హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తరఫున విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కళాశాలల బంద్‌ను విరమించుకుంటున్నట్టు తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ నేతలు తెలిపారు. గురువారం ప్రకట న విడుదల చేశారు. అంతకుముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఇతర బీసీ సంఘాల నేతలు ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. బకాయిల చెల్లింపు, క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాలేజీలను బంద్ పెట్టాల్సి వచ్చిందని ఆయనకు వివరించారు. కాగా, సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో గురువారం సచివాలయం లో బుర్రా వెంకటేశం టీపీడీఎంఏ నేతలతో చర్చలు జరిపారు. బకాయి ల విడుదలకు చర్యలు చేపడతామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో కాలేజీల బంద్‌ను విరమిస్తున్నామని నేతలు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేశ్‌యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, టీపీడీఎంఏ నాయకులు పాల్గొన్నారు.