణ రాష్ట్రం గుర్తుకొస్తుందన్నారు. అలాంటి బొగ్గు బావులను ప్రైవేటీకరించి తెలంగాణపై కక్ష సాధించాలని కేంద్రంలోని బీజేపీ చూస్తుందన్నారు. బొగ్గు బావులను ప్రైవేటుకు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలు రాసినా.. పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికుల బతుకులు బాగు పడ్డాయన్నారు. ఈ విషయాన్ని కార్మికులంతా గమనించాలన్నారు. బొగ్గు గనులు ఇవ్వకుండా సింగరేణిని నష్టాల్లోకి తీసుకెళ్లి ప్రైవేటీకరించాలనే మోదీ చేస్తున్న కుట్రలను సింగరేణి కార్మికలోకం సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
నష్టాల్లోకి నెట్టి.. ప్రైవేటీకరణ..
సింగరేణి సంస్థకు బొగ్గు గనులు కేటాయించకుండా, లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లోకి నెట్టి ప్రధాని నరేంద్రమోదీ తన స్నేహితుడైన అదానీకి సంస్థను అమ్మాలని కుట్ర చేస్తున్నాడని బాల్క సుమన్ విమర్శించారు. ఆ కుట్రను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా ‘నా కంఠంలో ప్రాణం ఉండగా.. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ కానివ్వమని’ చెప్పారన్నారు. అయినా నరేంద్ర మోదీ, ఆయన దోస్తులు సింగరేణి సంస్థ మీద కన్నేసి దుర్మార్గంగా బొగ్గు గనులు మనకు కేటాయించకుండా ప్రైవేటు వేలంలో పెడుతున్నారన్నారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ముడి ఇసుప ఖనిజ గనులు కేటాయించకుండా, ఆ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి పోయిందని చెప్పి దాన్ని అమ్మేద్దామని చూస్తున్నారన్నారు. రేపటి రోజున సింగరేణికి సంస్థకు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టి దీన్ని కూడా ప్రధాని నరేంద్రమోదీ దోస్తు అదానీకి అప్పగించే కుట్ర చేస్తున్నారన్నారు.
ఇవాళ దేశం మొత్తంలో చూసుకుంటే అన్ని సహజ వనరుల ఆధిపత్యాన్ని కేంద్ర ప్రభుత్వం వదులుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆధిపత్యాన్ని వదులుకునేలా చేస్తూ అన్ని అప్పనంగా అదానీకి కట్టబెడుతూ వెళ్తుందన్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలోని పోర్టులు, ఏయిర్‌పోర్టులు, రైల్వేలు అన్నింటినీ అదానీకే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే సామాన్యులు డబ్బులు దాచుకునే ఎల్ఐసీ సంస్థ, ఎస్బీఐ బ్యాంకులోని డబ్బులను కూడా అదానీ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టడం సిగ్గు చేటన్నారు. ఇతర రాష్ర్టాల్లో అన్ని సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీకి ఇచ్చేస్తున్నారని.. అలాగే తెలంగాణలో చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. కానీ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నందుకే ఆయన గట్టిగా నిలబడి.. సింగరేణిని కాపాడాలని కొట్లాడుతున్నారన్నారు. అందుకే డిసెంబర్ 7, 2021న ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి బొగ్గు బ్లాక్‌లను సింగరేణి సంస్థకే ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారన్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు లేఖలు రాయలేదని ప్రశ్నించారు. మీ చేతకాని దద్దమ్మ చర్యలతోనే కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తుందని మండిపట్టారు.
మాదే ఎక్కువ వాటా.. మరి ఎందుకు ఇవ్వరు..
