మద్దతు ధర వడ్ల కే తప్ప బియ్యానికి కాదు మా రైతుల వడ్లన్నీ కొనండి.. పైసలివ్వండిఆ వడ్లను ముడి బియ్యం చేసుకుంటారా.. ఉప్పుడు బియ్యం చేసుకుంటారా.. మీ ఇష్టం! ధాన్యం కొనకుంటే ఊరుకునే ప్రసక్తే లేదుపంజాబ్ విధానమే మాకూ అమలు కావాలి నేడు కేంద్రమంత్రితో మంత్రులు, ఎంపీల భేటీ స్పందించకుంటే మరో తెలంగాణ ఉద్యమమే పంచాయతీలు, మండలాల్లో తీర్మానాలు చేస్తం కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ యాసంగి అంటే వానకాలమంటూ.. వానకాలమంటే ధాన్యమంటూ.. ధాన్యమంటే లెవీ అంటూ.. లెవీ అంటే బాయిల్డ్ అంటూ.. బాయిల్డ్ అంటే రా రైస్ అంటూ తలా తోకా లేకుండా కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు దీటైన జవాబిచ్చారు. ‘కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తున్నది ధాన్యానికి. ధాన్యం అంటే వడ్లు. బియ్యం కాదు. మీరు కొనాల్సింది తెలంగాణలో పండిన వడ్లు. మీరు డబ్బులివ్వాల్సింది వడ్లకు. మీరు కొనుక్కున్న తర్వాత ఆ వడ్లను బాయిల్డ్ రైస్ అంటే ఉప్పుడు బియ్యం చేసుకుంటారో. లేక రా రైస్ అంటే ముడి బియ్యం చేసుకుంటారో మీ ఇష్టం.. మీకు నచ్చింది చేసుకోండి’అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మరి ఇప్పటికైనా కేంద్రానికి వడ్లకు, బియ్యానికి తేడా తెలిసేనా?
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని పంజాబ్ తరహాలోనే కేంద్రం సేకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డిమాండ్‌చేశారు. ఏక్‌భారత్-శ్రేష్ఠ్ భారత్, వన్ నేషన్-వన్ రేషన్ అంటూ రోజూ నినాదాలిచ్చే కేంద్ర పాలకులు.. వన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని ఎందుకు తీసుకొని రావడం లేదని ప్రశ్నించారు. పంజాబ్‌కు ఒక నీతి, గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి ఉంటే ఎలా? అని నిలదీశారు. దేశమంతా యూనిఫాం ఫుడ్‌గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ తేవాలని అనేక రాష్ర్టాలు కోరుతున్నాయని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పంజాబ్ రైతులను అన్ని కేంద్ర ప్రభుత్వాలు ఏడిపించాయని, అక్కడి రైతులు ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో పూర్తిగా ధాన్యాన్ని కొంటున్నారని చెప్పారు. మంగళవారం మంత్రులు, పార్లమెంట్ సభ్యుల బృందం ఢిల్లీలో కేంద్ర ఆహార మంత్రిని కలిసి తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తారని తెలిపారు. ‘తెలంగాణలో కూడా పంజాబ్ తరహాలో ఆర్డర్ ఇచ్చేవరకూ పోరాడుతం. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. హంబుల్‌గా విజ్ఞప్తి చేస్తున్నం. లేదంటే కేంద్రం ఖర్మ’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
వరి సాగును తగ్గించాం
తెలంగాణలో వరిసాగును 55 లక్షల ఎకరాల నుంచి 35 లక్షల ఎకరాలకు తగ్గించామని కేసీఆర్ తెలిపారు. ఇందులో మూడు లక్షల ఎకరాల్లో రైతులు విత్తనోత్పత్తి చేస్తారని, మరో 2.50 లక్షల ఎకరాల్లో పంటను తిండికి, ఇతర అవసరాలకు ఉపయోగిస్తారన్నారు. 30 లక్షల ఎకరాల్లో పండిన వరి ధాన్యాన్ని మాత్రమే అమ్మాల్సి ఉంటుందని చెప్పారు. ఈ యాసంగిలో పంటమార్పిడి ద్వారా సుమారు 20 నుంచి 25 లక్షల ఎకరాల వరి సాగును తగ్గించామని వెల్లడించారు. ఇతర పంటలు పండించే అవకాశంలేని భూముల్లో మాత్రమే వరి పండిస్తున్నామన్నారు.
