హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధం ప్రకటించింది. మోదీ సర్కార్‌ను గద్దె దించేందుకు జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో చేతులు కలుపుతామని వెల్లడించింది. బీజేపీ ప్రభుత్వాన్ని దించేసే దిశగా జరిగే ప్రయత్నాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపింది. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలోనే వివిధ పార్టీల అధినేతలతో కలిసే అవకాశాలున్నాయి. ‘కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం మాకవసరం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్న వివిధ రాజకీయ పార్టీలతో మేము చేతులు కలుపుతాం. ఈ దిశగా వారు చేసే ప్రయత్నాలకు మద్దతునిస్తాం.
ఈ విషయంలో సీఎం కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు’ అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు టీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలే టీఆర్ఎస్కు ముఖ్యమని, రాష్ట్రంలో పండించే వరిని కొనుగోలుచేసే ప్రభుత్వానికే కేంద్రంలో మద్దతు ఇస్తామని చెప్పారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతాంగంతో చెలగాటమాడుతున్న బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుంటే, రాష్ట్రంలో బీజేపీ నాయకులు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు.
కల్లాల వద్దకు వెళ్లి రాజకీయం చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను రైతులు పరుగులు పెట్టించారని చెప్పారు. తమకు మొహం చెల్లక బీజేపీ నేతలు కల్లాల వద్దకు గవర్నర్‌ను పంపించారని ఎద్దేవాచేశారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ అవగాహనారాహిత్యంతో పిచ్చికూతలు కూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత వానకాలంలో డిసెంబర్ వరకు 31 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటికే 42.4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు వివరించారు. 71 శాతం కొనుగోళ్లు పూర్తి చేశామని, రైతుల ఖాతాల్లో రూ. 5,447 కోట్లు జమ చేశామని వివరించారు. ధాన్యం కొనుగోళ్లు ఆపబోమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏడేండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నప్పటికీ.. కాంగ్రెస్, బీజేపీ నేతలు కండ్లుండీ చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయరంగంలో ప్రత్యేకించి వరిసాగులో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఏడేండ్లలో సాగు విస్తీర్ణం 51 శాతం పెరిగిందని వివరించారు. జాతీయ స్థాయిలో వ్యవసాయరంగం వృద్ధి రేటు కేవలం 3 శాతమే ఉండగా రాష్ట్రంలో 31 శాతంగా ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఎఫ్‌సీఐకి 2014లో 24.29 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇవ్వగా 2020-21లో 141 మెట్రిక్ టన్నులు ఇచ్చినట్టు వివరించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యం వల్లనే ఇది సాధ్యమైందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఏటా రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. విద్యుత్తు రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.28,473 కోట్లు ఖర్చుచేశామని, దీంతో రాష్ట్రంలో బోర్‌వెల్స్ సంఖ్య 19 లక్షల నుంచి 30 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్ పాల్గొన్నారు.
త్వరలో యాసంగి రైతుబంధు
యాసంగి సీజన్‌కు సంబంధించిన 8వ విడత రైతుబంధు నిధులను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమచేస్తామని పల్లా రాజేశర్వర్రెడ్డి వెల్లడించారు. రైతుబీమా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1,450 కోట్లను ఎల్ఐసీ ప్రీమియంగా చెల్లిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో మరణించిన 66,123 మంది రైతుల కుటుంబాలను రైతుబీమా పథకం ఆదుకున్నదని చెప్పారు. ఆయా కుటుంబాలకు రూ.3,306 కోట్లు ఎల్ఐసీ ద్వారా చెల్లించినట్టు వివరించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గిన విషయాన్ని ఎన్సీఆర్బీ రికార్డులే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఎన్సీఆర్బీ ప్రకారం 2014-15లో 1,348 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2019లో 471కి తగ్గిపోయిందని గుర్తుచేశారు.
అభివృద్ధిని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ వ్యతిరేక మీడియా
తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసిన టీఆర్ఎస్ వ్యతిరేక మీడియా ఏడేండ్లలో కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని గమనించకుండా రోతరాతలు రాస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమకాలంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే.. ఇప్పుడు తెలంగాణ ప్రగతిని ఒక వర్గం మీడియా జీర్ణించుకోలేకపోతున్నదని పల్లా మండిపడ్డారు. ఇటువంటి శక్తుల నిజస్వరూపం ప్రజలకు ఉద్యమకాలం నుంచే తెలుసునని పేర్కొన్నారు.