హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలపై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మరోసారి బెదిరింపులకు దిగారు. తమాషాలు చేయొద్దని, వేషాలు వేయొద్దని హెచ్చరించారు. 2014 నుంచి ఇప్పటివరకు చదువుకున్న విద్యార్థులెవరు, ఫీజు రీయింబర్స్మెంట్ పొందిన సంస్థలేవి? ఈ రోజు ఎవరెవరికి బకాయి ఉన్నదో తేల్చేందుకు ఒక సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయాల్సి ఉందని అన్నారు. సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడా రు. కాలేజీ యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నాయని విద్యా సేవ చేయడం లేదని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యాలు ఎలా సంపాదిస్తున్నాయో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఏయే సీటుకు ఎంత డొనేషన్ తీసుకుంటున్నారో మాకు తెలియదనకుంటున్నారా? వచ్చే ఏడాది డొనేషన్లు ఎట్లా తీసుకుంటారో చూస్తానని అంటూ బెదిరింపులకు దిగారు. రాజకీయ ప్రేరేపితమైన స్టేట్మెంట్లు ఇస్తూ, అధికారులను తిడితే ఫీజు రీయింబర్స్మెంట్ రాదని స్పష్టంచేశారు. ఎవరెవరు ఎన్ని షిఫ్టింగ్‌లు అడిగిండ్రో, ఎన్ని మూతపడిన కాలేజీలకు పర్మిషన్లు అడిగిండ్రో, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగిండ్రో తన దగ్గర లిస్టు ఉన్నదని సంఘం నాయకులను భయపెట్టే ప్రయత్నం చేశారు. ‘బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అయితది. మూడు నెలలకో ఆరు నెలలకో మేము ఫీజులిస్తాం..
అప్పుడు విద్యకు దూరం అయిన పిల్లలు ఏం గావాలె? అప్పుడు మేము ఎవరిని శిక్షించాలె. పిల్లల జీవితాలతో చెలగాటమాడొద్దని యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఏం బకాయిలున్నాయో అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలేమున్నాయో అవి ఆడనే పోయి అడుగుండ్రి. ఉన్నవి 3,600 కోట్ల బకాయిలు మాత్రమే. ఆరు వేలు ఇయ్యుండ్రి, ఐదు వేలు ఇయ్యుండ్రి అని ఉపన్యాసాలిస్తున్న రు. ఆ ఉపన్యాసాలిచ్చేటాయన 12 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వమని పైరవీకి వచ్చిం డు. అరోరా రమేశ్ ఎన్ని కాలేజీలకు అనుమతులు అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ప్రభుత్వం ఉంటుందా? జయప్రకాశ్ అనేటాయన కాలేజీ మహబూబ్‌నగర్‌లో ఉన్నది. ఆయన హైదరాబాద్‌లో క్యాంపస్ పెట్టుకుంటారంట.. అనుమతులివ్వాలా? ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు’ అని ఆరోపించారు. మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో, మీ వెనకా ల ఎవరున్నారో తెలుసునని బెదిరించారు. గవర్నమెంట్‌ను బ్లాక్మెయిల్ చేస్తున్నా రా? అంటూ గద్దించారు. సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ వేసి అన్నీ అమలు చేద్దామని అన్నారు.
‘వేషాలేస్తే కదరదు. ఎవడెవడు ఏయే సీటుకు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారో తెలుసు.. మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా.. నేను కూడా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తా.. ముందుకు రండి’ అంటూ సవాల్ చేశారు.