ఆహార భద్రత బాధ్యత కేంద్రానిదే
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ఫుడ్ సెక్యూరిటీ విషయంలో స్వావలంబన ఉండాలని కోరుకుంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే పెద్ద జనాభా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇబ్బందులు ఏర్పడితే అహార కొరత రాకూడదనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చిందన్నారు. భారత రాజ్యాంగం ఈ చట్టం ద్వారా ఆ బాధ్యతను కేంద్రంపై పెట్టిందని, ఈ పద్ధతిలోనే కేంద్రం ధాన్యాన్ని సేకరిస్తున్నదని తెలిపారు. ‘కనీసం రెండుమూడేండ్ల పాటు బఫర్ స్టాక్ నిర్వహించడం కేంద్రం కర్తవ్యం. అది పవిత్రమైన బాధ్యత. మీ దగ్గర ఎఫ్‌సీఐ ఉన్నది. గోదాములున్నయి. నిర్ణయాలు తీసుకొనే అధికారమున్నది. మీరు ఎట్టిపరిస్థితుల్లో రైతులు పండించే ధాన్యం తీసుకోవాలి. కొంత ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేయాలి. చిన్న నష్టం వస్తే భరించాలి. అది మీ బాధ్యత. మేమేమీ పాకిస్థాన్, అమెరికా రైతుల కోసం అడగటం లేదు కదా! భారతదేశంలో ఉన్న రైతాంగం కోసమే అడుగుతున్నాం’ అని సీఎం చెప్పారు. ఎక్కువ పంట వస్తే రూ.5, 10 వేల కోట్ల నష్టం వచ్చినా భరించి ధాన్యాన్ని తీసుకొని ప్రాసెస్ చేయాలని.. ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోజాలదని చెప్పారు. కరోనాలాంటి జబ్బు వస్తదని అనుకోలేదని, మొట్టమొదటిసారి కరోనా లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని అన్నారు. భవిష్యత్తులో ఏదైనా కరువు వస్తే దేశానికి ఒక వారంపాటు అన్నం పెట్టే శక్తి ప్రపంచంలో ఏ దేశానికీ లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ప్రపంచంలో 10 లక్షల నుంచి 10 కోట్ల లోపు జనాభా ఉన్న దేశాలే 179 ఉన్నాయని.. వందల కోట్ల జనాభా ఉన్న ఇండియాకు అన్నం పెట్టే పరిస్థితి ఏ దేశానికి లేదన్నారు.
కాలికి పెడితే మెడకు.. మెడకు పెడితే కాలుకు
ధాన్యం కొనుగోలు అన్నది రైతుల జీవన్మరణ సమస్య అని సీఎం కేసీఆర్ తెలిపారు. పంటలు పండించడం వరకే రైతుల బాధ్యతని, దాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. అంతేకానీ.. కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు పెట్టి తప్పించుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. గతంలో పంజాబ్‌లో అనేక ఉద్యమాలు చేశారని.. చరణ్‌సింగ్, దేవీలాల్, సుర్జీత్‌సింగ్ బర్నాలా, కర్ణాటక నుంచి ప్రొఫెసర్ నంజుండస్వామి, స్వామినాథన్ తదితరులు ఉద్యమిస్తేనే పంజాబ్, హర్యానాల నుంచి వందశాతం ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నదని తెలిపారు. అక్కడ రెండు పంటలు పండిస్తున్నారని, ఎన్ని వడ్లు, ఎన్ని గోధుమలు పండినా వందశాతం తీసుకొంటున్నారని తెలిపారు.
కేంద్రం సహాయం లేకపోయినా..
‘కొత్త రాష్ట్రం ఏర్పడింది. కేంద్రం సహాయం చేయలేదు. అయినా సాగునీటి ప్రాజెక్టులు కట్టుకొన్నం. నీళ్లు తెచ్చుకొన్నం. భూగర్భ జలాలు పెంచుకొన్నం. 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి, సెస్ లేకుండా వాటర్ ఇచ్చి, మంచి ఉత్పత్తులు సాధిస్తున్నం. రైతుల ముఖాల్లో వెలుగులు నింపినం. ఆత్మహత్యలు, వలసలు తగ్గిపోయినయ్. తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది. ఈ ప్రశాంతతకు కేంద్రం అడ్డంకిగా మారింది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం లేనిపోని ఇబ్బందులు పెడుతున్నది. మీరు(కేంద్ర ప్రభుత్వం) ఎమ్మెస్పీ నిర్ణయించింది బియ్యానికి కాదు కదా.. ధాన్యానికి కదా..! అందుకే ఎమ్మెస్పీకే ధాన్యం తీసుకొని డబ్బులు ఇవ్వండి అంతే. ఆ తర్వాత ధాన్యాన్ని బాయిల్ రైస్ చేసుకుంటరో, రా రైస్ చేసుకుంటరో, బాగోతం చేసుకుంటరో మీ ఇష్టం. మేమెందుకు మిల్లింగ్ చేయించాలి? మీరే చేయించుకోండి. ఆ ప్రాసెస్ మీది. మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. పంజాబ్‌లో అనుసరించే విధానమే మా దగ్గర కూడా అవలంబించాలని అంటున్నం’ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
బ్యాంకు దొంగలకు లక్షల కోట్లు మాఫీనా?
ఎన్డీయే సర్కార్ వచ్చాక బ్యాంకు రుణ ఎగవేత దొంగలు పెరిగారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. గతంలో ఎక్కడో ఒకటి రెండు ఈ తరహా ఘటనలు ఉండేవని, బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత విపరీతంగా బ్యాంక్ స్కాంలు జరుగుతున్నాయని విమర్శించారు. బ్యాంకు రుణాలను ఎన్పీయే అని పేరుపెట్టి ఎగ్గొట్టే కొత్త ఫ్యాషన్ మొదలైందన్నారు. ‘ఇప్పటికే బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్లవి రూ.11 లక్షల కోట్లు రైటాఫ్ చేశారు. రూ.10 నుంచి రూ.15 వేల కోట్లతో రైతుల ధాన్యం కొనుగోలు చేయాలంటే మాత్రం కాలికిపెడితే మెడకు.. మెడకు పెడితే కాలికి వేస్తున్నారు. పెట్టుబడి పెట్టి.. కష్టపడి చెమటోడ్చి.. ఎన్నో ఆటుపోటులను తట్టుకొని.. పంట పండిస్తే.. ఆ రైతుల పంట కొనడం లేదు.. మొన్న ఎవడో ఒక్కడే దుర్మార్గుడు 22 వేల కోట్లు ఎగవేసిండు. లక్షల కోట్లు ముంచుతున్నరు. వాళ్లకు లక్షల కోట్లు రైట్ఆఫ్ చేసిండ్రు. కానీ, రైతుల ధాన్యం మాత్రం కొనరు’ అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సమ్మతిస్తే సంతోషం.. లేదంటే పోరాటానికి సిద్ధం
ధాన్యమంతా కొనాలని కోరుతూ తెలంగాణ మంత్రులు, ఎంపీలు కేంద్ర ఆహారశాఖ మంత్రిని కలిసి మెమొరాండం ఇస్తారని సీఎం తెలిపారు. కేంద్రమంత్రి సమ్మతిస్తే సంతోషమని, లేదంటే ఎంత పోరాటానికై సిద్ధమేనని చెప్పారు. తమ పోరాటం.. ఆశామాషీగా, పేపర్ స్టేట్మెంటులా ఉండదని యాక్షన్ ఓరియంటెడ్‌గా ఉంటుందని హెచ్చరించారు. పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం స్థాయిలో ఆందోళన ఉంటుందని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనేవరకు విశ్రమించే ప్రశ్నే లేదన్నారు. తెలంగాణలోని యావత్ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, మార్కెట్ కమిటీలు ఇతర సంస్థల్లో తీర్మానంచేసి పంపిస్తామని పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తారని ఆశిస్తున్నామని, లేదంటే వందకు వందశాతం ఉద్యమిస్తామని చెప్పారు.
రైతుకు రాజ్యాంగ రక్షణ కావాలి
దేశంలో ఇప్పటివరకు అందరికీ రాజ్యాంగ రక్షణ ఉన్నది కానీ, దేశానికి అన్నం పెట్టే రైతులకు రాజ్యాంగ రక్షణలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కచ్చితంగా రైతులకు కూడా రాజ్యాంగ రక్షణ రావాలి. రైతుల హక్కులను రాజ్యాంగంలో చేర్చాలి. మా పార్టీ తరఫున మేం దీన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులను రక్షించేందుకు, వారి గౌరవాన్ని పెంచేందుకు, ఆత్మనిర్భరంగా తయారుచేసేందుకు రాజ్యాంగ రక్షణ కావాలి. ఎంఎస్పీ కావొచ్చు. ధాన్యం సేకరణ కావొచ్చు. అంశం ఏదైనా రైతులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉండాలి. కేంద్రం కనుక రైతులను ప్రేమించే ప్రభుత్వమైతే మీరు ముందుకొచ్చి మీ ఇంటిగ్రిటీని నిరూపించుకోవాలని నేను గౌరవ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రాజ్యాంగ సవరణ తీసుకురండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే పార్లమెంట్లో పెట్టండి. మా పార్టీ తరఫున మద్దతు ఇస్తాం. దేశమంతా మద్దతిస్తుంది. హర్షిస్తుంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఒకే తరహా కొనుగోలు విధానం తేవాలి
అన్ని రాష్ర్టాలకు ఒకేవిధంగా ఉండేలా జాతీయస్థాయి ప్రొక్యూర్మెంట్ పాలసీ రూపొందించాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ డిమాండ్‌చేశారు. పాలసీలో మార్పులు తెచ్చేందుకు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, వ్యవసాయశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ‘జాతీయ స్థాయిలో ప్రొక్యూర్మెంట్ పాలసీ రూపొందించాలి. అది అందరికీ సమానంగా ఉండాలి. ఒకటిగా ఉండాలి. అప్పుడే ధర్మం జరిగే అవకాశముంటుంది’ అని సీఎం చెప్పారు. దేశాన్ని పంట కాలనీల కింద విభజించి, ఒక విధానం ప్రకటిస్తే అన్ని రాష్ర్టాలు అదే అనుసరిస్తాయని తెలిపారు. జాతీయస్థాయి ప్రొక్యూర్మెంట్ పాలసీ తేకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. ‘అవసరమైతే మొత్తం రాష్ట్ర క్యాబినెట్ అంతా వెళ్లి ఢిల్లీలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఇక్కడ కూడా ఉద్యమాలు నిర్మిస్తాం. ఈ మధ్య నేను ఢిల్లీకి వెళ్లినప్పుడు కిసాన్ సంఘాల నేతలు నన్ను కలిశారు. తప్పకుండా మేం కూడా ఇందులో భాగస్వాములమవుతామని చెప్పారు. జాతీయస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళతాం’ సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
మోదీజీ.. తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి ప్లీజ్!
నేను తెలంగాణ ప్రజల పక్షాన చేతులెత్తి నమస్కరించి, వినయపూర్వకంగా మరోసారి ప్రధానమంత్రిగారిని సిన్సియర్‌గా డిమాండ్ చేస్తున్నాను.తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి. మేం ఉద్యమవీరులం. తప్పకుండా ఉద్యమం చేస్తాం. మేం వదిలిపెడతాం అనుకోకండి. ఇదేదో మాయా మశ్చీంద్ర చేస్తామనే భ్రమలో ఉండకండి. మీరే భంగపడతారు. – కేసీఆర్
రైతుకు రాజ్యాంగ రక్షణ రావాలె
ప్రధానిని టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.. రైతులకు రాజ్యాంగ పరమైన రక్షణ రావాలి. దాని కోసం అద్భుతమైన రైతు ఉద్యమాలు నిర్మిస్తాం. దాని కోసం రచన అవుతున్నది. రైతులకు రాజ్యాంగ హక్కులు కల్పించే ప్రభుత్వం కావాలి. చట్ట సవరణ తెస్తే మా పార్టీ తరఫున మద్దతిస్తాం – కేసీఆర్