హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): యాసంగిలో రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ వరి వేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. కేంద్రాన్ని నమ్మే పరిస్థితి లేదని, ఎలాగైనా అమ్ముడుపోతుందనే మిషలో వరి వేసి నష్టపోవద్దని సూచించారు. ఆదాయం ఇచ్చే ఇతర పంటలు వేయాలని కోరారు. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం కొంటామని చెప్తే 75 లక్షల ఎకరాల్లో వరి పండిస్తామని నేను సవాల్ విసిరితే బీజేపీ నేతలు తోకముడిచారు. విలేకరులు అడిగినా జవాబు ఇస్తలేరు. ఎవరివి నక్కజిత్తుల మాటలు? ఎవరికి రైతుల మీద ప్రేమ ఉన్నది? అనేది తెలంగాణ రైతు సోదరులు గమనించాలె’ అన్నారు. రైతుల కోసం 2,600 రైతు వేదికలు కట్టామని, అక్కడ రైతుబంధు నేతలు, రైతులు కూర్చొని ఇతర పంటల్లో ఏది వేయాలో ఆలోచించాలని కోరారు. మిల్లర్లు, విత్తన కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు నిరభ్యంతరంగా వరి సాగు చేసుకోవచ్చని, వీరికి ఆటంకం లేదని అన్నారు.
పత్తికి అంతర్జాతీయ డిమాండ్
‘ప్రపంచవ్యాప్తంగా పత్తికి అద్భుతమైన డిమాండ్ ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం వచ్చాక జిన్నింగ్ మిల్లులను 400కు పెంచుకున్నామని, వాళ్లు పోటీపడి పత్తిని కొంటున్నారని తెలిపారు. ‘నిన్న గజ్వేల్‌లో రూ.8,400కు పత్తి కొన్నారు. పప్పుధాన్యాలతో భూమి కూడా సారవంతమైతది. నూనెగింజలు, పామాయిల్, ఇతర పంటలకు మంచి డిమాండ్ ఉంది. ఈ విషయాలన్నీ వ్యవసాయశాఖ వాళ్లు చెప్తున్నారు’ అని సీఎం అన్నారు.
వన్‌టైం పత్తితో కూలీల కొరతకు చెక్
యూరప్, అమెరికా దేశాల్లో ఒకటే సారి తీసే పత్తి వేస్తున్నారని సీఎం చెప్పారు. మన దగ్గర ప్రస్తుతం పత్తి పలు దఫాలుగా ఏరుతుండటంతో కూలీ ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పారు. ‘పత్తి ఏరే సమయంలో కూలీల కొరతకు ప్రత్యామ్నాయమే వన్‌టైం పిక్ చేసే పత్తి. వచ్చే ఏడాది 50 నుంచి 60 వేల ఎకరాల్లో రైతులకు కూడా ఒకటేసారి తీసే పత్తి విత్తనాలు ఇస్తాం’ అని కేసీఆర్ తెలిపారు. పత్తి పంట వేసుకొంటే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటదన్నారు.
యాసంగిలో శనగలు
యాసంగిలో శనగలు వేసుకొంటే బ్రహ్మాండంగా అమ్ముడుపోతాయి, వాటికి మంచి ధర ఉన్నది. 65- 70 రోజుల్లో వచ్చే పెసర పంట వేసుకొంటే దిగుబడితో పాటు చేను బాగవుతుంది. ఈ విషయం రైతులకు కూడా బాగా తెలుసు. దాని తర్వాత వెంటనే నువ్వులు, మినుములు వేసుకొంటే వాటికి బ్రహ్మాండమైన డిమాండ్ ఉన్నది.
