హైదరాబాద్: తెలంగాణలో (Telangana) పండుగ వలె సాగుబడి ఉన్నదని, భూమికి బరువయ్యేంత దిగుబడి వస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. వ్యవసాయరంగంలో (Agriculture) రాష్ట్రం అద్భుత పరివర్తనను సాధించిందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతుబిడ్డది తీరని దుఃఖం అని, ఆనాటి బాధలు గుర్తొస్తే ఇప్పటికీ కడుపు తరుక్కు పోతున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను (Telangana Decade celebrations) సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో తెలంగాణలో సాగునీరు లేదు, విద్యుచ్ఛక్తి లేదన్నారు. ఎండిన బోర్లు, బీటలు వారిన పంట పొలాలు ఒకవైపు, మరోవైపు పంట పెట్టుబడి లేక.. అప్పులపాలై, దళారుల చేతిలో చితికిపోయి, గతిలేక, దిక్కుతోచక దీనులైన రైతులు విధిలేక ఆత్మహత్యలు చేసుకోవడంతో వారి కుటుంబాలకు తీరని దుఃఖం మిగిలిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం అందించే అరకొర సాయంకోసం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న అపవాదును కూడా తెలంగాణ రైతుబిడ్డ ఆనాడు భరించవలసి వచ్చిందని వాపోయారు.
‘నేనూ ఒక రైతుబిడ్డనే. రైతులు ఎదుర్కొంటున్నఈ కష్టాలు, నష్టాలు నా స్వానుభవంలో ఉన్నవే. అందుకే, ఒక రైతు బిడ్డగా ఆలోచించి సాగునీరు ఒక్కటే అందిస్తే సరిపోదని, రైతుకు పెట్టుబడి సాయం కూడా అందించినప్పుడే సాగు సుసాధ్య మవుతుందని ఆలోచించాను. రైతు సంక్షేమం దిశగా ఎవరూ కలలో కూడా ఊహించని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్రం ఆవిర్భవించిన వెనువెంటనే రైతును తక్షణం ఆదుకోవాలి, వారిలో భరోసా నింపాలి, వ్యవసాయం దండగకాదు పండగని నిరూపించాలనే పట్టుదలతో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి, లక్ష్య సాధనలో సఫలీకృతమైంది.
రైతుకు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని 2018లోనే ప్రారంభించుకున్నం. ఈ పథకం ప్రవేశపెట్టి ఇప్పటికి ఐదేండ్లు పూర్తయింది. ఈ పథకం కింద ఇప్పటివరకూ పది విడతల్లో 65 లక్షల మంది రైతుల ఖాతాలోకి నేరుగా రూ.65 వేల కోట్లకు పైగా నగదు జమచేయడం ఎవరూ ఊహించని చరిత్ర. భూరికార్డులను డిజిటలైజ్ చేయడం వల్ల రైతుల భూముల వివరాలపై వచ్చిన స్పష్టత ఆధారంగా రైతుబంధు నగదును ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపించగలుగుతున్నది. దేశంలో ఏ రాష్ట్రమూ రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందించలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ పథకం వ్యవసాయం దిశను, రైతు దశను మార్చివేసింది.
ఇప్పుడు పంట పెట్టుబడి కోసం రైతు ఎదురుచూడాల్సిన పనిలేదు. తల తాకట్టుపెట్టి అధికవడ్డీల అప్పుకోసం చెయ్యిచాచాల్సిన అవసరం లేదు. పంటలు వేసే తరుణంలోనే ఎకరానికి రూ.10 వేల వంతున రెండు విడతలలో క్రమం తప్పకుండా రైతు బంధు సాయం అందివస్తున్నది. కరోనా కష్టకాలంలో కూడా రైతు సోదరులకు పెట్టుబడి నిధులను సమకూర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. రైతుబంధు పథకం కేంద్ర పాలకుల కళ్ళను సైతం తెరిపించింది. వాళ్లు కూడా మన రైతుబంధు పథకాన్ని అనుసరించక తప్పలేదు. ఈ పథకం దేశ వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
రైతుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల క్షేమాన్ని కూడా చూడాల్సిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తలకెత్తుకున్నది. విధివశాత్తూ ఒక రైతన్న తనువు చాలిస్తే, ఆ రైతు కుటుంబం పరిస్థితి ఏమిటి ? అప్పటివరకూ అన్నదాతగా ఉన్న ఆ కుటుంబం అన్నమో రామచంద్రా అని వీధిపాలు కావల్సిందేనా ? ఈ దిశలో గత ప్రభుత్వాలేవీ ఆలోచించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది. ఏ కారణంచేతనైనా సరే రైతు మరణిస్తే, ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టింది. రైతు మరణించిన పది రోజుల్లోపే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు బీమా పరిహారం అందిస్తున్నది. అరగుంట భూమి ఉన్న రైతుకూడా ఈ బీమాకు అర్హుడేనని ప్రభుత్వం విస్పష్టంగా నిర్దేశించింది. బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని వందశాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అప్పటి ప్రభుత్వాలు నామమాత్రంగా, కంటి తుడుపుగా కొద్దిపాటి పరిహారం చెల్లించేవి. దానికోసం రైతు కుటుంబాలు దరఖాస్తులు చేతపట్టుకొని, కాలికి బలపం కట్టుకొని నాయకుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ కన్నీళ్లు పెట్టుకుంటూ తిరగాల్సి వచ్చేది. ఇంటి దిక్కును కోల్పోయిన బాధకు తోడుగా ఈ ప్రయాస మరింత దుఃఖాన్ని కలిగించేది. రైతుబీమా పథకం ఇప్పుడా దురవస్థ నుంచి రైతు కుటుంబాలను పూర్తిగా బయట పడేసింది.
ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ప్రభుత్వమే రైతు ముంగిటికీ వెళ్లి మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తున్నది. ఈ విధంగా ఇప్పటివరకు కోటి 21 లక్షల కోట్ల విలువైన 6కోట్ల 76లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్రం నిరాకరించినా, తెలంగాణ ప్రభుత్వమే పండిన పంటనంతా మద్దతు ధరతో కొని, సకాలంలో రైతుకు ధాన్యం అమ్మిన సొమ్మును అందజేయడంతో తెలంగాణ రైతు నిబ్బరంగా, నిశ్చింతగా ఉన్నాడు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు కొన్ని జిల్లాలో రైతులు పంటలు నష్టపోయారు. ముఖ్యంగా వరి, మామిడి, మొక్కజొన్న వంటి పంటలకు బాగా నష్టం వాటిల్లింది. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో నేను స్వయంగా పర్యటించి, రైతుల భుజం తట్టి ధైర్యం చెప్పాను. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మాట్లాడుతూ ‘ఒక పంట పోయినా పర్వాలేదు. ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలతో మరోపంట పండించుకుంటాం’ అని ధీమా వ్యక్తం చేయటం నాకు గొప్ప సంతోషాన్ని కలిగించింది. దశాబ్దకాలంలో ప్రభుత్వం రైతులలో కల్పించిన ఆత్మ నిబ్బరానికి వారి మాటలు నిదర్శనంగా నిలిచాయి. కేంద్ర బృందాలు పర్యటనలు, నివేదికల పేరిట కాలహరణం చేసి ఇచ్చే అరకొర సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఎకరానికి రూ.10 వేల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. రైతు సంక్షేమమే పరమావధిగా భావించే ప్రభుత్వం కనుక ఆపత్కాలంలో రైతుకు కొండంత అండగా నిలిచింది.
రాష్ట్రంలో 2013-14లో కోటి ఎకరాలలో పంటలు సాగయితే, 2022-23 నాటికి సాగు విస్తీర్ణం 2కోట్ల 20లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో ఒకప్పుడు 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు దేశంలో మొదటి స్థానానికి పోటీ పడుతున్నది. 2014-15లో వరి పంట 34లక్షల 97వేల ఎకరాలలో మాత్రమే సాగుకాగా, 2022-23 నాటికి కోటి 21లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే, 247 శాతం పెరిగింది. 2014-15 లో పత్తిపంట 41 లక్షల 83 వేల ఎకరాలలో సాగుకాగా, 2022-23 లో 50 లక్షల ఎకరాలలో సాగయింది. అంటే 20 శాతం పెరిగింది.
ఇక పంటల దిగుబడి విషయానికి వస్తే.. వరి ధాన్యం 2014-15 లో రాష్ట్రంలో వచ్చిన దిగుబడి 68 లక్షల టన్నులు కాగా, 2022-23లో దాదాపు 3 కోట్ల టన్నులకు పైబడిన దిగుబడిని తెలంగాణ సాధించింది. అంటే, 341 శాతం పెరిగింది. అలాగే, పత్తి దిగుబడి 66 శాతం పెరిగింది.
పామాయిల్ పంటకు తెలంగాణ భూములు ఎంతో అనువైనవిగా ప్రభుత్వం గుర్తించింది. లక్ష కోట్ల రూపాయల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకం. రైతులకు ప్రయోజనం కల్గించేందుకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 32 వేల ఎకరాలలో మాత్రమే ఆయిల్ పామ్ పంట సాగయ్యేది. నేడు లక్షా 5వేల ఎకరాల్లో సాగవుతున్నది. ఈ పంట సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నది.
దేశంలో ఏ ప్రభుత్వమూ రైతులు చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరమని ఆలోచించలేదు. రైతన్నల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్‌కు ఒకటి చొప్పున మొత్తం 2,601 రైతువేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికలు తెలంగాణ వ్యవసాయ ప్రగతి దీపికలై రైతన్నలకు మార్గదర్శనం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం అవతరణకు 10 సంవత్సరాల ముందువరకూ వ్యవసాయరంగ యాంత్రీకరణకు కేవలం రూ.490 కోట్లు మాత్రమే ఆ నాటి ప్రభుత్వాలు ఖర్చుచేస్తే.. మనం స్వరాష్ట్రంలో గత తొమ్మిదేండ్లలో వ్యవసాయ యంత్రాలకోసం 6లక్షల 70వేల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తూ రూ.963 కోట్లు ఖర్చుచేసుకున్నాం. 2022-23 సంవత్సరంలో వ్యవసాయరంగ యాంత్రీకరణ కోసం రూ.500 కోట్లు కేటాయించుకున్నాం. దశాబ్దకాలం ముంగిట నిలిచి చూస్తే నేడు తెలంగాణ సేద్యం సిరులు కురిపిస్తున్నది. తెలంగాణ రైతు రాజ్యమై విలసిల్లుతున్నది.’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.