సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): తల్లి ఒడిలో నుంచి నెల రోజుల వయస్సు గల చిన్నారిని కిడ్నాప్ చేసిన అంతర్ రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ చేసిన దుండగులతో పాటు చిన్నారిని కొనుగోలు చేసేందుకు యత్నించిన మహిళ సహా మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, చిన్నారిని తల్లికి అప్పగించారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డా.రమేశ్ శేరీలింగంపల్లి డీసీపీ సీహెచ్.
శ్రీనివాస్, ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ డీసీపీ సృజనతో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. కర్ణాటక రా ష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన మలన్ బౌరవ్ శాం తాబాయి అనే మహిళ సరస్ బృందంతో కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్ గోడ పకన నివసిస్తోంది. జూన్ 30వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఆమె తన నెల రోజుల పాపను ఒడిలో పెట్టుకుని నిద్రిస్తున్న వేళ, ఆటో లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. పాప ఏడుపు విని మేలొన్న తల్లి వెంటపడినా అప్పటికే నిందితులు పరారయ్యా రు.
దీంతో బాధితురాలు చందానగర్ పోలీసుల కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్సీపురం డివిజన్ ఏసీపీ సీహెచ్. వై.శ్రీనివాస్ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక పోలీ సు బృం దాలను ఏర్పాటు చేశారు. చందానగర్ ఇన్స్పెక్టర్ ఎస్.విజయ్, అమీన్పూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, చందానగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎన్.భాసర్ నేతృత్వంలోని బృందాలు సైబరాబాద్, హైదరాబాద్, మలాజిగిరి ప్రాం తాల్లోని వందలాది సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి మూడు రోజుల వ్యవధిలో నిందితులను గుర్తించాయి.
దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోల్‌కతాకు చెందిన రహనుమా అలీకి వివాహమైనా సంతానం లేకపోవడంతో, డబ్బులు చెల్లించి ఒక శిశువును సమకూర్చాలని తన బంధువైన నిమ్మీ జహాన్ అలీ అలియాస్ సీమాను కోరింది. సీమా తన స్నేహితురాలు నాజియాను సంప్రదించగా, ఆమె తన కాబోయే భర్త జుబేర్‌కు ఈ విషయం తెలిపింది. దీంతో జుబేర్ తన స్నేహితుడు, ఆటో డ్రైవర్ అయిన ఇర్ఫాన్‌తో కలిసి శిశువును అపహరించి విక్రయించాలని పథకం రచించాడు.
ఇందులో భాగంగా లింగంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో నిద్రిస్తున్న తల్లి, చిన్నారిని లక్ష్యంగా చేసుకుని జూన్ 30 తెల్లవారుజామున పాపను కిడ్నాప్ చేశాడు. అనంతరం చిన్నారిని నాజియా ఇంటికి తరలించి విషయం సీమా, రహనుమా అలీకి తెలియజేశాడు. జూలై 1న రహనుమా అలీ కోల్‌కతా నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుని శిశువును తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకోసం జుబేర్ ఖాతాకు ఆన్లైన్ ద్వారా రూ.1.50 లక్షలు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులు చిన్నారిని కోల్‌కతాకు తరలించేలోపే పోలీసులు ప్రధాన కిడ్నాపర్ వికారాబాద్‌కు చెందిన మహ్మద్ జుబేర్, కిడ్నాప్‌కు సహకరించిన మహ్మద్ ఇర్ఫాన్, చిన్నారి విక్రయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నేరేడ్మెట్కు చెందిన సాదేకా మక్సూద్ అలియాస్ నాజియా, బంజారాహిల్స్‌కు చెందిన నిమ్మీ జహాన్ అలీ అలియాస్ సీమా అలీతో పాటు శిశువును కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కోల్‌కత్తాకు చెందిన మహిళ రహనుమా అలీని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పసికందును క్షేమంగా రక్షించి, ఆమె తల్లికి అప్పగించారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.రమేశ్‌రెడ్డి అభినందించారు.