ములుగు, సెప్టెంబర్22(నమస్తేతెలంగాణ)/తాడ్వాయి : మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, తల్లుల దర్శనం, మొక్కులు సమర్పణతో పాటు జంపన్నవాగులో పుణ్యస్నానాలను ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకోనున్నారు. 1.30 గంటల వరకు మేడారం గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పూజారులతో కలిసి పరిశీలించి వారి అభిప్రాయాలను తెలుసుకొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించనున్నారు. భోజన విరామం అనంతరం 2.30 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి తిరుగు ప్రయా ణం కానున్నారు. కాగా, సీఎం వెంట రాష్ట్ర మంత్రులు సీతక్క, సురేఖ, లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి రానున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ మహేందర్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయలతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పరిశీలించారు. హెలిప్యాడ్‌తో పాటు గద్దెల వద్దకు ముఖ్యమంత్రి వచ్చే మార్గాన్ని, తల్లులను దర్శించుకునేందుకు చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.