హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను బొగ్గు ఉత్పత్తిలో 99 శాతం, రవాణాలో 103 శాతం లక్ష్యాలను సింగరేణి సాధించడంపై ఆ సంస్థ సీఎండీ బలరాం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏప్రిల్ నుంచి జూన్ వరకు బొగ్గు రవాణా లక్ష్యాన్ని 160 లక్షల టన్నులుగా పెట్టుకున్నామని, 103 శాతంతో 166 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందని బలరాం తెలిపారు. అలాగే ఉత్పత్తి లక్ష్యం 160 టన్నులకుగాను 159.9 లక్షల టన్నులు సాధించినట్టు వెల్లడించారు. శనివారం సంస్థ పరిధిలోని అన్ని ఏరియాల్లోగల డైరెక్టర్లు, జీఎంలతో సీఎండీ బలరాం త్రైమాసిక ప్రగతిపై ఇక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం దృష్ట్యా ఓపెన్ కాస్ట్ల్లో ఉత్పత్తి కుంటుపడకుండా చూడాలని సూచించారు. రాబోయే త్రైమాసికాల్లోనూ లక్ష్యాలను సాధించాలన్న ఆయన.. రక్షణతోకూడిన ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.