సింగరేణిని ప్రైవేటీకరించే ఉద్దేశం లేదు. మేము సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని, ఇందులో 51 శాతం వాటా రాష్ర్టానిది, 49 శాతం వాటా కేంద్రానిది అని చెబుతున్న బీజేపీ నాయకులు మరీ మేం అడుతున్న బొగ్గు గనులు మా సంస్థకు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. అదే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిగ్మైట్ మైన్స్‌ను కార్పొరేషన్‌కే ఇవ్వండని అడగ్గానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసిందన్నారు. అదే ఇక్కడ సింగరేణి సంస్థ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లేఖలు రాసినా, మూడు, నాలుగు రోజులు కార్మికులు సమ్మే చేసినా, ఎమ్మెల్యేలు ఒక్క రోజు దీక్ష చేసినా.. సింగరేణి సంస్థకు మాత్రం బొగ్గుబావులు ఇస్తలేదన్నారు. అంటే నరేంద్రమోదీ సొంత రాష్ర్టానికి ఒక నీతి.. తెలంగాణకు ఇంకో నీతా అని మండిపడ్డారు. తెలంగాణ మీద కక్ష, పగ పట్టినట్లు సింగరేణి సంస్థకు అన్యాయం చేస్తున్నారన్నారు. గోలేటీ నుంచి సత్తుపల్లి దాకా బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండం, ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం ఈ పట్టణాలన్ని గొప్పగా తయారయ్యాయంటే ఈ ప్రాంత ప్రజానీకానికి, సింగరేణి సంస్థకు పేగుబంధంతోనే అన్నారు. సుమారు 20 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలతో ప్రత్యేక్ష అనుబంధం ఉన్న సింగరేణి సంస్థతో కలిసి మూడు తరాలు బతికాయని, ఇప్పుడు నాలుగో తరం బతుకుతుందన్నారు. అలాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్న బీజేపీని బొంద పెట్టాలా.. వొద్దా.. మీరే చెప్పాలన్నారు.
తెలంగాణపై ప్రేమ ఉంటే.. హామీలు ఏమైనయ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణకు వచ్చిన క్రమంలో తెలంగాణ ప్రజానీకం ముక్త కంఠంతో.. ‘నరేంద్ర మోదీ తెలంగాణ మీద ఎందుకు కక్ష కట్టినవ్.. మా సింగరేణి బొగ్గు గనులు మాకు ఎందుకు ఇస్తలేవు. తెలంగాణకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఎందుకు ఇస్తలేవు. విభజన చట్టం ప్రకారం ఇక్కడ గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెడుతలేవు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇస్తలేవు” అని ప్రశ్నించారు. అదే కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయని అక్కడో ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవ్. మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వమని సిఫార్సు చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నిధులు ఇవ్వకపోగా బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన రూ.40 వేల కోట్లు కట్ చేసింది దుర్మార్గమైన నరేంద్రమోదీ ప్రభుత్వం అని విమర్శించారు.
అదానీకే మోదీ ప్రధానమంత్రి..
జాతీయ పార్టీ నుంచి ప్రధానిగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ కేవలం అదానీకే ప్రధాన మంత్రిగా, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకే ప్రధానమంత్రిగా పని చేస్తున్నాడన్నారు. తెలంగాణ లాంటి కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి ప్రధానిగా ఆయన వ్యవహరించడం లేదన్నారు. అన్ని రాష్ర్టాలను సమాన కోణంతో చూడాలనే ఆలోచనను విస్మరించి తెలంగాణ మీద కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల కంటే అదనంగా ఒక్క రూపాయి తెలంగాణకు ఇచ్చారా.. అని మోదీని, రాష్ట్ర బీజేపీ నాయకులను నిలదీశారు. మాకు రావాల్సిన న్యాయమైన వాటా కంటే అదనంగా ఒక్క రూపాయన్న ఇచ్చారా.. సమాధానం చెప్పాలన్నారు. తొమ్మిదేండ్ల మీ పాలనలో తెలంగాణను అడుగడుగునా ఇబ్బంది పెడుతు న్నారని మండిపడ్డారు. తెలంగాణ మీద కక్ష కట్టినట్లు పని చేస్తున్నారన్నారు.
