హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర ప్రజలు సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఉదయం 11.30కి హైదరాబాద్ అబిడ్స్‌లోని నెహ్రూ సరిల్లో నిర్వహించిన ‘తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతోపాటు వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బేతి సుభాష్‌రెడ్డి, ఏ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, అధికారులు జనగణమన పాడారు.
నెహ్రూకు అంజలి
ప్రగతిభవన్ నుంచి అబిడ్స్ చౌరస్తాకు వచ్చిన కేసీఆర్‌కు ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. సీఎం ముందుగా శాంతి పావురాన్ని ఎగరవేస్తున్న దేశ తొలి ప్రధాని నెహ్రూ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. నిర్దేశిత సమయానికి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారు. చౌరస్తాకు నలుదికులా, పలు భవనాల మీదనుంచి జన సమూహం, సీఎంతో గొంతు కలిపి ముక్తకంఠంతో ‘జన గణ మన అధినాయక జయహే…’ అంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీంతో ఆ ప్రాంతమంతా దేశభక్తి ఉప్పొంగింది. ‘బోలో స్వతంత్ర భారత్ కీ జై’ నినాదం ఆ ప్రాంతమంతా మారుమోగింది. సామూహిక జాతీయ గీతాలాపన ముగియగానే.. ‘జై భారత్’, ‘భారత్ మాతా కీ జై’, ‘జై తెలంగాణ’ అంటూ కేసీఆర్ పిడికిలెత్తి నినదించారు. కే కేశవరావు మాట్లాడుతూ ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో జరుగనున్న వజ్రోత్సవ ముగింపు వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గీతాలాపన
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఉదయం 11.30 గంటల సమయంలో కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడగానే ప్రజలు ఆగి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. సచివాలయమైన బీఆర్కేభవన్తోపాటు అన్ని శాఖల ప్రధాన కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు జాతీయ గీతాలాపన చేశారు. జిల్లాల్లో పర్యటనల్లో ఉన్న మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
జయహే అన్న 13 లక్షల మంది
రాష్ట్రవ్యాప్తంగా 141 పట్టణాలు, నగరాల్లో 13 లక్షల మంది ప్రజలు, విద్యార్థులు ఒకేసారి జనగణమన పాడారు. రాష్ట్రవ్యాప్తంగా 3,230 వార్డులు, 635 ట్రాఫిక్ జంక్షన్లలో, 543 ఇతర ప్రాంతాల్లో 12,87,607 మంది ప్రజలు పాల్గొన్నారని అధికారులు తెలిపారు.
దారిలోనే జనగణమన
మునుగోడులో 20న జరుగనున్న ప్రజాదీవెన బహిరంగసభ ఏర్పాట్ల పరిశీలనకు బయలుదేరిన టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పలువురు టీఆర్ఎస్ నేతలు దారి మధ్యలోనే కారు దిగి జాతీయ గీతాలాపన చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి కవాడిగూడ వద్ద కారు దిగి జాతీయగీతం పాడారు.
నేడు రక్తదాన శిబిరాల నిర్వహణ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ నెల 8 నుంచి 22 వరకు వజ్రోత్సవ ద్విసప్తాహంను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వజ్రోత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉదయం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసే రక్తదాన శిబిరంలో పాల్గొంటారు.
మల్లారెడ్డి యూనివర్సిటీలో 30 వేల మంది..
మేడ్చల్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో 30 వేల మంది విద్యార్థులు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 వేల మంది విద్యార్థులతో జాతీయ గీతాలాపన చేసినందుకు మంత్రి మల్లారెడ్డికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందించారు.