e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News వదిలేస్తే దేశానికి మత పిచ్చి తెస్తరు

వదిలేస్తే దేశానికి మత పిచ్చి తెస్తరు

  • దేశాన్ని రావణ కాష్టంగా మారుస్తరు
  • రాష్ట్రంలో సామరస్యాన్ని చెడగొడుతరు
  • తెలంగాణ మేధావులు ఆలోచించాలి
  • ఆర్థికంగా దేశంలోనే తెలంగాణ నంబర్‌ 1
  • ఐదెకరాలున్న రైతు ఈ రోజు కోటీశ్వరుడు
  • కండ్ల మంటతోనే సమస్యను సృష్టించిన్రు
  • ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలను హీనంగా చూస్తరు

హైదరాబాద్‌, నవంబరు 29 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ వాళ్లను ఇలాగే వదిలేస్తే దేశానికి మతపిచ్చి లేపి.. విభజన రాజకీయాలు తెస్తారని, దేశాన్ని రావణ కాష్టంలా మారుస్తారని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. దేశంలో పేదరికాన్ని పెంచడం, 750 మంది రైతులను పొట్టన పెట్టుకోవడమే వీళ్లు దేశానికి చేసిన పని అన్నారు. సోమవారం క్యాబినెట్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ వైఖరిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

దేశాన్ని నాశనం చేస్తున్నారు
ప్రపంచంలో అనేక దేశాల, అనేక సమాజాల, అనేక మతాల ప్రజలు ఇండియాలో కలిసి బతుకుతున్నారని, బీజేపీ పాలకులు ఆ సామరస్యాన్ని పూర్తిగా చెడగొడుతున్నారని కేసీఆర్‌ విమర్శించారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ అద్భుతమైన ఐటీ ఇండస్ట్రీ వస్తా ఉన్నది. తెలంగాణ ఆర్థికంగా పటిష్ఠపడుతున్నది. దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్నదని ఇండియాటుడే సర్వేలో వెల్లడైంది. ఇది తెలంగాణ సోషల్‌ ఎకో. మంచిగా, శాంతియుతంగా, బ్యాలెన్స్‌ ఉంటే ఇది సాధ్యం అవుతది. రేపు పొద్దున మతాల మధ్య పంచాయతీ పెట్టి, మత కల్లోలాలు, కర్ఫ్యూలు, లాఠీచార్జీలు, ఫైరింగ్‌లు పెడితే ఉంటదా ఈ పరిస్థితి’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

- Advertisement -

వీళ్లను నమ్మితే అంతే..
తెలంగాణలోని సామరస్య వాతావరణాన్ని, ఆర్థిక వ్యవస్థను తమ రాజకీయాలకోసం ధ్వంసం చేయడాన్ని అంగీకరించడానికి ఇక్కడ ఉన్నామా? ఇదా ఈ దేశానికి కావాల్సింది? అని తెలంగాణ మేధో సమాజం ఆలోచించాలని కోరారు. ‘వి నీడ్‌ ఫైట్‌ టూ ఎనీ ఎక్స్‌టెంట్‌. 100 పర్సెంట్‌. దేశాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. వీళ్లను నమ్మితే సర్వనాశనం అయిపోతాం’ అంటూ హెచ్చరించారు.

పీడీ యాక్ట్‌ తెచ్చిన ఏకైక రాష్ట్రం
పెట్టుబడి పెట్టి, కష్టం చేసి పంట పండిస్తే కేంద్రం కొనుగోలు చేయకుంటే రైతుల పరిస్థితి ఏమిటని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగిలో కూడా రైతుబంధు ఇస్తామని, రైతులు బేఫికర్‌గా ఉండాలని చెప్పారు. రైతులకు కరెంటు, నీళ్లు, పెట్టుబడి, మంచి విత్తనాలు అందిస్తున్నామని, ఇండియా మొత్తంలో నకిలీ విత్తనాల మీద పీడీ యాక్ట్‌ తీసుకవచ్చినది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని గుర్తుచేశారు. ఈ సీజన్‌లో కూడా 70-80 మందిని నకిలీ విత్తనాలు అమ్మినందుకు పీడీ యాక్ట్‌ పెట్టి అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. పీడీ యాక్ట్‌ బిల్లును ఆమోదించడానికి కేంద్రం ఏడు నెలలు తాత్సారం చేసిందని విమర్శించారు.