పిచ్చి పనులు.. తెలంగాణలో సాధ్యం కావు..
తెలంగాణ మీద కోపంతో బీజేపీ నాయకులు మత చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా అది కుదర్లేదని, మతాల మంట పెట్టి చలికాచుకోవాలనే ప్రయత్నాలను కేసీఆర్ ఉక్కు పాదంతో అణచివేశారన్నారు. మొన్నటికి మొన్న మన ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం చేస్తే.. ఆ దొంగలను దొరకబట్టి బయట పెట్టామన్నారు. చివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్లు లీక్, పదో తరగతి ఎగ్జామ్ పేపర్లు లీక్‌ల వెనుక ఉంది బీజేపీ కార్యకర్తలే అన్నారు. పేపర్లు లీక్ చేసిన వాళ్లందరూ బండి సంజయ్ అనే బద్మాష్తో ఫోన్లలో మాట్లాడుతారన్నారు. అందుకే మొన్న పోలీసులు ఫోన్ ఇయ్యి బండి అని అడిగితే నేను ఇయ్య నా ఫోన్ అంటున్నాడన్నాడు. అదే మన కవితమ్మ మీద అక్రమ కేసు పెడితే పులి బిడ్డ కాబట్టి బాజాప్తా ఫోన్లు ఇచ్చేసిందన్నారు. బండిని మాత్రం విచారణలో భాగంగా పోలీసులు ఫోన్ ఇయ్యమంటే ఇస్తలేడని నిజంగా ఏం తప్పు చేయకపోతే పోలీసోళ్లకు ఫోన్ ఎందుకు ఇస్తలేవో చెప్పాలన్నారు. నువ్వు ఫోన్ ఇస్తే నీ బండారం అంతా బయటపడుతుందన్నారు. గతంలో నువ్వు లీక్ చేసిన పేపర్ల సంగతి, భవిష్యత్తులో నువ్వు ఏం చేద్దామని ప్లాన్ చేసుకున్నవో ఆ విషయాలు బయటకొస్తయనే భయంతోనే నువ్వు ఫోన్ ఇస్తలేవన్నారు.
సింగరేణిని కాపాడుకుంటాం
సింగరేణి గనుల ప్రైవేటీకరణను అడ్డుకొని కాపాడుకుంటాం. రామగుండం ఎరువుల కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేట్‌పరం చేయబోమని చెప్పారు. ఆ తర్వాత వేలం ప్రక్రియ ప్రారంభించారు. దేశ ప్రధాని అయి ఉండి ఇలా మాట మార్చడం ఎంత వరకు సమంజసం. కొత్త గనులకు అనుమతులు కావాలని కోరితే పట్టించుకోవడం లేదు. బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేసి నేరుగా సింగరేణికి గనులు కేటాయించాలి. నష్టాల పేరిట ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న బీజేపీకి కార్మికులు, ఉద్యోగులు తగిన బుద్ధిచెబుతారు. సింగరేణి నుంచి ఒక్క బొగ్గు పెల్లనూ తీయనివ్వం. కేంద్రంలో కదలిక వచ్చే వరకూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాటాలు చేస్తాం. మా ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. సింగరేణిలో 12వేలకు పైగా కారుణ్య ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే.
– దివాకర్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే
కేంద్రం దిగివచ్చే వరకూ పోరాటం
ఉద్యమ నాయకుడైనా సీఎం కేసీఆర్ తెలంగాణలో సుపరిపాలన అందిస్తుంటే ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు నుంచి పేపర్ల లీకేజీల వరకు బీజేపీ బండారం బయటపడింది. దేశంలో ఉన్న సహజవనరులను కేంద్రం ప్రైవేట్ పెట్టుబడిదారులకు దోచిపెడుతుంది. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలి. నేరుగా సింగరేణికీ కేటాయించాలి. లేదంటే కేంద్రం దిగి వచ్చే వరకూ పోరాటం చేస్తాం. గనుల ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళనల్లో సింగరేణి కార్మికులు భాగస్వాములు కావాలి.
– దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే
మరో ఉద్యమానికి శ్రీకారం
బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేట్‌పరం కాకుండా పోరాటం చేస్తున్నది. కేంద్రంపై కొట్లాడుతాం అని ఇప్పటికే అంసెబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రైవేటీకరణను విరమించుకుని బొగ్గు బ్లాకులను నేరుగా సింగరేణి సంస్థకే అప్పగించాలని కేంద్రానికి లేఖ కూడా రాశారు. అయినప్పటికీ కేంద్రం స్పందించడం లేదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఫలితముండదు.
– ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఆస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నది. సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తే ఇక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. సీఎం కేసీఆర్‌తోనే నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడం సాధ్యమవుతుంది. కాంగ్రెస్, బీజేపీలను నివారించే సత్తా, శక్తి సీఎం కేసీఆర్‌కే ఉంది. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని సాగనంపాలి. ఇందుకు ప్రజలంతా ఏకం కావాలి. – పురాణం సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ
బీజేపీ మతాలను రెచ్చగొడుతుంది
సీపీఐ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నం. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా డిజిన్వేస్ట్మెంట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలను పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నది. ఇప్పటికే చాలా సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఉన్న సంస్థలను కాపాడుకోవడానికి పోరాటాలకు సిద్ధమవుతున్నం. సింగరేణి గనుల ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టాం. ప్రభుత్వాన్ని ఆస్థిర పర్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తున్నది. మతాలను రెచ్చగొడుతూ ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై ఇంటింటా ప్రచారం చేయబోతున్నం.
– కలవేని శంకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
మోదీకి నిరసన సెగ తగిలింది
సింగరేణి కార్మికవర్గం పోరాటాలతో నరేంద్రమోదీకి మరోసారి నిరసన సెగ తగిలింది. ప్రధాని స్థాయిలో ఉండి గనులను ప్రైవేటీకరించబోమని చెప్పి తిరిగి వేలం వేస్తూ మోసం చేస్తున్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను వెంటనే తెరిపించాలి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే సీసీఐని నడిపిస్తుంది. సింగరేణి గనులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించకుంటే కార్మికులు బీజేపీ నాయకులను తరిమికొడతారు.
– జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
పర్యటన ఉంటే.. ఏదో ఒకటి చేస్తారు..
తెలంగాణ రాష్ర్టానికి నరేంద్ర మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రో వస్తారనగా వారం ముందు ఏదో ఒకటి అయితదన్నారు. ఇగ వచ్చినోళ్లు తెలంగాణలో ఇట్లా అయ్యిందని గట్టిగ మాట్లాడి.. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారన్నారు. ఈ పేపర్ లీకులు, ఎమ్మెల్యేల కొనుగోలు, మత కలహాలు అన్ని దుర్మార్గమైన ప్రయత్నాలని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా గట్టిగా ఉండాలన్నారు. గతంలో గట్టిగా ఉన్నోళ్లమే మనమని, 14 ఏండ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నోళ్లమని సుమన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమంలో ఎన్నో దెబ్బలు తిని, జైళ్లకు పోయి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. గులాబీ జెండా అంటే తెలంగాణను తెచ్చిన పార్టీ అని, ఆ నాటి గులాబీ జెండా ఇవాళ బీఆర్ఎస్గా మారి తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమాన్ని దేశమంతా పంచాలనే ఉద్దేశంతో మరోసారి జెండా ఎత్తి.. పిడికిలి ఎత్తి ముందుకు పోతుందన్నారు. సింగరేణి అనేది పూర్తిగా తెలంగాణ ఆస్తి.. ఇది ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు సింగరేణి ఆస్తిని అప్పగించే విధంగా మనం ముందుకు పోదామన్నారు. ప్రైవేటీకరణ కుట్రలను సింగరేణి సంస్థతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ను విమర్శించే హక్కు ఎవరికీ లేదు..
