మోదీపై తెలంగాణ రణభేరి మోగించింది. రాష్ట్రంపై అంతులేని విద్వేషం ప్రకటిస్తున్న.. అనంతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నరేంద్రమోదీ సర్కారుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించారు. ఢిల్లీ కోటను బద్దలు కొడతామని..మోదీని దేశం నుంచి తరిమేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు పులిబిడ్డలని గుర్తుచేశారు. తాము యుద్ధం చేయడానికి అలవాటుపడ్డవాళ్లమని.. రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం తెలంగాణ సమాజం ముందువరుసలో నిలబడి కలబడుతుందని తేల్చిచెప్పారు. జాతీయ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించడానికి సంసిద్ధంగా ఉన్నామని విస్పష్టంచేశారు. రాష్ట్రంలో అశాంతి, అలజడులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని నశంలా నలిపేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. శుక్రవారం జనగామ జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అత్యంత కటువైన పదజాలంతో తీవ్రంగా ప్రతిస్పందించారు. దేశం నుంచి మోదీని తరిమేస్తమని గర్జించారు. కేంద్రం సహకరించకపోయినా కడుపుకట్టుకొని తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రణగర్జనచేశారు. తెలంగాణ అంటే ఆషామాషీ కాదని, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ఢిల్లీ కోటలు బద్దలుకొట్టి తీరుతామని అశేష జనవాహిని సాక్షిగా ప్రతినబూనారు. మోదీని దేశం నుంచి తరిమేసి రాష్ర్టాలకు అన్నీ ఇచ్చేటోళ్లను తీసుకొచ్చుకొంటామని తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో దేశ రాజకీయాల్లో సత్తా చాటుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భీకర పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. రైతుల మోటర్లకు మీటర్ పెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. శుక్రవారం జనగామలో సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీపై సమరభేరి మోగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఢిల్లీ కోట బద్దలు కొడతా
మీకు ఒక్కటే మాట మనవి చేస్తున్నా.. మీరిచ్చిన బలం, శక్తితోనే ఇంతదూరం వచ్చినం. రాష్ట్రం సాధించుకొన్నం. అద్భుతమైన పంటలు పండించుకొంటున్నం. దేశంలో అనేక సీనియర్ రాష్ర్టాలకన్నా ముందు వరుసలో ఉన్నం. అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషించాల్సి వస్తే.. తప్పకుండా ఈ దేశం కోసం మనం పోరాటం చేయ్యాలె. దేశం కోసం కూడా కొట్లాడుదామా? జాతీయ రాజకీయాల్లో పాత్ర వహిద్దామా? కచ్చితంగా, కడదాకా పోరాడుదాం. సిద్దిపేటవాళ్లు నన్ను పంపిస్తే తెలంగాణ కోసం పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకొన్నం. ఇయ్యాల మీరందరూ దీవిస్తే, పోరాటానికి రెడీగా ఉన్నం. మీరు బయల్దేరమంటే ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్న.
రైతుల ఎంబడి పడ్డ మోదీ
ప్రధాని నరేంద్రమోదీ రైతులు ఎంబడి పడ్డడు. పేదల ఎంబడి పడ్డడు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి బ్యాంకులను ముంచినోళ్లకేమో విమానం టికెట్లు కొనిచ్చి లండన్‌కు పంపిస్తరు. వాళ్లు అక్కడ పిక్నిక్లు చేస్తున్నరు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు ఎవరి పుణ్యాన పోయిండ్రు దేశం నుంచి? రైతుల ఆదాయం డబుల్ చేస్తమని చెప్పి ఇప్పుడు పెట్టుబడి డబుల్ చేసిండ్రు. మనం రైతుబంధు ఎందుకిస్తున్నం? పిచ్చిలేసి ఇస్తున్నమా? గ్రామాలు సల్లపడి.. రైతు పంట పండిస్తే ఒక్క రైతే బతుకుతడా? సమాజమంతా బతుకుతది. ఇంకోదిక్కున కనిపించకుండా కిందికెల్లి డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిండు. ఎనకటికి ఎలిగడి (మెట్ట) రూ.800 లకు దున్నేది. ఇయ్యాల రూ.1,600 అయ్యింది. బురద దున్నుకం రెండున్నర మూడు వేల రూపాయలుంటే ఇయ్యాల రూ.6 వేలు అయ్యింది. అడ్డగోలు డీజిల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి, ఎరువుల ధరలు పెంచి.. రైతుల పెట్టుబడి డబుల్ చేసిండ్రు. ఇవన్నీ పోను ఇయ్యాల కరెంటు మీటర్లు పెట్టాలని అంటుండు.
నిన్ను తరిమేస్తం..
ఇచ్చేటోళ్లను తెచ్చుకుంటం రాష్ర్టానికి చెందిన ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితే ఇయ్యమంటుండ్రు. కాజీపేటలో రైల్వే జంక్షన్ పెట్టు అంటే.. పెట్టనంటుండ్రు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని కోరితే.. ఇయ్యమంటుండ్రు. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యవయ్యా అంటే.. ఇయ్యమంటుండ్రు. నువ్వు ఏది ఇయ్యకున్నా మంచిదే.. రేపు చూసుకుంటం. ఈ దేశం నుంచి నిన్ను తరిమేస్తం.. మాకు ఇచ్చేటోన్ని తీసుకొస్తం. అంత మాత్రం తెలివి మాకున్నది.
నశం చేస్తం జాగ్రత్త
జాగ్రత్త నరేంద్రమోదీ.. ఇది తెలంగాణ.. ఇది పులి బిడ్డ. మీ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు బయపడేవాడెవడూ లేడిక్కడ. నిన్న పేపర్లలో చూసిన.. నర్మెట కాడ, జనగామ టౌన్లో ఎవడో పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిండు అని వచ్చింది. బిడ్డా.. బీజేపీ బిడ్డల్లారా.. మేం మంచివాళ్లం.. మిమ్మల్ని ఏమీ అనము. కానీ మమ్మల్ని ముట్టుకుంటే.. నశంనశం చేస్తం జాగ్రత్త. మా శక్తి ముందు, మా బలం ముందు.. మేం ఉఫ్ అంటే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతరు జాగ్రత్త. టీఆర్ఎస్ యుద్ధం చేసి గెలిచిన పార్టీ, పోరాటం చేసిన పార్టీ.. రాష్ట్ర సాధన కోసం ఎంత దూరమైనా పోయి కొట్లాడిన పార్టీ.. మీ ఉడుత బెదిరింపులకు ఈడ బయపడేవాడెవడూ లేడు జాగ్రత్త. మంచి మాటతో చెప్తున్నాం. మీ జాగ్రత్తలో మీరు ఉండండి, మా జాగ్రత్తలో మేం ఉంటం అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
చంద్రబాబు గట్లే అన్నడు.. పోయిండు
ఎన్కట చంద్రబాబు నాయుడు కూడా ఇట్లనే బాయికొక మీటర్ పెట్టాలన్నడు. ఇగ బాయికెందుకు.. తెలంగాణలో మనిషికో మీటర్ పెట్టు.. అందరం కలిసి నీకు మీటర్ పెడుతం.. పీడ పోతదని చెప్పిన. ఇయ్యాల వాళ్లు పోయిండ్రు.. మనం మంచిగున్నం. ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణల పేరిట మీటర్లు పెట్టాలె అంటున్నది. పెట్టం అని నేనన్నా. ‘మీరు పండించే ధాన్యం కొనం.. కరెంటు మీటర్ మాత్రం పెట్టాలె.. పెట్టకపోతే మీకొచ్చేటివి బంద్చేస్తం.. దాడులు చేస్తం.. ఇష్టమొచ్చినట్టు తిడుతం.. వాట్సాప్‌లో తప్పుడు ప్రచారాలు చేస్తం’ అని బెదిరిస్తరు. ఇదే బీజేపీ పని. ఇదేనా దందా? దీనికోసమేనా తెలంగాణ తెచ్చుకొన్నది? నేను ఒక్కటే మాట చెప్తున్న.. అనేక సంవత్సరాలు బాధపడ్డ తర్వాత మర్లవడ్డం.. మర్లవడితేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే ఎట్లా చేసుకొందామని అనుకున్నమో, దాని ప్రకారమే ఒకటొకటి చేసుకొని దారికొస్తున్నం.
