హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తేతెలంగాణ): ‘రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు రకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగాల్లో చేరిన మొదట ఉడుకు రక్తంతో గరంగా ఉంటారు. కొంతకాలం తర్వాత నరం మెత్తబడుతుంది. మరికొంత కాలమయ్యాక బేషరంగా వ్యవహరిస్తూ తప్పిదాలకు పాల్పడుతారు’ అంటూ సీఎం రేవంత్రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన గ్రూప్-1, గ్రూప్-2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులు తమ విధుల్లో సామాజిక బాధ్యతను మరువొద్దని సూచించారు. ప్రజాపాలనలో నాలుగు కోట్ల మంది ప్రజలకు మీరు సేవలను అదించబోతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారని, ఆధిపత్యాన్ని ఒప్పుకోరని స్పష్టంచేశారు.
అధికారులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరుల స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పరీక్షలపై అవగాహన ఉన్న అధికారులు, సభ్యులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. అధికారులు పేదవారికి సాయం చేసేముందు తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని కోరారు. కన్నవారిని పట్టించుకోని వారి జీతంలో 10 నుంచి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీలో చట్టం చేస్తామని ప్రకటించారు. త్వరలోనే హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంసీహెచ్ఆర్డీ మధ్య అవగాహన ఒప్పందం జరుగనున్నదని చెప్పారు.