
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడిపోయి దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇంటి క్వార్టర్లు, స్థలాలకు పట్టాలివ్వడానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొన్న కాలనీల వాసులతోపాటు, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లోని ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలున్నాయని చెప్పారు. అక్కడ కూడా అర్హులైనవారికి పట్టాలివ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నవారికి శాశ్వత పట్టాలివ్వాలని.. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించారు.
బుధవారం నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ జిల్లా అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొని ఇక్కడే నివాసముంటున్న కాలనీవాసులకు పట్టాలిస్తామని గతంలో మాట ఇచ్చామని, దానిని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ‘మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం ధర్మం. మనది ఇచ్చిన మాట నిలబెట్టుకొనే ప్రభుత్వం’ అన్నారు. ఎన్నికల కోడ్ కూడా తొలగిపోయినందున అర్హులైన సాగర్ కాలనీవాసులకు నియమ నిబంధనలను అనుసరించి కొంత వెసులుబాటు కల్పించి అయినా సరే పట్టాలు మంజూరు చేయాలని అక్కడినుంచే సీఎస్ సోమేశ్‌కుమార్‌కు ఫోన్‌చేసి ఆదేశాలిచ్చారు. ‘దశాబ్దాల క్రితం ప్రాజెక్టుల నిర్మాణాల సందర్భంగా పేద కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే అధికంగా పాల్గొన్నారు. వారు అక్కడే నివాసమున్నారు. అలాంటిదే ఇక్కడ కూడా నాగార్జునసాగర్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. వారంతా తక్కువ స్థలాల్లోనే ఇండ్లు కట్టుకొన్నారు. వారందరికీ పట్టాలివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
నల్లగొండ అభివృద్ధి చెందాలె
రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోదని ఆయన వెల్లడించారు. పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దే కార్యాచరణకు పూనుకోవాలని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ పాటిల్ సహా ఉన్నతాధికారులను ఆదేశించారు. నల్లగొండలో అణువణువూ పరిశీలించేందుకు పాదయాత్ర చేపట్టాలని సూచించారు. శుక్రవారం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, ఆర్అండ్బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నల్లగొండ పట్టణంలో పర్యటించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నల్లగొండకు సిద్దిపేట కమిషనర్
నల్లగొండ పట్టణ అభివృద్ధికోసం. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారిని నల్లగొండకు వచ్చి పనిచేయాలని సీఎం కేసీఆర్ ఫోన్లో ఆదేశించారు. సిద్దిపేటలా నల్లగొండను అభివృద్ధి చేసే దాకా నిద్రపోవద్దని చెప్పారు. నల్లగొండలో జనాభా పెరుగుతున్నందున పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు నిర్మించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని సూచించారు. ఉప్పల్ భగాయత్ మాదిరిగా లాండ్ ఫూలింగ్ చేపట్టి, కాలనీల నిర్మాణాలకు పూనుకోవాలని సూచించారు. గతంలో నల్లగొండ పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండేదని, మిషన్ భగీరథతో అది పూర్తిగా తీరిపోయిందని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.
టౌన్ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన
సమీక్ష అనంతరం నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో ఉన్న ఇరిగేషన్ కార్యాలయాల ప్రాంగణం టౌన్‌హాల్ నిర్మాణానికి ఎంతమేరకు అనువుగా ఉంటుందన్న అంశాన్ని కేసీఆర్ స్వయంగా పర్యటించి పరిశీలించారు. కలెక్టరేట్ నుంచి బస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పట్టణంలో పర్యటించారు. అవుట్డోర్ స్టేడియం, బస్టాండ్ మీదుగా క్లాక్‌టవర్ సమీపంలోని ఇరిగేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ కార్యాలయ ఆవరణను పరిశీలిస్తూ ఎంత స్థలం అందుబాటులో ఉన్నదని ఆరా తీశారు. మిగతా కార్యాలయాలతో కలిసి సుమారు ఏడెనిమిది ఎకరాల స్థలం ఉంటుందని అధికారులు చెప్పగా, ఇందులో బ్రహ్మాండమైన నిర్మాణాల కోసం ప్రణాళికలు సిద్ధంచేయాలని ఆదేశించారు. అనంతరం క్లాక్‌టవర్ మీదుగా ఎన్జీ కాలేజీని పరిశీలిస్తూ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, జీ జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.