పేద పిల్ల పెండ్లికి ఇంత సాయం చేసుకొంటున్నం. ముసలి వాళ్లకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఎంతోకొంత ఇచ్చి ఆదుకొంటున్నాం. పేద బిడ్డలు కడుపునిండా తినాలని బియ్యాన్ని నాలుగు కిలోల నుంచి ఆరు కిలోలకు పెంచుకొన్నం. గతంలో కుటుంబంలో నలుగురికే ఇచ్చేవారు.. ఇప్పుడు ఎంతమందికైనా ఇస్తున్నం. ఇవన్నీ ఎందుకిస్తున్నం? గ్రామీణ ప్రాంతం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావాలె. యాదవ సోదరులు గొర్రెలను పెంచాలె. చేపలు పట్టేవాళ్లు చేపలు పట్టాలే.. వాళ్ల వృత్తి పెద్దగ కావాలె. దళిత సోదరులు కూడా అందరితోపాటు బాగుపడాలె. రైతులోకం అంతా సల్లగ ఉండాలె.. అట్లా ఓ ప్లాన్ వేసుకొని, ఓ దారి పట్టుకొని పోతున్నం.
సచ్చినా.. కరెంటు మీటర్లు పెట్టం
కేంద్రం కరెంటు సంస్కరణలు తెస్తున్నది. పేరుకేమో కరెంటు సంస్కరణ అని అందమైన భాష. కానీ దాంట్లో మతలబు ఏందీ? కచ్చితంగా ప్రతి మోటర్‌కు మీటర్ పెట్టాలె. పెడతవా.. పెట్టవా? అని బెదిరించిండ్రు. నన్ను చంపినా సరే పెట్టనంటే పెట్టనని చెప్పిన. నరేంద్రమోదీ.. మా ప్రాణం పోయినా సరే తెలంగాణలో కరెంటు మీటర్లు పెట్టం. నువ్వు ఏం చేసినా మంచిదే. తిరగబడుతం, కొట్లాడుతం. అవసరమైతే ఢిల్లీ దాకా వస్తం. కానీ కరెంటు మీటర్లు మాత్రం పెట్టం. నువ్వు ఏం చేసుకొంటవో చేసుకో పో. నీ సంస్కరణలు మేం అమలు చెయ్యం. కరెంటు కోసం మేం నిన్ను పైసలు అడిగినమా? కరెంటు మీటర్లపై తెలంగాణ మొత్తం అప్రమత్తం కావాలె. ఈ కొట్లాట నాకేదో గులగుల పెట్టి కాదు.. నాకు పనిలేక కాదు. ఎనిమిదేండ్లయ్యింది.. కేంద్రంతోని మనం పంచాయితీ పెట్టుకున్నమా? మన బతుకు మనం బతికినం. వాళ్లేం చేయకున్నా.. పైసా ఇయ్యకున్నా ఉన్నంతలో మనమే పూర్తి అవినీతి రహితంగా, కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, అందరం కష్టపడి పనిచేసి, ఒక దరికి వచ్చినం. ఒక పద్ధతిగా పోతున్నం. కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం కరెంటు సంస్కరణల పేరుతో రెండేండ్ల నుంచి పంచాయితీ పెట్టుకొంటున్నది.
నన్ను చంపినా సరే పెట్టనంటే పెట్టనని చెప్పిన. నరేంద్రమోదీ.. మా ప్రాణం పోయినా సరే తెలంగాణలో కరెంటు మీటర్లు పెట్టం. నువ్వు ఏం చేసినా మంచిదే. తిరగబడుతం, కొట్లాడుతం. అవసరమైతే ఢిల్లీ దాకా వస్తం. కానీ కరెంటు మీటర్లు మాత్రం పెట్టం. నువ్వు ఏం చేసుకొంటవో చేసుకో పో. నీ సంస్కరణలు మేం అమలు చెయ్యం.
-ముఖ్యమంత్రి కేసీఆర్