Revanth Reddy | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : మంత్రి జూపల్లి కృష్ణారావు మెడ మీద కత్తి వేలాడుతున్నదా? అదే ఊస్టింగ్ రేస్‌లో మరో ఇద్దరు మంత్రులు ఉన్నారా? వాళ్లు తమ పదవులను కాపాడుకోవడానికే ఇంత రాద్ధాంతం చేశారా? కేటీఆర్ విసిరిన సవాల్‌ను సీఎం కాదు.. కనీసం ఆర్థిక మంత్రి కూడా కాని జూపల్లి అందుకే స్వీకరించారా? కొండకు దారం కట్టి తమ భవిష్యత్తును పరీక్షించుకోవాలని చూస్తున్నారా? అందుకే వెనుకా ముందు ఆలోచించకుండా వెళ్లి ప్రతిపక్షం ఉచ్చులో పడిపోయారా? దాన్ని కప్పిపుచ్చుకొనే క్రమంలో ఏకంగా ప్రభుత్వాన్నే ముంచుతున్నారా? పోతూ.. పోతూ ప్రభుత్వాన్ని ముంచి పోదామనుకుంటున్నారా అని వారిని సీఎం నిలదీశారా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. అంపశయ్యపై పదవులకు జీవ గంజి పోసే ఆఖరి ప్రయత్నంగానే ఆ మంత్రులు మితిమీరిన దూకుడుతనం ప్రదర్శిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు.
అధికారంలో ఉండి.. అస్త్రాలు చేతిలో పెట్టుకొని కూడా ప్రతిపక్షం ట్రాప్‌లో పడ్డామని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేక తెలియక వాళ్ల ఉచ్చులో ఇరుక్కున్నామా? అనేది తేల్చాల్సి ఉన్నదని ముఖ్యమంత్రి తన సన్నిహితుల వద్ద అన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మనంతట మనమే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే అవకాశం కల్పించి, ప్రతిపక్ష బీఆర్ఎస్కు మైలేజీ ఇచ్చామని ఆ పార్టీ నేతల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మాజీ మంత్రులను చర్చలకు కవ్వించడం మంత్రులు చేసిన తప్పిదమని, గోల్ కొడుతామని బీరాలు పలికి చివరకు సెల్ఫ్‌గోల్ వేసుకున్నామని గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశం ప్రారంభానికి ముందే సీఎం అసంతృప్తి వ్యక్తి చేసినట్టు తెలిసింది. ‘మా అన్నలు నన్ను ముంచి పోవాలనుకుంటున్నారేమో’ అని వ్యంగ్యాస్ర్తాలు కూడా సంధించినట్టు సమాచారం. ఈనేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణ మరోసారి తెరమీదికి వచ్చింది.
సీఎం రేవంత్‌రెడ్డి గత నెల 11న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం జూన్ 12న ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో ఆయన నివాసంలోనే భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు 30 నిమిషాలకు పైగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర మంత్రుల పనితీరుపై ఒక నివేదిక సీల్డ్కవర్లో పెట్టి ఇచ్చినట్టు సమాచారం. ఈ రెండున్నరేండ్ల కాలంలో నిఘావర్గాల ద్వారా తెప్పించిన సమాచారం ఆధారంగా మంత్రుల నిర్దిష్టమైన పనితీరు, శాఖల పరిధిలో జరిగిన అవినీతి, జిల్లాల్లో గ్రూప్ రాజకీయాలు తదితర అంశాలపై క్లుప్తంగా, సూటిగా 15 పేజీల నివేదిక ఇచ్చినట్టు సమాచారం. వారిలో నలుగురు మంత్రుల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసిది. పరిపాలనా పరమైన వైఫల్యాలతోపాటు శాఖా పరమైన అవినీతిని, నోటి దురుసుతనం తదితర కారణాలను ఎత్తిచూపుతూ.. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్లను ప్రస్తావించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రివర్గ ప్రక్షాళనపై అధిష్ఠానం దృష్టిసారిస్తే ఆ నలుగురి పేర్లను పరిశీలించాలని కోరినట్టు విశ్వసనీయ సమాచారం. లేఖను రాహుల్‌గాంధీ తీసుకొని తన వద్దే పెట్టుకొన్నట్టు చెప్తున్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు భర్తీ చేయడంతో పాటు, మంత్రివర్గ ప్రక్షాళన కూడా జరుగుతుందనే ప్రచారం గత నెల రోజుల నుంచి జోరుగా సాగుతున్నది. దీనికి తోడు మే నెల చివరి వారం, జూన్ మొదటి వారంలో ఆశావహులైన కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పదవి పోతుందనే ఊహాగానాలు తెరమీదికి రావడం తదితర అంశాలు మంత్రివర్గ ప్రక్షాళన జరిగి తీరుతున్నదనే దానికి మరింత బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణారావు తనకు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొన్నారనే చర్చ జరుగుతున్నది. నిజానికి ప్రతిపక్షాలు సవాల్ విసిరిన అప్పుల అంశంతో జూపల్లికి ఎటువంటి సంబంధం లేకున్నా.. ఆయన కల్పించుకొని సందులోకి దూరారని, చర్చలు అక్కడా, ఇక్కడ కాకుండా నేరుగా తెలంగాణ భవన్‌కి వచ్చి మాట్లాడుతానని ప్రకటించడం, తర్వాత తప్పుకోవడం వెనుక ఆయన వ్యక్తిగత ఎజెండానే ఉన్నదని కాంగ్రెస్ సహచర మంత్రులు అనుమానిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియా వేదికల్లోనే ప్రచారం జరిగింది. లికర్ టెండర్ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ వీఆర్ఎస్ తీసుకొన్న తరువాత ఆ ప్రచారం మరింత పెరిగింది. తాజా నివేదిక నేపథ్యంలో మార్పు అనివార్యం అని ప్రచారం జరుగుతున్నది. దీంతో తన పదవిని కాపాడుకోవడంలో ఆయన చివరి ప్రయత్నం కావొచ్చని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు.
డెకన్ సిమెంట్స్ వివాదంలో తృటిలో తప్పించుకొన్న మంత్రి కొండ సురేఖను తప్పించాలని సీఎం పట్టుపడుతున్నట్టు సమాచారం. డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను గన్‌తో బెదిరించాడనే ఆరోపణలపై మంత్రి ఓఎస్డీ సుమంత్‌ను పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లడంలో కాంగ్రెస్ నేత రోహిణ్‌రెడ్డి కూడా ఉన్నారని ఆయన వెనుకున్న ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉన్నదా? అని సురేఖ కూతురు సుస్మితా పటేల్ గత ఏడాది అక్టోబర్‌లో చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. సుమంత్‌ను అడ్డం పెట్టుకొని తన తల్లిని అరెస్టు చేసేందుకే మహిళా పోలీసులు వచ్చారంటూ సుస్మిత ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రోహిణ్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అప్పటి నుంచే కొండా సురేఖను ముఖ్యమంత్రి టార్గెట్ చేసినట్టు చెప్తున్నారు. అప్పుడే మంత్రివర్గం నుంచి తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ సురేఖకు ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ అండగా నిలబడినట్టు చెప్తున్నారు. ప్రక్షాళన నేపథ్యంలో ఆమెను తొలగించాలని సీఎం కోరినట్టు చెప్తున్నారు. లాస్ట్ బార్గెనింగ్గానే కొండా సురేఖ దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్తున్నారు. గురువారం జరిగిన క్యాబినెట్ భేటీకి ఆమె డుమ్మా కొట్టడం, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు ప్రక్రియలో తనను తృణీకరించడంపై బహిరంగంగా అసంతృప్తి చేయడం, లేఖ బయటకు లీకు కావడం చివరి ప్రయత్నమేనని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఆమె సన్నిహితులే లేఖను లీక్ చేసి ఉంటారని చెప్తున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ నోటి దురుసుతనంతో పాటు, సిద్దిపేట, మేడ్చల్ జిల్లా రావల్కోల్ భూముల వివాదాలను అధిష్ఠానానికి ఇచ్చిన నివేదికలో సీఎం ప్రముఖంగా పొందుపరిచినట్టు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా తోటి మంత్రిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు, ఒక సందర్భంలో సన్నిహితుల వద్ద తనపైనే నోరు పారేసుకొన్నట్టు ఆడియో వివరాలను ఆ నివేదికలో పొందుపరిచినట్టు చెప్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజా సంబంధాలకు దూరంగా ఉంటున్నారని నివేదించినట్టు సమాచారం. భట్టి విక్రమార్క విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. ఆయనను తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డంప్రసాద్కు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపై రాహుల్‌గాంధీ కూడా సానుకూలంగా ఉన్నారనే చెప్తున్నారు.