చిన్నకోడూర్, జనవరి 7: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులతో పాటు అన్నివర్గాల ప్రజాగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని, హామీలు ఎగ్గొట్టడానికి సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, 420 వాగ్ధ్దానాలు అమలు చేయాలని మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేసి అధికారాన్ని చేపట్టిందని మండిపడ్డారు. ఎన్నిలకలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.
ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డ్రామాతో ప్రభుత్వం అలజడి సృష్టిసున్నదని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పు రూ.12 వేల భరోసా ఇస్తామనడం రైతులను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 75 వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద అందించిన ఘనత కేసీఆర్‌కే దకిందన్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోకుండా రైతుద్రోహిగా సీఎం రేవంత్‌పై ముద్ర పడిందన్నారు. కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం, అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని రాధారృష్ణ శర్మ ప్రశ్నించారు.
రుణమాఫీ కోసం 42 వేల కోట్లు కావాలని చెప్పి, కేవలం 17 వేల కోట్లతో సగం మంది రైతులకు రుణమాఫీ చేసి రైతులను మరోసారి ప్రభుత్వం చేసిందన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్ ఇస్తానని మోసం చేయడమే కాకుండా రెండు నెలల పింఛన్లు ఎగ్గొట్టిన ఘనత రేవంత్ ప్రభుత్వానికి దకిందన్నారు. నిరుద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులను మోసం చేసిన ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని రాధాకృష్ణ శర్మ పేర్కొన్నారు. రైతుల బాగుకోసం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు వెచ్చించి మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మిస్తే, యాసంగికి నీరివ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు.
రైతులు వరినాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, వెంటనే కాలువల ద్వారా చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రజలు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమానికి అన్నివిధాలుగా కృషిచేసిన ఘనత కేసీఆర్‌ది అని రాధాకృష్ణ శర్మ కొనియాడారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు సదానందం గౌడ్, కనకరాజు, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఉమేశ్‌చంద్ర, మాజీ ఎంపీటీసీల పురం అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుండెలి వేణు, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు గుజ్జ రాజు, సీనియర్ నాయకుడు జంగిటి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.