వానకాలం వరి సాగు చాలు
మన అవసరాల ప్రకారం వానకాలంలో కోటి టన్నుల వరి పండినా రాష్ర్టానికి వచ్చిన ఇబ్బంది ఏం ఉండదని సీఎం కేసీఆర్ చెప్పారు. యాసంగిలో కూడా వరి వేస్తే ఇదీ, అదీ కలిసి ఎక్కువైపోతదని అన్నారు. ‘యాసంగిలో నూక కూడా వస్తది. అది రైతులకు, మిల్లర్లకు గిట్టుబాటుకాక దెబ్బతింటున్నాం. ఈ ధాన్యాన్ని ఇథనాల్‌కు ఇవ్వొచ్చు. దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు ఎగుమతి చేయవచ్చు. కానీ ఆ శక్తి కేంద్రానికే ఉంటుంది. మనం చేయలేం’ అని వివరించారు. ‘కేంద్రమే కొన్నది, మీరు కొనలేదు అని కొందరు అంటరు. మరి కేంద్రం గడ్డి పీకనీకి ఉంటదా? కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతామని బాధ్యత తీసుకున్నోళ్లు కొనాలి కదా! అదేదో మేం పెద్ద పొడిచేశామని చెప్తే ఎట్ల?’ అని కేసీఆర్ మండిపడ్డారు. ‘ధాన్యం కొనుగోళ్లకు లక్ష కోట్లు కేటాయించినమని ఎవరు చెప్పారు వీళ్లకు? లక్ష కోట్లు కేటాయించినమని ఎక్కడ చెప్పిన? ఆయన (బండి సంజయ్) మాటలు మూర్ఖత్వం, తెలివి తక్కువ’ అని ఎద్దేవా చేశారు.
వ్యవసాయం మాత్రం ఆపొద్దని చెప్పిన
కరోనా సమయంలో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఏ రంగానికైనా ఆపుదాం కానీ.. వ్యవసాయానికి నిధులు ఆపొద్దని చెప్పానని కేసీఆర్ తెలిపారు. అందుకే కరోనా టైంలో ఒక్క గింజలేకుండా కొన్నామని, ఏ ఊరుకు ఆ ఊరిలో 6వేలకు పైచిలుకు కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేశామని చెప్పారు. దాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించామని వివరించారు.
చెరుకుకు డిమాండ్ లేదు
రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు అమ్మేసిందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ బదులిస్తూ.. ‘ఎవరు అమ్మేశారు? చంద్రబాబు అమ్మారు.. దాన్నే రాజశేఖర్‌రెడ్డి కొనసాగించారు’ అని చెప్పారు. ‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నేను, ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న పోచారంవ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులందర్నీ పిలిపించుకొని ఆ ఫ్యాక్టరీని బాగుచేసి ఇస్తామని, సొసైటీలు ఏర్పాటుచేసుకుని నడిపించుకోవాలని చెప్తే.. వాళ్లు.. ప్రభుత్వమే నడపాలని కోరారని గుర్తు చేశారు. ప్రభుత్వమే నడిపితే మళ్ల ధర్నాలు, రాస్తారోకోలు, ప్రతిపక్షాల పిచ్చిపనులు జరుగుతాయని దాని జోలికి పోలేదని వివరించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో చెరుకు పండిస్తున్న రైతులే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారని, ఇప్పుడు షుగర్‌కు రేటు, మార్కెట్, డిమాండ్ లేదని చెప్పారు.
6 హెలికాప్టర్లు పంపిస్తా… వచ్చి చెక్ చేస్కో
రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్టు నిరూపిస్తానని కేసీఆర్ చెప్పారు. ‘6 హెలికాప్టర్లు పెడతా. దమ్ముంటే నువ్వు (బండి సంజయ్‌ను ఉద్దేశించి), నీ కేంద్రమంత్రులు, అధికారులను తీసుకొనిరా’ అని సీఎం సవాల్ విసిరారు. ‘మీరు మోసగాళ్లు. మీరు కొనరు. తప్పించుకోవటానికి మార్గాలు వెతుకుతరు. ఇప్పుడు వచ్చేది కాక రేపు యాసంగిలో కూడా వరి వేయాలని చెప్పిన మొగోనివి కదా నువ్వు. మరెక్కడపాయే?’ అని విరుచుకుపడ్డారు.