మీ కంటే కోటి రెట్లు మెరుగు..
బీజేపీ పాలించిన రాష్ర్టాల కంటే తెలంగాణ ప్రతి రంగంలో కోటి రెట్లు మంచిగ ఉన్నదని కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ అత్యధికంగా ధాన్యం పండిస్తుంది కాబట్టి.. బీజేపీకి కండ్లు మండి ఈ సమస్య వచ్చిందన్నారు. తెలంగాణలో ధాన్యాన్ని కొంటామని కేందంతో చెప్పించే దమ్ము ఇక్కడి బీజేపీ నాయకులకు లేదని విమర్శించారు. ఢిల్లీలో మన రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలను హీనాతిహీనంగా చూస్తారని, కనీసం దేకరని చెప్పారు.

వృత్తి పనికి లాభం చేసినం
ఇవాళ రాష్ట్రంలో మత్స్య కార్మికులు అద్భుతంగా చేపలు పెంచి బాగుపడుతున్నారని కేసీఆర్‌ చెప్పారు. గొర్రెల పెంపకందారుల్లో తెలంగాణ నంబర్‌-1గా ఉన్నదన్నారు. మంచినీటి చేపల్లో తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రే పార్లమెంట్‌లో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. గొర్రెల పెంపకంలో అంతకుముందు రాజస్థాన్‌ నంబర్‌ వన్‌గా ఉంటే.. ఈ రోజు తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉన్నదని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమంత్రే చెప్పారని పేర్కొన్నారు. ఇదంతా ప్రగతి కాదా? అని ప్రశ్నించారు.

ఐదెకరాలున్న రైతు ఇవాళ కోటీశ్వరుడు
రాష్ట్రం వచ్చాక తాము ఎంత పనిచేశామో ఇవాళ రైతులకు తెలుసని కేసీఆర్‌ అన్నారు. ‘ఏడేండ్ల కింద తెలంగాణ పల్లెల్లో ఎంత డబ్బు ఉండె, ఇవాళ ఎంత డబ్బు ఉన్నది? ఇవన్నీ నిజాలు కాదా?’ అని ప్రశ్నించారు. ‘చాలామంది దుర్మార్గులు, బుట్టాచోర్‌ గాళ్లు.. తెలంగాణ రాష్ట్రమైతే భూముల ధరలు పడిపోతయ్‌ అని మాట్లాడిండ్లు. పడిపోయినయా.. పెరిగినయా? రూ.20 లక్షల లోపల ఎక్కడన్న భూమి దొరుకుతుందా? ఐదెకరాలు ఉన్న తెలంగాణ రైతు ఇవాళ కోటీశ్వరుడు’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణలో ఎక్కడికి పోయినా రూ.20 లక్షల లోపల ఎకరం జాగా లేదన్నారు. రోడ్డు పక్కన ఉంటే రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షలు, రాజీవ్‌ రహదారులు, రాష్ట్ర లేదా నేషనల్‌ హైవే పక్కన ఉంటే రూ.3 కోట్లు, రూ.4 కోట్లు, రూ.5కోట్లు ఉన్నది’ అని తెలిపారు.

ఇక్కడ అమ్మి.. ఆంధ్రాలో కొంటున్నరు
ఆనాడు ఆంధ్రలో ఎకరం అమ్మి ఇక్కడ మూడు ఎకరాలు కొన్నారని, ఇవాళ మన రైతులు ఎకరం అమ్మి ప్రకాశం జిల్లాకు పోయి నాలుగైదు ఎకరాలు కొంటున్నారని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ భూముల ధరలు పెరిగి రైతులు కోటీశ్వరులు అయ్యారన్నారు. తెలంగాణ పల్లెలో ఇవాళ కోటాను కోట్లు ఉంటున్నాయని చెప్పారు. ‘మీరు కొన్న పంట డబ్బులు, మీరు వేసిన రైతు బంధు డబ్బులు వచ్చినయ్‌. రెండు కలిపితే మా ఊరు బ్యాంకులో రూ.6 కోట్లు ఉన్నయ్‌’ అని ఒక ఫ్రెండ్‌ తనతో చెప్పారని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement