సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): అరుదైన ‘క్రానిక్ సిజేరియన్ సార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’తో బాధపడుతున్న ఒక మహిళకు రెయిన్బో బర్త్‌రైట్ హాస్పిటల్ వైద్యులు సమస్యను గుర్తించడంతో పాటు విజయవంతంగా ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స జరిపి పునర్జన్మ ప్రసాదించారు. భవిష్యత్తులో మళ్లీ ఆమె తల్లి అయ్యే విధంగా చికిత్స అందించారు.
వివరాల్లోకి వెళితే…నగరానికి చెందిన ఓ మహిళ(27) గతంలో సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే రెండోసారి గర్భం దాల్చిన మహిళకు ఆరు వారాల గర్భం దశలో తీవ్ర రక్తస్రావం మొదలైంది. దీంతో బాధితురాలు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లగా అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, అసంపూర్ణ గర్భస్రావం అని చెప్పారు. సమస్య నివారణ కోసం రోగికి (డి అండ్ ఈ) ప్రక్రియ చేసి ఇంటికి పంపించారు. ఐనా రక్తస్రావం ఆగకపోవడంతో పలుమార్లు చికిత్స పొందినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు రెండో అభిప్రాయం కోసం బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్‌ను ఆశ్రయించారు.
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మహిళను రెయిన్బో గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ మానస బడ్వేలి పరీక్షలు నిర్వహించగా, గత సిజేరియన్ గాటు వద్ద పెద్ద రక్తనాళాలతో కూడిన గడ్డ ఉన్నట్లు అల్ట్రాసౌండ్‌లో గుర్తించారు. అనంతరం ఎంఆర్ఐ పరీక్షల ద్వారా అది ‘క్రానిక్ సిజేరియన్ సార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ అని నిర్ధారించారు. ఈ పరిస్థితిలో గర్భం గర్భాశయం లోపల కాకుండా, గత సిజేరియన్ గాటు వద్దే పెరగడం జరుగుతుందని గుర్తించిన వైద్యులు ఇది అత్యంత అరుదైన సమస్య అని రోగికి వివరించారు. లక్ష మంది మహిళల్లో ఒకరికి మాత్రమే ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
రోగి తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న నేపథ్యంలో వైద్యుల బృందం అత్యంత జాగ్రత్తగా ల్యాప్రోసోపిక్ (కీహోల్) శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గత సిజేరియన్ సమయంలో చేసిన గాటు వద్ద పెరిగిన అసాధారణ గర్భధారణను పూర్తిగా తొలగించి, రెండు పొరల పద్ధతిలో గర్భాశయ గోడను పునర్నిర్మించారు. అవసరమైన రక్త మార్పిడి కూడా చేసి రోగికి పునర్జన్మ ప్రసాదించారు. ఈ చికిత్సతో గర్భాశయాన్ని తొలగించాల్సిన అవసరం లేకుండా భవిష్యత్తులో సంతానం పొందే అవకాశాన్ని కూడా అందించగలిగామని వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ మానస బడ్వేలి మాట్లాడుతూ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి ఉంటే శస్త్రచికిత్స అవసరం లేకుండానే మందుల ద్వారా చికిత్స చేసేవారమని, నెలరోజుల పాటు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. గతంలో సిజేరియన్ ప్రసవం జరిగిన మహిళలు మళ్లీ గర్భం దాల్చినప్పుడు ప్రారంభ దశలో రక్తస్రావం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. గర్భస్రావానికి చికిత్స చేసిన తర్వాత కూడా వారం రోజులకు మించి రక్తస్రావం కొనసాగితే వెంటనే నిపుణుల సలహా తీసుకోవాలి.అవసరమైతే ఎంఆర్ఐ వంటి అధునాతన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని సూచించారు.