సింగరేణి కోసం బీఆర్ఎస్ చేస్తున్న కృషి, పోరాటాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని బాల్క సుమన్ స్పష్టం చేశారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారి లాభాల్లో 30 శాతం వాటా కార్మికులకు ఇస్తున్న ఏకైక సంస్థ సింగరేణి అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మికులు ఎంత వాటా ఇస్తున్నరు. 10 శాతమన్న ఇస్తున్నారా..? దమ్ముంటే చెప్పాలని సవాల్ చేశారు. తెలంగాణ కార్మికులకు లాభాల్లో వాటాతోపాటు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నామన్నారు. భారతదేశంలో ఎక్కడన్న ఇలాంటి అభివృద్ధి, సంక్షేమం ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం చేయకుండా ఉల్టా మీటింగ్‌లు పెట్టి బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారు ఎవరైనా వస్తే తట్ట మర్రేసి కొట్టాలన్నారు. అప్పుడే వాడుపోయి ఢిల్లీలో విషయం చెప్తాడన్నారు. 20 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోతాయ్.. కోల్ బెల్ట్‌లో కనబడితే కొట్టే పరిస్థితి ఉందంటే.. పరిస్థితి ఎలా ఉందో తెలుస్తున్నది. ప్రైవేటువాడికి గనులు ఇచ్చినంక మీరు ఎక్కడ ఉంటారో ఆలోచించుకోవాలన్నారు. సింగరేణిపై నరేంద్ర మోదీ కన్ను పడిందని, ఆయన కన్ను పడితే కచ్చితంగా తీసుకుని పోయి అదానీ చేతిలో పెడతాడు అన్నారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు పడుతామని హెచ్చరించారు.
చూస్తూ ఊరుకోం
తెలంగాణ కల్పతరువు సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలను తిప్పికొట్టాలి. ఇందుకు కార్మికులంతా ఏకం కావాలి. తెలంగాణ అభివృద్ధికి ప్రధాన వనరుగా ఉన్న సింగరేణిని నష్టాల పేరిట అదానికి అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోం. కేంద్రం ఇప్పటికే దేశంలోని బొగ్గు పరిశ్రమల నుంచి 33 శాతం వాటాలను అమ్ముకుంది. తెలంగాణలోని గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి ఉద్యోగ. ఉపాధి అవకాశాలను దెబ్బతీయాలని చూస్తున్నది. దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలో లేని విధంగా సింగరేణిలో సీఎం కేసీఆర్ కార్మికులకు అనేక హక్కులు కల్పిస్తున్నరు. సింగరేణికి వచ్చిన లాభాల్లో నుంచి 30శాతం వాటా ఇస్తున్నరు. ఇంతటి గొప్ప సంస్థను ప్రైవేట్వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉద్యమించాలి.
– కెంగర్ల మల్లయ్య, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
సింగరేణి ఒక్కరిది కాదు..యావత్ తెలంగాణ సమాజానిది..
సింగరేణి సంస్థ ఏ ఒక్కరిది కాదని బాల్క సుమన్ స్పష్టం చేశారు. సింగరేణి బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసి పరిశ్రమలకు, గృహావసరాలు, పొలాలకు నీటి సరఫరా చేసేందుకు వాడుకుంటున్నామన్నారు. ఇది ప్రైవేటు వాళ్ల చేతిలోకి పోయాక వాళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి కరెంట్ ఇయ్యకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు. ఇవన్నీ సింగరేణితో ముడిపడి ఉన్నాయి కాబట్టే,ఈ సంస్థను దెబ్బకొట్టాలనేది మోదీ ఆలోచన అన్నారు. ఈ కుట్రను ప్రజలంతా గుర్తించాలన్నారు. అంతా కలిసి సింగరేణిని కాపాడుకునే పోరాటంలో మమేకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు..